లడ్డు వివాదం ముదురుతున్నది... మరిన్ని గొంతులు కలుస్తున్నాయ్...
x

లడ్డు వివాదం ముదురుతున్నది... మరిన్ని గొంతులు కలుస్తున్నాయ్...

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక వైపు, టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీషర్ శ్యామల రావు మరొక వైపు ఇంకొక వైపు విశ్వహిందూపరిషత్...


పరమ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్ర మైందని, కల్తీ సరుకులతో చివరకు జంతు కొవ్వులతో లడ్డు తయారుచేశారన్న ఆరోపణ సునామీ సృష్టించబోతున్నది. ఇదొక పెద్ద రాజకీయ వివాదంగానే కాదు, మత విశ్వాసాల రంగు కూడా పులుము కుంటున్నది. రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తిరుమల లడ్డుల జంతుకొవ్వు ఆరోపణ దేశాన్ని కుదిపేసింది. అయితే, దాని మీద ఇంతవరకు అధికారికంగా ప్రభుత్వం గాని, తిరుమల తిరుపతి దేశస్థానం గాని వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు కామెంట్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిది ఆనం వెంకటరమణారెడ్డి ఏకంగా లడ్డు కెమికల్ టెస్టింగ్ రిపోర్టులు చూపించారు. తర్వాత మాజీ టిటిడి చెయిర్మన్లు, ఎస్వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. అయితే, దీన్లనెవరూఖాతరు చేయడం లేదు. సోషల్ మీడియా దీనికి కారణమయిన వారినందరిని కఠినంగా శిక్షించాలని గగ్గోలు పెడుతున్నది. కొందరు అపుడే శిక్షకూడా విధించారు. ఇపుడు రంగంలోకి విశ్వ హిందూపరిషత్ కూడా దూకుతున్నది. అంతేకాదు, మఠాధిపతులను కూడా రప్పించి ఒపీనియన్స్ చెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టిటిది ఎందుకు వెంటనే స్పందించలేదు

నిజానికి చంద్రబాబు నాయుడు వెల్లడించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంటనే స్పందన వచ్చి ఉండాలి.రాలేదు. ఇరవైనాలుగంటల తర్వాత తీరుబడిగా , జరగాల్సిన నష్టం జరిగాక, వివాదం దేశాన్నంతా కుదిపేశాక టెంపుల్ బోర్డు ఇవొ ఈ రోజు విలేకరులతో మాట్లాడుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదే విధంగా ఎక్కడో గుజరాత్ లో ఉన్న ల్యాబ్స్ కి శాంపిల్స్ పంపించి టెస్ట్ చేయించారు. దీనికి వివరణ కావాలి. ఇలాంటి పరీక్షలు జరిపే వసతులు హైదరాబాద్ లో లేవా, ఆంధ్రాలో లేవా. గుజరాత్ కే ఎందుకు పంపించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు మీద ఆరోపణ చేశాక ప్రభుత్వం కూడా అధికారికంగా స్పందించలేదు. ఎంతసేపు తెలుగుదేశం నేతలు, బిజెపినేతలు మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. వాటిని ఆధారం చేసుకుని సోషల్ మీడియా ‘అగ్గిఫైర్ ’ అయింది. పార్టీలు మాట్లాడాయి, మాజీ టిటిడి పురోహితులు మాట్లాడారు. టిటిడి మాత్రం నిదానంగా నిబ్బరంగా స్పందిస్తూ ఉంది. సాధారణం ఏదైనా ఫేక్ న్యూస్ వస్తూనే గంటల్లో టిిటిడి నుంచి వివరణ వస్తుంది. ఆమధ్య టిటిడిలో సీనియర్ సిటిజన్ల కు ప్రత్యేక ఏర్పాట్లు అని సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ కాగానే టిటిడి క్షణాల్లో స్పందించి దానికి ఖండించింది. కోట్లాది మంది పవిత్రంగా భావించే లడ్డు అపవిత్రం అయిందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినపుడే అవునో కాదో టిటిడి వెంటనే స్పందించి ఉండాలి. అలా జరగలేదు.

లడ్డు తయారీలో అపవిత్రమైన పదార్థాలను వినియోగించారని ఏపీ సీఎం బహిరంగంగా ప్రకటించినా మఠాధిపతులు పీఠాధిపతులు

"మౌన దీక్ష" లో వుండడం హిందూ సనాతన ధర్మానికి అత్యంత ప్రమాదకరం కాదా? ప్రశ్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తుల మనస్సును గాయపరిచే విధంగా గతంలో తిరుమల లడ్డు తయారీపై నేడు జరుగుతున్న చర్చను దేశ అత్యున్నత న్యాయస్థానం "సుప్రీంకోర్టు సుమోటో" గా స్వీకరించి సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించి శ్రీవారి ఆలయ పవిత్రతను, కోట్లాదిమంది భక్తుల మనోభావాలను కాపాడాలి తిరుపతి బిజెపి నాయకుడు నవీన్ కుమారెడ్డి అంటున్నారు.

తిరుమల శ్రీవారి లడ్డుపై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే దేశంలోని "మఠాధిపతులు పీఠాధిపతులు" తిరుమలలోని "పెద్ద జీయర్ చిన్న జీయర్ స్వాములు" ఎందుకు మౌనంగా ఉన్నారో శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాలని నవీన్ ఒక ప్రకటనలో కోరారు.

ఈ వివాదం దేశాన్ని మొత్తం కుదిపేయడంతో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యా హ్నం మూడుగంటలకు విలేకరుల సమావేశంలో లడ్డు మీద స్పందించబోతున్నారు. మరొకవైపు మూడున్నరకు తిరుమలలతో టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆధికారి జె శ్యామలరావు కూడా మొదటి సారి అధకారికంగా స్పందిస్తున్నారు. వీరిరువురి చెప్పేదాన్ని బట్టి వివాదం బాగా ముదురుతుందనుకుంటున్నారు.

ఇలా ఉంటే తిరుమల లడ్డు వివాదాస్పదం కావడం మీద విశ్వహిందూ పరిషత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. లడ్డు ప్రసాదంలో నెయ్యి కి బదులు జంతువుల కొవ్వులను కలిపి తయారుచేయడాన్ని ఈ సంస్థ తీవ్రంగా ఖండించింది. అక్రమాలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. రేపు పత్రికా సమావేశం నిర్వహిస్తున్నది.


Read More
Next Story