విశాఖపట్నానికి సమీపంలోని సింహాచలం పాత గోశాల నుంచి అడవివరం జంక్షన్ వరకు బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి జారీ చేసిన టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్)ల వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంబంధిత లబ్దిదార్లు/ఆక్రమణదార్లకు ఈ టీడీఆర్‌లను ఇచ్చారు. వీటి జారీలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ అప్పట్లోనే దీనిపై ఫిర్యాదులు అందడంతో అప్పటి పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి 2024 ఎన్నికలకు ముందు వాటిని నిలుపుదల చేస్తూ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ జీవోకు జీవం పోయడానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణలే కారణమన్న ఆరోపణలు దుమారాన్ని రేపుతున్నాయి.
సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణలో నిర్మాణాలను తొలగిస్తున్న దృశ్యం (ఫైల్)
జనసేన కార్పొరేటర్ ఫిర్యాదుతో..
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరుగురితో స్పెషల్ కమిటీ వేశారు. నోటరైజ్డ్ అఫిడవిట్స్‌పై ఇవ్వడానికి ఈ కమిటీని వేశారు. సింహాచలం దేవస్థానానికి చెందిన ఈ భూముల్లో ఎప్పట్నుంచో ఆక్రమించుకుని ఉంటున్నారు. బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణ కోసం 210 మందికి చెందిన ఇళ్లను తొలగించి పరిహారంతో పాటు టీడీఆర్‌లను ఇచ్చారు. పరిహారమైనా, టీడీఆర్‌లైనా భూ యజమానికే తప్ప ఆక్రమణదారులకు ఇవ్వకూడదని జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమిటీ చైర్మన్‌కు, అధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. దీనిపై జీవీఎంసీ అర్హులకే టీడీఆర్‌లు ఇచ్చిందా? అందులో ఉన్న వారి వివరాల కోసం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు లేఖ రాశారు. మరోవైపు మూర్తి యాదవ్ ఫిర్యాదులోని అంశాలపై క్షేత్రస్థాయిలో మరోసారి లబ్దిదారులు, ఆస్తి పన్ను, రోడ్డు విస్తరణ కోసం తీసుకున్న స్థలం, టీడీఆర్‌లు ఎంత స్థలానికి ఇచ్చారు? తదితర వాటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషనర్ జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావును ఆదేశించారు.
బీఆర్‌టీఎస్ పనులను పరిశీలిస్తున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
80 శాతం మంది అనర్హులేనా?
జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు ప్రకారం.. ఈ టీడీఆర్‌ల కుంభకోణంలో 80 శాతం మంది అనర్హులేనని. ఈ వ్యవహారంలో రూ.200 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. కొన్ని టీడీఆర్‌లు రూ.15 లక్షల నుంచి 2 కోట్లు వరకు అర్హులు కాని వారికి అక్రమంగా ఇచ్చారు. ఈ లబ్దిదార్లను నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వారిగా పేర్కొని టీడీఆర్‌లు, పరిహారం చెల్లించడాన్ని మూర్తి యాదవ్ తప్పుబడుతున్నారు. జీ+2 ఇళ్లు కట్టిన వారు పేదవారెలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఇంటిపన్ను కట్టిన వారికే కాకుండా అనర్హులకు, రోడ్డు విస్తరణకు తీసుకున్నట్టు రికార్డుల్లో చూపించిన స్థలం కంటే ఎక్కువ స్థలానికి టీడీఆర్‌లు జారీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆస్తి పన్ను ఒకరి పేరిట, టీడీఆర్ జాబితాలో మరొకరి పేరు ఉండడం అవినీతికి దర్పణం పడుతోంది. ఆక్రమణదార్లకు ప్రభుత్వం ఇళ్లే ఇవ్వాలి తప్ప టీడీఆర్‌లు ఇవ్వడమేమిటన్నది ఆయన వాదనగా ఉంది. కూటమి ప్రభుత్వంలో టీడీఆర్‌ల కుంభకోణంపై జనసేన కార్పొరేటర్ ఫిర్యాదు చేయడం, అది భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిధిలో ఉండడం, దానిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
మూర్తి యాదవ్ ఏమంటున్నారంటే?
‘సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణకు సంబంధించి టీడీఆర్‌లను అక్రమంగా జారీ చేశారు. మొత్తం 210 మంది జాబితాలో 80 శాతానికి పైగా అనర్హులు. టీడీఆర్‌లు 1ః4 నిష్పత్తిలో ఇవ్వాలని జీవో ఇచ్చారు. రాష్ట్రంలో దేవస్థానం భూముల్లో ఎక్కడా ఈ విధంగా ఇవ్వలేదు. అంతేకాదు.. ఆక్రమణదార్లకు ఎక్కడా ఇలా టీడీఆర్‌లు ఇవ్వలేదు. పైగా దేవస్థానం కూడా ఈ టీడీఆర్‌లు తమకొద్దని అనలేదు. పైగా బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణలో నిర్మాణాలు తొలగింపు పరిహారం లోనూ రూ.8.16 కోట్ల అక్రమ చెల్లింపులు జరిగాయి. ఈ టీడీఆర్‌ల అక్రమాల విలువ రూ.200 కోట్లు. రాష్ట్రంలోనే అతి పెద్ద టీడీఆర్‌ల కుంభకోణం ఇది. ఈ జీవోను అమలు చేస్తే దీనిని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో మరికొందరు నేతలు అడ్డదారులు తొక్కుతారు’ అని జనసేన కార్పొరేటర్, టీడీఆర్‌ల వ్యవహారంపై ఫిర్యాదు చేసిన పీతల మూర్తి యాదవ్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.