
శ్రీకూర్మం ఆలయంపై చిత్రించిన పెయింటింగ్ (ఫోటో వలేటి గోపీచంద్)
'మంచెం' కుంచె: శ్రీకూర్మం కుడ్య చిత్రాల పునఃసృష్టి
శ్రీ కూర్మం దేవాలయం గోడల మీద ఉన్న చిత్రాలను ఒక తపనతో, పట్టుదలతో 3 ఏళ్ల పాటు శ్రమించి తిరిగి అలానే గీశారు..
(వలేటి గోపీచంద్)
1945 లో ఏర్పడిన బాపట్ల వ్యవసాయ కళాశాల ప్లాటినమ్ జూబ్లీ నేపథ్యం లో నేను మిత్రులు తో కలిసి నాలుగు పుస్తకాలు తీసుకు వచ్చాను. "ఒక నేల అనేక ఆకాశాలు" పేరుతో కళాశాల చరిత్ర , వివిధ రంగాల్లో మంచి ప్రతిభ చూపించి ప్రభావితం చేసిన వ్యక్తుల జీవన రేఖలను వెలుతురు తోవలు, వెలుగు పూలు, వెలుగు దివ్వెలు గా ప్రచురించి సముద్రం లో ఒక నీటి బొట్టును ఒడిసి పట్టటం జరిగింది. ఆ సమయంలో చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించిన 1973 బ్యాచ్ పూర్వ విద్యార్థి ఆంధ్రా బ్యాంకు లో ఉన్నత స్థాయిలో పదవి విరమణ చేసిన మంచెం సుబ్రమణ్యం జీవన రేఖలను కూడా తోటి ప్రపంచానికి పరిచయం చేశాం.
ఇటీవల కవి, చిత్రకారుడు ఆత్మకూరు రామ కృష్ణ, మంచెం(Manchem) సుబ్రమణ్యం పునః సృష్టించి ప్రచురించిన శ్రీ కూర్మం కుడ్య చిత్రాలు మీద రాసిన సమీక్ష చదివిన తర్వాత ప్రవృత్తిలో మంచేం పూర్తి ప్రతిభ అర్థమయింది. ఇప్పటికే వారి బ్యాచ్ ఆత్మీయ కలయిక లో ఆ పుస్తకాలు అందరికీ కానుకగా ఇచ్చారు.
అసలు ఇప్పుడు హఠాత్తుగా వీరి గురించి ప్రత్యేకంగా అందరూ ఎందుకు మాట్లాడు తున్నారంటే శ్రీ కూర్మం దేవాలయం గోడల మీద ఉన్న చిత్రాలను ఒక తపనతో, పట్టుదల, సంకల్ప బలంతో, దీక్షతో తపస్సు గా భావించి 3 ఏళ్ల పాటు శ్రమించి తిరిగి అలానే గీశారు. కాదు పునః సృష్టి చేశారు. ఇప్పటికే చిత్రకళారంగంలో ఉన్న సుప్రసిద్ధులు శభాష్ అన్నారు. ఔరా అని ముక్కుమీద వేలు వేసుకున్నారు. ముఖ్యంగా వీరు దేవాలయం గోడల మీద చిత్రాలను పరిశీలించి, సమగ్రంగా అవగాహన చేసుకుని, మదినిండ ఆలోచనలను ప్రోది చేసుకుని, చర్చించుకుని , మూలంలోని గాఢతను, భావాన్ని , రసజ్ఞతను ఏకాగ్రత తో ఒడిసిపట్టి తన కుంచె తో పరిమళింప చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాల లో సుప్రసిద్ధ చిత్రకారుడు, శిల్పి ఉల్చి ఒడిలో నేర్చుకున్న గీతలను, మననం చేసుకుంటూ , గురువును తలుచుకుని , ఈ కుడ్య పరిమళాలు చూసే వారి మనస్సులో పది కాలాల పాటు గుర్తుండి పోయేలా కట్టి పడేశారు.
మంచెం సుబ్రమణ్యం
విష్ణు రెండో అవతారం కూర్మావతారం. సాగరమథనం వేళ కూర్మరూపునిగా వెలసిన విష్ణువుని భూమండలంపై కూర్మనాథునిగా కొలిచే ఏకైక ఆలయం శ్రీకూర్మం. సాధారణ భక్తులు కూడా గుర్తించే విశేష విశేషాలు ఎన్నో ఇక్కడ. చిత్రకళ ప్రేమికులను ఆకర్షించే ఓ ముఖ్యమైన అంశం ఈ దేవాలయ అంతర మండప గోడలపై దాగి ఉంది. కుడ్యచిత్రాల(వాల్ పెయింటింగ్స్)ను మ్యూరల్ పెయింటింగ్స్ అంటారు. ఇప్పటికీ ఆ దేవాలయం లోపలి గోడలపై దర్శనమిస్తున్నాయి. పూర్వచిత్రకారుల ప్రతిభాపాఠవాలకు నిలువెత్తు నిదర్శనం ఆ చిత్రకళా నైపుణ్యం. ఆ వైభవాన్ని సాధారణ కళ్ళు పెద్దగా చూడలేవు. కేవలం చిత్రకారులు కు మాత్రం ఓ నలభై శాతం మేర తెలిసే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. అటువంటి చిత్రాలను భద్రపరచటం కూడా కష్టమేమో. అయితే బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి గా, ఉల్చి గారి శిష్యుడు గా ఒక ‘మంచెం’ కుంచె అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. చిత్రకళా రంగం లో కూడా బాపట్ల వ్యవసాయ కళాశాల ఘనమైన చరిత్ర ను నిలబెట్టి చూపారు. ఆంధ్రాబ్యాంకులో పదవి విరమణ చేసిన తరువాత చిత్రలేఖనాన్ని బయటకు తీశారు. ఇన్నేళ్లుగా తనలో దాగి ఉన్న కళా తృష్ణ కు ప్రాణం పోశారు. అవిశ్రాంతంగా శ్రమించారు. అపూర్వంగా కృషిచేసి ఆ కుడ్య చిత్రాల్లో దాగిన కళను వెలికి తీసి , ఆ వెలుగును నలుదిక్కులు పరచేలా పుస్తకం గా ప్రచురించారు. ఈ ఉరుకులు, పరుగుల ప్రపంచం లో దేనిని ఎలా చూడాలో తెలియదు. ఎలా అర్ధం చేసుకోవాలో తెలియదు. ప్రతి సృజనాత్మక ప్రక్రియ ఆస్వాదనకు ప్రేక్షకుడు, ఆదరణకు పోషకుడు కరవు కదా!
గోడలపై చిత్రాలు గీసే పద్ధతి, వాడే రంగులు వేరు. అయితే రావు గారు ట్రాన్స్పరెంట్ రంగులను వాడడంలో దిట్ట గా పేరు పొందారు. వాష్ టెక్నిక్ అనేది అతి పురాతన పద్ధతి అని అందరికీ తెలిసిందే . దీనిలో వాటర్ కలర్స్ వేసిన తర్వాత, ఆ కాగితం మీద ఇంకిన ఆ రంగును ఎంత పట్టి ఉంచు కోగలదో అంతే ఉంచి మిగతా రంగును వాటర్ వాష్ తో తీసివేయటం దీని ప్రత్యేకత. అలా ఒక పొర మీద మరో పొర వేస్తూ ఆ చిత్రంలో వెలుగునీడలను నిర్ధారణ చేసుకుంటూ , దృశ్యవాస్తవికతను తెలియ జేయటం కోసం చిత్రకారుడు శ్రమిస్తాడు. మంచెం ఈ సాహసాన్ని బాధ్యతగా తీసుకొని,భుజాన వేసుకుని చిత్రరచనకు పూనుకొని విజయం సాధించారు. తన సృజనకు మెరుగులు దిద్దారు. ఒక రకంగా చెప్పాలంటే తన ప్రవృత్తిలో వృత్తికంటే ఎక్కువ ఆనందం పొందారు. దానిని ఆస్వాదించారు కూడా. అందుకే అంతటితో ఆగక పుస్తకం రూపంలో కూడా తీసుకు వచ్చారు. ఇంత కృషి చేశాక,
“ఇంతకూ ఆ గోడలపై వెలసి, వెలిసిపోతున్న చిత్రాలను కాపాడాలన్న తపన, ఆలోచనను సుబ్రమణ్యేశ్వర రావు గారు ఆ దేవాలయ అధికారుల్లో తీసుకు రాగలిగరా ?” అన్నది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న అని చెప్పవచ్చు. వాష్ టెక్నిక్ లో చిత్రాలను వేస్తున్న వారు చాలా అరుదుగా ఉన్నారు. నేటి తరం చిత్రకారులకు ఇది అపరిచితంగానే ఉండిపోయింది. కూడా. శ్రీకూర్మం కుడ్యచిత్రాల రూపకర్తల లో పరకాయ ప్రవేశం చేసిన మంచెం కుంచె పేరు తెలియని, చరిత్రకు అందని ఆ మహా మహా చిత్రకారుల ప్రతిభకు శాశ్వతత్వాన్ని ఇచ్చింది. అమరత్వాన్ని ఇచ్చింది. వారిని చిరస్మరణీయుల్ని చెసింది. ఉల్చి శిష్యుడిగా తనను తను కీర్తి మంతం చేసుకున్నారు.
ఈ పుస్తకం చూసినవారు శ్రీకూర్మం వెళ్ళకమానరు. వెళ్లినవారు తమ యాత్ర ఇంత అసంపూర్ణంగా ముగిసిందా అన్న అసంతృప్తిలో పడిపోతారు. శ్రీకూర్మ క్షేత్రం తాబేలుకు మల్లే తలా, కాళ్లు, చేతులను దాచుకున్నట్లుగా ఈ చిత్ర సంపదను తనలో దాచుకున్నది. అరుదైన ఈ చిత్ర సంపదను మంచెం గారి కుంచె చలువతో మనమందరం వీక్షించగలుగుతున్నాం స్పష్టంగా. వీరు చేసిన చిత్రకళా సేవను నారాయణ సేవగా భావిస్తున్నాను అన్న ఆత్మకూరు రామకృష్ణ మాటలు అక్షర సత్యాలు. స్పష్టతను కోల్పోయిన ఆ చిత్రాల నుండి కడిగిన ముత్యాల్లాంటి చిత్రాలను తీర్చిదిద్దిన మంచెం కు జరుగుతున్న సన్మానం చిత్రకళకు చేస్తున్న సన్మానం. బాపట్ల వ్యవసాయ కళాశాల లో ఉల్చి శిష్యులందరికీ సామూహికంగా చేస్తున్న సత్కారం. ఆగస్టు 10 న గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామమోహన్ నాయుడు ఈ పుస్తక రచయితను సన్మానిస్తున్నారు.
(రచయిత- ఆకాశవాణి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూటివ్ (రిటైర్డ్), ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల సంఘం మాజీ కన్వీనర్)
Next Story