
10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి..9లక్షల ఉద్యోగాలు వస్తాయి
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రూ. 10లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని, తద్వారా 9లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం, ప్రజావేదికలో గ్రామస్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
సీఎం మాట్లాడుతూ.. మానవత్వంతో ఆలోచించి పింఛన్లు అందిస్తున్నాం. ప్రతి నెలా ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నా. ఈ రోజు మీ గ్రామానికి వచ్చాను. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం రూ.500 మాత్రమే పింఛన్‌గా ఇస్తున్నారు. మనం వందలో 13 మందికి పింఛన్ అందిస్తున్నాం, అందులో 59 శాతం మహిళలే. పింఛన్‌తో సరిపెట్టలేదు, సూపర్ సిక్స్ పథకాలతో సూపర్ హిట్ చేశాం. అన్ని పథకాలనూ అమలు చేశామన్నారు.
ఆయన మరింత వివరిస్తూ, ‘ఆడబిడ్డలు కష్టపడకూడదని గతంలో దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇప్పుడు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఈ పథకం ప్రారంభమైన 45 రోజుల్లో 10 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చిన తెదేపా ప్రభుత్వం, ఆడబిడ్డలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తున్నారు. పెద్ద వాళ్లు రుణాలు తీసుకుని చెల్లించకపోయినా, మహిళలు మాత్రం బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నారు,‘ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ‘రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. విజయనగరం జిల్లాలో పేదరికం, సాగునీటి కొరత ఉన్నాయి. కానీ, మేం రైతులను ఆదుకుంటాం. ఇప్పటికే రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.6,000 అందించాం, ఇంకా రూ.14,000 అందిస్తాం,‘ అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ‘ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించాం. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Next Story