సీపీఐ ఏపీ కార్యదర్శి ఈశ్వరయ్య, ముప్పాళ్లకు మొండిచేయి
x
సీపీఐ కార్యదర్శిగా ఈశ్వరయ్య

సీపీఐ ఏపీ కార్యదర్శి ఈశ్వరయ్య, ముప్పాళ్లకు మొండిచేయి

కుల సమీకరణలు కుదరలేదు. అనివార్యమైన ఎన్నికను నివారించే క్రమంలో ఈశ్వరయ్యది పైచేయి అయింది.


సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఆయన ఎన్నికైనట్టు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి పోటీ పడిన మరో సీనియర్ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో ఈశ్వరయ్య ఎన్నికల ఏకగ్రీవం అయింది.

ఒంగోలులో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో కార్యదర్శి ఎన్నిక వ్యవహారమై వివాదం ఏర్పడిన నేపథ్యంలో మంగళవారం విజయవాడలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. 102 మంది కౌన్సిల్ సభ్యులు, ఆహ్వానితులు, 9 మంది కంట్రోల్ కమిషన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన కె.రామకృష్ణ పర్యవేక్షణలో ఈ కీలక సమావేశం జరిగింది. పార్టీ నూతన కార్యదర్శి ఎన్నికే ప్రధానాంశంగా ఈ సమావేశం జరిగింది.
సాధారణంగా పార్టీ మహాసభల్లోనే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం సీపీఐ ఆనవాయితీ. అయితే ఆగస్టులో ఒంగోలు మహాసభలో పార్టీ కార్యదర్శిపై ఏకాభిప్రాయం కుదర్లేదు. దీంతో పార్టీ జాతీయ మహాసభ తర్వాత కార్యదర్శిని ఎన్నుకోవాలన్న మౌఖిక ఒప్పందంతో వాయిదా వేశారు. జాతీయ మహాసభలు ముగిసిన తర్వాత రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకుంటామని సీపీఐ అగ్రనాయకత్వం అప్పుడు ప్రకటించింది.
ప్రస్తుతం జాతీయ మహాసభలు ముగియడంతో రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె.రామకృష్ణ జాతీయ కార్యదర్శివర్గానికి ఎన్నికయ్యారు. డాక్టర్ కె.నారాయణ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ అయ్యారు.
ఒంగోలు మహాసభలో కె.రామకృష్ణ పేరు ప్రతిపాదించినప్పటికీ ఈశ్వరయ్య వర్గం అంగీకరించలేదు. పార్టీ మహాసభల వేదిక ముందే అరుపులు, కేకలతో హోరెత్తించారు. ఆవేళ వేదికపై డి.రాజా, నారాయణ, రామకృష్ణ ఉన్నప్పటికీ ఈ గొడవ జరిగింది. ఈశ్వరయ్యను ఒప్పించాలని ప్రయత్నం జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదు. సామాజిక వర్గాల సమస్య కూడా తెరపైకి వచ్చింది. కార్యదర్శి పదవికి పోటీ పడిన వారిలో ఒకరు రాష్ట్రంలోని ఓ పెద్ద సామాజిక వర్గానికి చెందిన వారు కాగా మరొకరు బలహీనవర్గాలకు చెందిన వారు. దీంతో ఆవేళ పార్టీ కార్యదర్శి ఎన్నికను వాయిదా వేశారు. ఆ తర్వాత పార్టీ జాతీయ మహాసభ చండీఘడ్ లో జరిగింది. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక జరిగింది.
ఆంధ్రప్రదేశ్ పార్టీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా స్వయంగా పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజానే స్వయంగా పరిశీలకులుగా వచ్చారు. అయినప్పటికీ ఈశ్వరయ్యను శాంతింపజేయలేకపోయారు. ఎన్నికను నివారించే క్రమంలో కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్యనే కార్యదర్శిగా ఏకగ్రీవం చేశారు. ఏపీ నూతన కౌన్సిల్ 102 మందితో ఎన్నికవ్వగా.. 33మందిని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
గుజ్జుల ఈశ్వరయ్య కడప జిల్లా వాసి. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ లలో పని చేశారు. ఆ తర్వాత పార్టీ కడప జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన కులాంతర వివాహం చేసుకున్నారు. ఆయన భార్య ఓ ఛానల్ జర్నలిస్టు. ఆయన అత్తగారి జిల్లా ప్రకాశం. ఆయన అత్త గారు కూడా ప్రకాశం జిల్లా పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఈశ్వరయ్య సోదరుడు ఓబులేసు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె.రామకృష్ణ కూడా ఆయన సమీప బంధువే.
పార్టీ కార్యదర్శి పదవికి పోటీ పడిన ముప్పాళ్ల నాగేశ్వరరావు సుదీర్ఘకాలం పార్టీకి సహాయ కార్యదర్శిగా పని చేశారు. ఇప్పుడు ఆయనకు రాష్ట్రంలో సీఆర్ ఫౌండేషన్ తరఫున వృద్ధాశ్రమం నిర్మించే పనిని అప్పగించినట్టు తెలుస్తోంది.
పార్టీలో యువకులు ఈశ్వరయ్యను సమర్థించినట్టు సమాచారం. యువనాయకత్వంలో పార్టీని పునర్ నిర్మించడం సాధ్యమనే భావనతో జాతీయ నాయకత్వం కూడా ఈశ్వరయ్య వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నాయకత్వం ముప్పాళ్ల నాగేశ్వరరావు వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఈశ్వరయ్య ఇప్పుడు ఈ శాఖలను కలుపుకుని పని చేయడం కత్తి మీద సామె అవుతుందని పార్టీ నాయకుడొకరు చెప్పారు.
Read More
Next Story