
మరో హత్యకు కుట్ర జరుగుతోంది -వైఎస్ సునీత సంచలనం
పులివెందులలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను చూస్తుంటే తన తండ్రి వివేకా హత్య గుర్తొస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైఎస్ సునీత
జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పులివెందులలో జరుగుతున్న ఘటనలు కలచి వేస్తున్నాయని మాజీ ఎంపీ వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య తరహాలోనే మరో హత్యకు నిందితులు కుట్ర చేస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సునీత ఆరోపణలు చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా తమ వర్గానికి చెందిన సురేశ్ పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
సునీత, ఆమె భర్త నేడు కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలను ఎస్పీకి వీరు వివరించారు. హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ , సుప్రీం లో విచారణ నేపథ్యంలో ఎస్సీని వీరు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత "జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా గత రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే తన తండ్రి వివేకా హత్య గుర్తొస్తోంది" అన్నారు. గొడ్డలి వేటుతో వివేకాను చంపి గుండెపోటు అని చెప్పారని మండిపడ్డారు. టీడీపీ నేతలే చంపారని నమ్మబలికారని అన్నారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ ను చెరిపేశారని చెప్పారు. ఆ తర్వాత ఓ లేఖ తీసుకొచ్చి తన తండ్రిని ఆదినారాయణరెడ్డి, సతీశ్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్టు సంతకం చేయమంటే తాను చేయలేదని తెలిపారు. ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికలో కూడా అదే జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.తన తండ్రి హత్య కేసుపై గత ఆరేళ్లుగా పోరాడుతున్నానని , ఇప్పటి వరకు దోషులకు శిక్ష పడలేదని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు.
Next Story