
మీడియాతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ
ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదా?
ప్రకృతి వైపరీత్యాలు, తొక్కిసలాటలు వంటివి సంభవిస్తున్నా ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రైతులు, ప్రజల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇటీవల మొంథా తుఫాన్‌కు వాటిల్లిన నష్టంపై గాని, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో భక్తుల మరణాలపై గాని వారి వైఖరి చాలా బాధాకరంగా ఉంటోందన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే?
మాటలు తప్ప చేతల్లేవ్..
‘మా ప్రభుత్వం (వైఎస్సార్‌సీపీ) హయాంలో రైతుకు పెట్టుబడి రాయితీని సత్వరమే చెల్లించే వారం. ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను పక్కనబెట్టి, ఈ–క్రాప్ విధానంతో రైతే పంటల బీమా సొమ్ము చెల్లించేలా నిబంధనలు మార్చింది. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై పడింది. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటల నష్టపరిహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు మాటలే చెబుతున్నారు తప్ప చేతల్లేవు. ఏ రైతుకు ఎంత నష్టం వాటిల్లింది? వాటికి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు? బీమా సొమ్ము ఎంత వస్తుంది? అన్నది సత్వరమే వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రూ.2.25 లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా? ఆ సొమ్ము ఏం చేశారు? ఏదైనా రైతుల గురించి మాట్లాడితే బురద జల్లుతున్నారంటున్నారు. మా హయాంలోనే రైతులకు మేలు జరిగింది. మా ప్రభుత్వ పాలనలో రైతుకు ఇంటి వద్దకే అన్నీ ఇచ్చాం. రైతుకు బీమా సొమ్మును ప్రభుత్వం ద్వారానే చెల్లించాం. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో ఏ జిల్లాకు ఎంత ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూ్యరెన్స్ సొమ్ము ఎంత ఇచ్చారో చెప్పాలి. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఖండిస్తున్నాం.
శాంతి భద్రతల పర్యవేక్షణ గాలికి..
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ గాలికొదిలేశారు. ఇటీవల కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆరోజు అక్కడకు 15 వేల మంది భక్తులు వస్తే ఒక్క పోలీసూ లేరు. జనం ర ద్దీని నియంత్రించే బాద్యత ప్రభుత్వానిది కాదా? కాశీబుగ్గలో ఆలయం ప్రైవేటు అజమాయిషీలో ఉందని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే చెబుతున్నారు. గ్రామాల్లో దేవాలయాలు, అమ్మవార్ల గుడులు ప్రైవేటువి ఉంటాయి. అక్కడ జరిగే జాతర్లలో పోలీసులు విధులు నిర్వహించడం లేదా? ముందస్తు ప్రణాళిక అక్కర్లేదా? అంతకు ముందు తిరుపతి, సింహాచలంల్లో జరిగిన తొక్కిసలాటల్లోనూ భక్తులు చనిపోయాక కూడా తీరు మార్చుకోరా? ఆ ఘటనల నుంచి ఏం నేర్చుకున్నారు? నీ ప్రాణమైతే ఒకటి, పక్కోడి ప్రాణం అయితే ఒకటా? ప్రజలు అందుకే అధికారం ఇచ్చారా? ఐదేళ్లూ ప్రజలకు కస్టోడియన్ సీఎం కాదా?
అదేమి దౌర్భాగ్యమో గాని..
అదేమి దౌర్భాగ్యమో గాని చంద్రబాబు ఎప్పడు సీఎం అయినా రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయి. జగన్ హయాంలో ఇలా ఒక్కటైనా జరిగిందేమో చెప్పమనండి .రైతులు, భక్తులు, పేదలు, విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రికి బాధ్యత లేదు. ప్రజలే నష్టపోతున్నారు? ప్రభుత్వానికి ఇప్పటికైనా బాధ్యత రావాలి. అహం తగ్గించుకోవాలి. తొక్కిసలాటల ఘటనల్లో ఎవరిపైనా చర్యల్లేవు. ప్రభుత్వంపై భయం, భక్తి, గౌరవం రావాలంటే యాక్షన్ ఉండాలి. ఎంతసేపూ వైసీపీ నేతలను ఎలా ఇరికించాలన్న ధ్యాసే. రాజకీయంగా ప్రజల నుంచి లబ్ధి పొందాలన్న ఆలోచనే తప్ప మరొకటి లేదు. రాబోయే రోజుల్లో దేవాలయాల్లో తొక్కిసలాట జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. ఎప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడినా అప్పుడు ఏదొకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
డ్రగ్స్ నిందితులెవరైనా చర్యలు తీసుకోవల్సిందే..
విశాఖలో ఇటీవల డ్రగ్స్‌తో పట్టుబడిన నిందితులెవరైనా చర్యలు తీసుకోవలసిందే. మా పార్టీ విధానం కూడా అదే. మా హయాంలో వైజాగ్‌లో డ్రగ్స్ లేవు. ఎన్నికల ముందు రూ.25 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడితే నేనే సీబీఐకి లేఖ రాశాను. విశాఖకు వచ్చే గూగుల్ డేటా సెంటర్‌ను మేం ఆక్షేపించలేదు. అదానీ డేటా సెంటర్‌ను కూడా మా అధినేత జగనే తెచ్చారు. దివంగత వైఎస్‌ఆర్ పాలనలో భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు గారూ.. మీ ప్రభుత్వంతో ఎప్రోచ్ రోడ్లయినా వేయించండి. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు రామ్మోహన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్టు దొరికింది. జగ¯Œ హయాంలో విశాఖలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌పై ఏం నిర్ణయం తీసుకున్నారు? దీనిని ఎంతో అద్భుతమని మీరంతా పొగిడారు.
వైజాగ్ సమ్మిట్ వంటి వాటికి కేటాయిస్తే వైజాగ్ ఖ్యాతి ఇనుమడిస్తుంది. ఓపెన్ టెండర్ పిలవండి. విశాఖలో యోగా డేకి రూ.130 కోట్లు ఖర్చు పెట్టారు. అది వేస్ట్ కాదా? బాలకృష్ణ అసెంబ్లీకి తాగొస్తే చర్యలు తీసుకోవాలి కదా? తీసుకున్నారా? మీ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రచారం తప్ప ఏముంది?’ అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
Next Story

