ప్రజాయుద్ధమంటే జగన్ మదిలో ఏమున్నట్టు?
x

ప్రజాయుద్ధమంటే జగన్ మదిలో ఏమున్నట్టు?

అసెంబ్లీకి వెళ్లవు.. రాజీనామా చేయవు.. అయినా బాబుతో యుద్ధమేనా! ఇదెలా సాధ్యం జగన్ అంటున్నారు ఆయన్ను అభిమానించే వైసీపీ అభిమానులు..


వైఎస్ జగన్ ఓ వినూత్న స్టాండ్ తీసుకున్నారు. 'ప్రతిపక్ష హోదా ఇవ్వరు కనుక అసెంబ్లీకి వెళ్లం, అయినా ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేయం, యుద్ధం చేస్తాం' అంటున్నారు తప్ప స్పష్టత ఇవ్వడం లేదు. జగన్ వైఖరేమిటో అర్థం కావడం లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శలకు లంకించుకుంటున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోతే సభకు వెళ్లను అనడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నాయి. జగన్ వైఖరిని నెటిజన్లు ప్రత్యేకించి ఆయన్ను బాగా మెచ్చుకునే యువకులు సైతం దీన్ని తప్పుబడుతున్నారు. ధైర్యసాహసాలకు, ధిక్కార స్వరానికి మారుపేరైన వైఎస్ జగన్ ధోరణేమిటో అర్థం కావడం లేదని ఆక్షేపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24న వెలగపూడిలో ప్రారంభం అయ్యాయి. ఈ సభకు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి, ఆయన సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగం సందర్భంగా 11 నిమిషాల పాటు నిరసన తెలిపి సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ మీడియాతో, వైఎస్ జగన్ పార్టీ నేతలతో విడివిడిగా మాట్లాడుతూ చెప్పిన మాటల సారాంశం ఏమిటంటే... "మేము మా ఆందోళనను వ్యక్తం చేశాం. స్పందన రాలేదు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం పనిచేయదు. సభలో ఉన్నవి రెండే పక్షాలు ఒకటి అధికార పక్షం రెండు ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షంగా మేమున్నాం కనుక మాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని డిమాండ్ చేశాం". వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలనే మా డిమాండ్ కు అంగీకరించడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం లేదు అని బొత్స సత్యనారాయణ అంటున్నారు. మా నాయకుడు గ్రౌండ్ లెవల్లోకి వెళితే స్పందన ఎలా ఉంటుందో ఓ శాంపిల్ కూడా చూపించామన్నారు. రైతుల సమస్యను హైలైట్ చేయడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన తర్వాత ప్రభుత్వమే వణికిపోయిందన్నారు.

ఆయన ఆ మాటలు చెప్పిన గంట తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసెంబ్లీలో రెండవ అతిపెద్ద స్థానాలను పొందిన రాజకీయ పార్టీ మాది. ప్రతిపక్షం కావాల్సివస్తే మా పార్టీ కావాలి గాని వైసీపీ ఎలా అవుతుందీ? 11 సీట్లు వచ్చిన పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు అన్నారు. ప్రతిపక్ష హోదా గుర్తింపు పొందడానికి కనీసం 18 సీట్లు ఉండాలని, ఓట్ల దామాషా ప్రకారమే ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే జర్మనీ వెళ్లడం మంచిదని చురకవేశారు.
“వైఎస్ఆర్సీపీ అనేది గందగోళానికి పర్యాయపదం. వారు మూడవ అతిపెద్ద పార్టీ వైసీపీ. జనసేన రెండవది. కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్న వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడంలో అర్థం ఏమిటి? అంటే ప్రజల ఆదేశాన్ని ప్రశ్నిస్తున్నారా?" అన్నారు పవన్ కల్యాణ్.
ప్రతిపక్ష హోదా రావాలంటే..
"చట్టం ప్రకారం, అత్యధిక సీట్లు కలిగిన ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా లభిస్తుంది. 10% కంటే తక్కువ సీట్లు ఉన్న ఏ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాదు. 2014-19లో పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు రాలేదు, వారికి ప్రతిపక్ష పార్టీ హోదా లభించలేదు" అని బీజేపీ నేత జి.వి.ఎల్. నరసింహారావు అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కూడా అదే చెబుతోంది.
ప్రజాస్వామ్యంలో అంకెలే ప్రధానం. ఓట్ల శాతం ప్రధానం కాదు. ప్రతిపక్ష హోదా అడగడంలో తప్పు లేదు. కానీ రాజ్యాంగం మాత్రం మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు వచ్చిన పార్టీకే చట్టసభల్లో ప్రతిపక్షహోదా అంటోంది. ఈ విషయం మాజీ ముఖ్యమంత్రికి తెలియంది కాదు. అయినా వైసీపీ ఈ వ్యవహారమై కోర్టుకు వెళ్లింది. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తోంది.
వైసీపీ వాదన ఇదీ...
ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును పట్టించుకోలేదని, 40% ఓట్ల వాటా ఉన్న పార్టీని గుర్తించడంలో విఫలమైందని వైసీపీ నేత జగన్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయడానికి, విధానాలను ప్రశ్నించడానికి తమకు ఆ హోదా కావాలన్నారు. జనసేనకు 21 సీట్లు వచ్చినా ఆ పార్టీ అధికారంలో పాలుపంచుకుంది కనుక తామే ప్రతిపక్షం అంటున్నారు. అది ఇచ్చే వరకు సభకు వెళ్లబోమంటున్నారు. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు మీడియా ద్వారా ప్రజా సమస్యలను క్రమం తప్పకుండా మీడియా ముందు లేవనెత్తాలని జగన్ కోరారు. ఆధారాలు, వాస్తవాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అయితే కౌంటర్ దాఖలు చేయడానికి స్పీకర్ ఇంకా స్పందించలేదని జగన్ అన్నారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చట్టసభ జరుగుతున్నప్పుడు ఈ విధంగా మీడియాపై ఆధారపడడాన్ని వైసీపీ అభిమానులు కూడా తప్పుబడుతున్నారు.
జగన్ నుంచి యువత కోరుకుంటున్నదేమిటీ...
"జగన్ ని యువకులు పోరాటయోధుడిగాను, ధిక్కారస్వరానికి ప్రతినిధిగాను గుర్తిస్తున్నారు. 2019 ఎన్నికల్లో దాన్నే నిరూపించారు. అటువంటి వ్యక్తి అసెంబ్లీకి దూరంగా ఉండాలనుకోవడం సబబు కాదు. 2014లో జగన్ ప్రతిపక్ష నాయకుడు. టీడీపీ నుంచి కోడెల శివప్రసాద్ స్పీకర్. ఆ సమయంలో ఆయనకు ఎదురైన అవమానాలు అన్నీ ఇన్ని కాదు. జగన్ మాటను సభలో వినిపించడానికి ఆనాటి స్పీకర్ ఇచ్చిన అవకాశాలు తక్కువే. చివరకు ఆయన సభను బహిష్కరిస్తున్నట్టు ప్లీనరీలో ప్రకటించి ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. 2019లో సత్తాచాటారు. ఇప్పుడు 11 సీట్లతో ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాను కోరుకుంటున్నారు. ఒకవేళ కోర్టు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పినా ప్రస్తుత స్పీకర్ ఆయన చెలకట్టనిస్తారా అనేది ప్రశ్నార్థకమే. ఈ దశలో తన పోరాట సత్తాను నిరూపించుకోవాలనుకుంటే తేల్చుకోవాల్సింది- గతంలో (తెలంగాణ ఉద్యమ సమయంలో) టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినట్టు రాజీనామా చేసి 11 సీట్లను మళ్ళా గెలిపించుకుని తన సత్తా చాటాలి. లేదనుకుంటే సభలోనే ఉండి గతంలో ఉన్న అవమానాలు తిరిగి ఎదుర్కోవడం చేయాలి గాని ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాను అనడంలో అర్థం లేదు. భారతీయ ప్రజాస్వామ్యంలో అంకెలే తప్ప ఓట్ల శాతాలకు విలువ లేదు. ఈ విషయం జగన్ కి తెలియనిది కాదు. కనుక జగన్ తన సత్తాను నిరూపించుకోవాల్సిన సమయం మరోసారి ఆసన్నమైంది. అది సభలోనా సభ బయట అనేది ఆయనా, ఆయన పార్టీ తేల్చుకోవాల్సిన అంశం" అన్నారు సీనియర్ జర్నలిస్టు ఎం.శ్రీనివాసరావు.
శ్రీనివాసరావు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. జగన్ లో తమను చూసుకుంది యువత. అందుకే ఆయనకు 2019లో అత్యధిక సీట్లను ఇచ్చింది. 2024 ఎన్నికల్లో ఓడినా ఆయన ఫీనిక్స్ పక్షి మాదిరి ఉవ్వెత్తున ఎగిసిపడాలే తప్ప చంద్రబాబు బృందానికి భయపడి సభకు వెళ్లకపోవడం విస్మయమే. ఈ 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా రాదని, వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని పవన్ కల్యాణ్ స్పష్టం చేయడమంటే అది ప్రభుత్వ వైఖరనే అనుకోవాలి.
అనర్హత వేటు తప్పించుకునేందుకేనా?
ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేదే. అందుకోసం ఈ నాలుగేళ్లు ఎలా పోరాటం చేయాలో జగన్ ప్లాన్ చేసుకోవాల్సిందే. అందుకు రాజీనామా చేసి అలజడి సృష్టిస్తారా లేక అసెంబ్లీకి పోకుండా అనర్హత వేటు పడేలా చేసుకుని జనం మధ్యలో ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం ఇది.
జగన్ మెడపై ఇంకా వేలాడుతున్న 60 రోజుల అనర్హత వేటు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఫిబ్రవరి 24న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హజరు అయినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే గవర్నర్ ప్రసంగం మాత్రమేనని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో వరుసగా 60 రోజులు సభ్యుడు సమావేశాలకు హజరు కాకపోతే సీటు వేకెంట్ అనే డిక్లేర్ చేసే అధికారం స్పీకర్ కి ఉంది.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి. ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటా. ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి అంటున్నారు జగన్. అంటే దీనర్థం అసెంబ్లీకి వెళ్లబోమనే. అలాంటపుడు వైసీపీ జనం నోళ్లలో నానాలంటే ఏదో ఒక కార్యాచరణకు పూనుకోవాలి. రాజీనామాలకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ముందుకు రాకుంటే కనీసం సీనియర్లు అయినా రాజీనామా చేసి తిరిగి గెలవాలి. ప్రజల్లో తమ స్థానం పదిలంగా ఉందని నిరూపించుకోవాలి. అప్పుడు మాత్రమే అధికార పక్షం ఎంతో కొంత దిగివస్తుంది. జగన్ తన సత్తాను చాటినట్టవుతుంది. అంతే తప్ప సభకు పోకుండా అసెంబ్లీకి రాజీనామా చేయకుండా ప్రజాయుద్ధం అంటే ముసుగులో గుద్దులాటలాగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More
Next Story