
రైతులకు శాపంగా మారిన పొగాకు!
వారంలో కిలోకు రూ.15/- నుంచి 20/- తగ్గిన ధర
ఈ ఏడాది పొగాకు కొనుగోళ్ల ప్రారంభం నుంచి మార్కెట్‌లో వ్యాపారులు వ్యవహరించిన తీరుతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, రానున్న సీజన్‌లో పంట సాగుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. బోర్డు అధికారులు కూడా రాబోయే పంట కాలంలో రైతులు సాగు తగ్గించుకోవాలని సూచనలు చేశారు.
"గత ఏడాది పొగాకు కేజీ ధర రూ.366. ఈ ఏడాది అది పెరగాల్సింది పోయి కనీసం రూ.280 కూడా సగటు ధర దక్కడం లేదు. కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న వేళ ధరలు పెరగాల్సిందిపోయి దిగజారుతున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరల్ని తగ్గించేశారు. వారం రోజులుగా సగటున కిలోకు రూ.15 నుంచి రూ.20 మేర ధరలు తగ్గించి వేశార"ని పొగాకు రైతు వి.రామిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా తగ్గుతాయన్న సంకేతాలను కూడా బయ్యర్లు ఇస్తుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయమై బుధవారం కొండపి వేలం కేంద్రంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.
పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ బుధవారం ఒంగోలు-2 వేలం కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం రైతులతో కొంతసేపు సమావేశమయ్యారు. దిగజారుతున్న గరిష్ఠ ధరల విషయాన్ని రైతు ప్రతినిధులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పొగాకు కొనుగోలు చేస్తున్న వివిధ కంపెనీల బయ్యర్లతో స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు. బోర్డు ఆక్షన్ మేనేజర్ రామాంజనేయులు, ఒంగోలు ఆర్‌ఎం రామారావు ఈ సమావేశాన్ని నిర్వహించి "వేలం ప్రక్రియకు ఆటంకం కలగకుండా కొనుగోళ్లు చేయాలని" సూచించారు.
పొగాకు రైతులు ప్రస్తుత సీజన్‌లో భారీగా నష్టపోయారు. పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ధరలు లభించకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారు. "పచ్చాకు ముఠా కూలీలకు, డబ్బులు చెల్లించలేక నానా ఇబ్బంది పడినట్లు" కొండపి రైతు దాన వెంకటేశ్వరులు ది ఫెడరల్ ఆంధ్రతో చెప్పారు.
పండించిన దానిలో మూడొంతుల పొగాకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. "ప్రస్తుత సీజన్ (2024-25)లో ఆంధ్ర రాష్ట్రంలో భారీగా పొగాకు పంట ఉత్పత్తి పెరిగింది. దక్షిణాదిలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న 11 వేలం కేంద్రాల పరిధిలో 104.60 మిలియన్ కిలో ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. అయితే ఈ ప్రాంతంలో పంట సాగు భారీగా జరిగి సుమారు 158.60 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయినట్లు" బోర్డు అధికారులు అంచనాకు వచ్చారు.
మామూలుగా ఈ ప్రొక్యూర్‌మెంట్ మార్చిలో మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయాలి. "ఇప్పటి వరకు సుమారు 93.72 మిలియన్ కిలోల పొగాకును వ్యాపారులు కొనుగోలు చేశారు. సగటున కిలోకు రూ.236.83 ధర లభించింది.అయితే ఈ సీజన్‌లో 60 శాతం పంట మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది. పండిన పంటలో ఇంకా 40 శాతం రైతుల ఇళ్ల వద్దనే నిల్వ ఉంది"ని ఏపీ రైతు సంఘం నేత సురేంద్రనాథ్ బెనర్జి తెలిపారు.
ప్రారంభంలో మేలు రకం పొగాకు కిలోకు రూ.280 వ్యాపారులు ఇచ్చారు. మీడియం గ్రేడ్ కిలోకు రూ.240 చెల్లించారు. లోగ్రేడ్ రకం పొగాకును అసలు కొనుగోలు చేయలేదు. మేలు రకానికి ప్రారంభ ధర కొద్దిరోజులు కొనసాగింది. మీడియం, లోగ్రేడ్‌లను కనీసం కిలో రూ.250 చొప్పున అయినా కొనుగోలు చేస్తారని రైతులు ఆశించారు. అయితే మేలు రకాన్ని నాలుగు నెలల పాటు కిలో రూ.240 నుంచి రూ.280 మధ్య వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతులకు కిలోకు సరాసరి రూ.250 లభించింది. ఒక దశలో కిలోకు ఒకటి, రెండు రూపాయలు కొన్ని కంపెనీలు పెంచినప్పటికీ వ్యాపారులు సిండికేట్ అయి ధర పెంచిన కంపెనీ బయ్యర్‌లపై ఒత్తిడి చేసి తిరిగి తగ్గించేలా చేశారు. మీడియం, లోగ్రేడ్ ధరలు కిలో రూ.240 నుంచి క్రమంగా దిగజారాయి. ప్రస్తుతం కిలో రూ.80 నుంచి రూ.120 మధ్య నడుస్తున్నాయి. మూడు నెలల క్రితం లోగ్రేడ్ రకం పొగాకును రైతులు వేలం కేంద్రానికి తీసుకురావడం, వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో తిరిగి ఇళ్లకు తీసుకెళ్లడం చేశారు. దీంతో విసుగు చెంది పలు వేలం కేంద్రాల ఎదుట రోడ్డుపైౖ బైఠాయించి నిరసనలు కూడా తెలిపారు. అయినా వ్యాపారులు కొనుగోలు చేయకపోగా లోగ్రేడ్ ధరలను మరింత తగ్గించేశారు.