విజయవాడలో వర్ష బీభత్సం
x

విజయవాడలో వర్ష బీభత్సం

జనజీవనం స్తంభించింది. వరి, మొక్క జొన్న, మామి, అరటి పంటలు తీవ్రంగా నష్ట పోయాయి.


విజయవాడలో వర్షాలు బీభత్సం సృంచాయి. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం వరకు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడి పోయిన జనం ఆదివారం అకాల పిడుగుపాటు వర్షాలతో సతమతమయ్యారు. ఆదివారం తెల్లవారు జాము నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. పలు రహదారులపై నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులైన బందరు, ఏలూరు రోడ్లు వర్షపు నీటితో కాల్వలను తలపించాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వేసవి ఉక్క పోతకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగర వాసులకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినా.. ఈదురు గాలులతో కూడి వర్షాలు పడటంతో ఆందోళనలకు గురయ్యారు.

నగరంలోని మొగల్రాజపురం, పటమట ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. శివారు ప్రాంతాలు, చిట్టనగర్‌ వంటి ప్రాంతాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌ వంటి పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి పోయింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డును క్లోజ్‌ చేశారు. శ్రీకనకదుర్గానగర్‌ ద్వారా భక్తులకు దుర్గమ్మ దర్శనానికి ఏర్పాట్లు చేశారు.
ఆర్టీసీ బస్టాం, రైల్వేస్టేషన్‌ సమీపంలోని అండర్‌ బ్రిడ్జిలు నీటితో నిండిపోయాయి. ఈదురు గాలుల దెబ్బకు అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. ఆదివారం తెల్లవారు జామున నగరంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది. కృష్ణా జిల్లా కంకిపాడులో వీచిన ఈదురు గాలులకు హోర్టింగ్‌లు, చెట్లు కూలి పోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పెనమలూరు, గన్నవరం నియోజక వర్గాల పరిధిలో కూడా భారీ వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లపైనే చెట్లు నేలకొరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వరి, మొక్క జొన్న, మామిడి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో మామిడి రైతులు ఆందోళనలు చెందుతున్నారు. మామిడి కాయలు రాలి పోతుండటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. మైలవరం మార్కెట్‌ యార్డులో మొక్కజొన్న నిల్వలు కూడా నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, వీటి ప్రభావం మరో రెండు రోజులు కొనసాగుతాయని, దీంతో పలు రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన పిడుగు పాటు వర్షాలు పడుతాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమ, మంగళవారాల్లో కూడా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ జిల్లాలతో పాటు అనకాపల్లి, కాకినాడ, ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్పాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించింది.
Read More
Next Story