
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు
ముంచుకొస్తున్న వాయుగుండం! అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతం
వర్షాకాలం ముగింపుకు చేరుకుంది. అయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడంలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఇప్పటికే వాయుగుండంగా మారింది. ఇది తీరంవైపు దూసుకువస్తోంది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని. ఇది గంటకు 10 కి.మీ వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రస్తుతం ఏపీలోని విశాఖపట్నంకి 300 కిలోమీటర్లు, ఒడిషాలోని గోపాల్‌పూర్ 300 కి.మీ, పారాదీప్ కి 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇవాళ (అక్టోబర్ 2, గురువారం) రాత్రి ఈ వాయుగుండం ఒడిశా-ఆంధ్రప్రదేశ్ (గోపాల్ పూర్-పారాదీప్) మధ్య తీరందాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ ప్రకటించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, ఇవాళ రాత్రి వాయుగుండం తీరందాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి... కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్ధ సూచించింది.
కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్ధ తెలిపింది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తాయట. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు, ఈదురుగాలులు తోడయి ప్రమాదకంగా మారవచ్చు... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.