ఆరోగ్యాంధ్ర కోసం 10 మంది అంత‌ర్జాతీయ నిపుణులు..ఎవరెవరంటే
x

ఆరోగ్యాంధ్ర కోసం 10 మంది అంత‌ర్జాతీయ నిపుణులు..ఎవరెవరంటే

డిసెంబ‌రులో ముఖ్య‌మంత్రి చంద్రబాబు అధ్య‌క్ష‌త‌న క‌మిటీ మొద‌టి స‌మావేశం జరగనుంది.


బ‌హుముఖ వ్యూహాల‌తో ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ల‌క్ష్యంగా జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను స‌మీక్షించి, స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించ‌డానికి రాష్ట్రప్ర‌భుత్వం 10 మంది ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ నిపుణుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌ల‌హా మండ‌లిని నియ‌మించింది. చ‌ర్చ‌ల‌ అనంత‌రం వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌తిపాద‌న‌ను ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సోమ‌వారం ఆమోదించారు. ఆ మేరకు ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సంపూర్ణ ఆరోగ్య ర‌క్ష‌ణ ల‌క్ష్యంగా...2047 నాటికి ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు ముఖ్య‌మంత్రి విజ‌న్ డాక్యుమెంట్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈదిశ‌గా ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లయ్యాయి. అత్య‌ధికంగా ప్ర‌జ‌ల అనారోగ్యానికి కార‌ణ‌మ‌వుతున్న 10 వ్యాధుల‌కు సంబంధించి ఒక్కో వ్యాధికి అడ్వ‌యిజ‌రీ గ్రూపు ఏర్పాటు చేశారు. వ్యాధుల వారీగా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించి ఆయా వ్యాధుల భారాన్ని త‌గ్గించ‌డానికి కృషి జ‌రుగుతోంది. ఆధునిక సాంకేతిక‌తో మెరుగైన వైద్య సేవ‌ల్ని అందించ‌డానికి గేట్స్ ఫౌండేష‌న్, టాటా ఎండి, ఐఐటి చెన్నై మ‌రియు స్వ‌స్థి వంటి సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ప‌లు ప్ర‌ణాళిక‌లు అమ‌ల‌వుతున్నాయి. వీటితో పాటు ప‌లు ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత ఆరోగ్య ప‌థ‌కాలు న‌డుస్తున్నాయి. ఈ ప్ర‌ణాళిక‌ల అమ‌లు, ఫ‌లితాలను స‌మీక్షిస్తూ ఆరోగ్యాంధ్ర సాధ‌న దిశ‌గా ఒక స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించ‌డానికి 10 మందితో కూడిన ఉన్న‌త‌స్థాయి నిపుణుల స‌ల‌హా మండ‌లి(High Level Expert Advisory Group) ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి అంగీక‌రించారు.
నిపుణుల స‌ల‌హా మండ‌లి బాధ్య‌త‌లు
ప్ర‌పంచ వ్యాప్త విధానాలు, అనుభ‌వాలు, సాంకేతిక నైపుణ్యం, వ్యూహ ర‌చ‌న‌ల మేళ‌వింపుతో రాష్ట్రాన్ని ఆరోగ్య రంగంలో అగ్ర స్థానంలో నిల‌ప‌డానికి స‌ల‌హా మండ‌లి చేప‌ట్టాల్సిన బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వం ఈ క్రింది విధంగా స్ప‌ష్టంగా పేర్కొంది.
1) స్వ‌ర్ణాంధ్ర విజ‌న్-2047 మేర‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పూర్తి ఆరోగ్యం, ఆహ్లాదం క‌ల్పించేందుకు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌
2) మాతాశిశు ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ, అసంక్ర‌మిక‌(ఎన్సీడీ) వ్యాధుల నిర్మూల‌న‌కు అవ‌స‌ర‌మైన సృజ‌నాత్మ‌క‌త‌(ఇన్నొవేష‌న్‌)తో కూడిన, విస్తృత స్థాయిలో అమ‌లు చేయ‌గ‌లిగిన మార్గాల‌ను సూచించ‌డం
3) వివిధ ప‌ధ‌కాల ప‌టిష్ట స‌మ‌న్వ‌యం కోసం సాంకేతిక‌త ఆధారంగా ల‌క్ష్యంగా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల్ని సూచించ‌డం
4) రాష్ట్రాన్ని జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో గ్లోబ‌ల్ హెల్త్‌ హ‌బ్ గా రూపొందించ‌డం
వ‌చ్చే నెల‌లో మొద‌టి స‌మావేశం
డిసెంబ‌రు మ‌ధ్య‌లో ఈ ఉన్న‌త స్థాయి అంత‌ర్జాతీయ నిపుణుల స‌ల‌హా మండ‌లి మొద‌టి స‌మావేశం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో జ‌రుగ‌నుంది. ఈ స‌మావేశంలో ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లక్ష్యానికి సంబంధించి వివిధ అంశాల‌పై విస్తృత చ‌ర్చ‌లు జ‌రుగుతాయి. స‌ల‌హా మండ‌లి ఏడాదిలో క‌నీసం రెండు సార్లు స‌మావేశం కావాల్సి ఉంటుంది. అవ‌స‌రాల మేర‌కు అద‌న‌పు స‌మావేశాలు నిర్వ‌హించుకోవ‌చ్చు.
స‌ల‌హా మండ‌లి స‌భ్యులు
1. స‌ర్ పీట‌ర్ ప‌య‌ట్‌, యుఎన్ ఎయిడ్స్ వ్య‌వ‌స్థాప‌క ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌
2. డాక్ట‌ర్ సౌమ్య స్వామినాధ‌న్, డ‌బ్ల్యుహెచ్ఓ మాజీ ప్ర‌ధాన శాస్త్ర‌వేత్త‌
3. ప్రొఫెస‌ర్ ఇక్ ఇంగ్ టేవ్, డీన్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌, సింగ‌పూర్ విశ్వ‌విద్యాల‌యం
4. డాక్ట‌ర్ గ‌గ‌న్ దీప్ ఖాన్‌, డైరెక్ట‌ర్ , బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేష‌న్‌
5. డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్‌రెడ్డి, ఛైర్మ‌న్ , ఎఐజి హాస్పిట్ హైద‌రాబాద్
6. ప్రొఫెస‌ర్ మార్గ‌రెట్ ఎలిజిబెత్ క్రుక్, హార్వ‌ర్డ్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌
7. డాక్ట‌ర్ నిఖిల్ టాండ‌న్‌, ప్రొఫెస‌ర్ ఎయిమ్స్ న్యూఢిల్లీ
8. రిజ్వాన్ కొయిట, ఛైర్మ‌న్ నేష‌న్ ఎక్రెడిటేష‌న్ బోర్డ్ ఫ‌ర్ హాస్ప‌ట‌ల్స్‌(ఎన్ఎబిహెచ్‌)
9. శ్రీకాంత్ నాద‌ముని, ఖోస్ల ల్యాబ్స్ వ్య‌వ‌స్థాప‌కులు
10. మిస్ ఆర్తి అహుజా, ఐఎఎస్‌, కేంద్ర ప్ర‌భుత్వ మాజీ కార్య‌ద‌ర్శి
Read More
Next Story