కేసు పెట్టిన వారి అంతు తేలుస్తానంటున్న డాక్టర్ నమ్రత
x
డాక్టర్ నమ్రత

కేసు పెట్టిన వారి అంతు తేలుస్తానంటున్న డాక్టర్ నమ్రత

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రత తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. పోలీసు కస్టడీ తర్వాత తిరిగి జైలుకి వెళ్లిన ఆమె పంపిన సందేశాలు విస్తుగొలుపుతున్నాయి


సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధినేత డాక్టర్ అత్తలూరి నమ్రత తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సికింద్రాబాద్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ ముసుగులో పెద్దఎత్తున శిశు విక్రయాలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రతను 5 రోజుల కస్టడీకి తీసుకొని సుదీర్ఘంగా విచారించారు. కీలక ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ కేంద్రాలుగా 80 మంది శిశువుల్ని విక్రయించి సుమారు 35 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు గా గుర్తించినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. అయితే డాక్టర్ నమ్రత మాత్రం తాను చేసిన పని సక్రమమేనని, శిశువుల్ని దత్తతకు ఇప్పించానే తప్ప శిశు విక్రయాలు నిర్వహించలేదని వాదించారని సమాచారం.
సికింద్రాబాద్ లోని గోపాలపురం పోలీసులకు ఓ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం డాక్టర్ నమ్రతకు తాము డబ్బిచ్చి బిడ్డను కొనుక్కున్నారు. ఆ విషయాన్నే డాక్టర్ నమ్రత ముందుంచినప్పుడు ఆమె నుంచి సమాధానం లేదని తెలిసింది. ఆ శిశువును ఎవరి వద్ద అనేది చెప్పలేదని సమాచారం. ఎప్పుడో చేసిన తప్పును తనపై రుద్దుతున్నారంటూ వాదనకు దిగినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా విచారిస్తున్న అధికారులను, కేసులు పెట్టిన వారినీ, తనపై ఫిర్యాదు చేసిన డాక్టర్లను కూడా ఆమె బెదిరించినట్టు పోలీసులు చెబుతున్నారు. తాను ఇప్పుడు జైల్లోకి వెళ్లినా సెప్టెంబరులో బయటకు రాగానే అందరి లెక్కలు తేలుస్తానని నమ్రత జైలు నుంచే వర్తమానం పంపారని తెలిసింది.
డబ్బుకు ఆశపడి ఆ పని చేశామంతే...
విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ మేనేజర్‌ కల్యాణి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ ధనశ్రీ మోక్షితల కస్టడీ గడువు కూడా ముగిసింది. డాక్టర్‌ నమ్రత ఇచ్చే కమీషన్‌కు ఆశపడి ముఠాలు, ఏజెంట్ల నుంచి శిశువులను సేకరించినట్లు అంగీకరించారు. గర్భిణులకు డబ్బు ఆశచూపి విశాఖ, సికింద్రాబాద్‌ క్లినిక్‌లలో ప్రసవం చేసేవారని, కొన్నిసార్లు నెలల నిండక ముందే ఆపరేషన్‌ చేసి పిల్లల్ని బయటకు తీసి సరోగసీ బిడ్డలంటూ అప్పగించారని సమాచారం.
మహిళలకు ఐవీఎఫ్, అండం ఎదుగుదలకు హార్మోన్‌ ఇంజెక్షన్లను ఇష్టానుసారం ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని రీసెర్స్‌ ఫెర్టిలిటీ సెంటర్‌లోని ప్రముఖ గైనకాలజిస్టు లెటర్‌హెడ్‌పై ఇంజెక్షన్లు, మాత్రలు రాసిచ్చినట్లు బయటపడింది. బుధవారం ఆమె ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కేసు నమోదుచేయగా మరో నలుగురు గైనకాలజిస్టుల పేర్లను ఉపయోగించుకున్నట్లు గుర్తించారు.
శిశు విక్రయాల వ్యాపారం 35 కోట్లు..
ఒక్కో శిశువును రూ.4 నుంచి రూ.5లక్షలకు కొని సరోగసీ పేరిట రూ.40 లక్షల నుంచి రూ.50లక్షలకు విక్రయించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఆమె బ్యాంకు ఖాతాలను ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ నిర్వహించనున్నారు. విశాఖ, హైదరాబాద్, విజయవాడలో ఆసుపత్రులు, నివాసాల వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖ రాశారు.
సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం మోసాలకు సంబంధించి 27 మంది నిందితులపై కేసు నమోదైంది. వారిలో డాక్టర్‌ అత్తలూరి నమ్రత, జయంత్, కల్యాణి, సంతోషి, చెన్నారావు, సదానందం, నందిని, నస్రీన్, ఆదిక్‌ అలీ, హర్షరాయ్, సురేఖ, కృష్ణ, నయన్‌దాస్, విద్యుల్లత, ఉష, షాహిన్, అయేషా, రవి, రమ్య, విజయ్, సరోజ, కరుణ, యమున, విజయ్, రత్న, మీనాక్షి ఉన్నారు. 26 మంది అరెస్టయ్యారు.
డాక్టర్‌ నమ్రత సరోగసీ ముసుగులో 40-50 మంది నుంచి సుమారు రూ.35కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.
ఎల్లారెడ్డిగూడకు చెందిన సంతోషి ఏజెంట్ల నుంచి 18 మంది శిశువులను సేకరించినట్లు గుర్తించారు. ఆమె ఇంట్లోని రికార్డుల ఆధారంగా శిశువులను విక్రయించిన కొందరు తల్లుల చిరునామాలను గుర్తించే పనిలో పడ్డారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్టయిన విశాఖకు చెందిన నిందితురాలు(ఏ16) డాక్టర్‌ విద్యుల్లతకు బుధవారం బెయిల్‌ మంజూరైంది.
డాక్టర్ నమ్రత పెట్టిన ఫెర్టిలిటీ సెంటర్ లైసెన్స్ 2017లోనే రద్దయింది. అయితే ఆమె తన ఆస్పత్రి పేరు మార్చి వేరే డాక్టర్ పేరుతో తిరిగి లైసెన్స్ సంపాయించారు. ఆమె వయస్సు 64 ఏళ్లు. భర్త లేడు. ఇద్దరు మగపిల్లలు. ఆమెను తన సిబ్బంది లేడీ డాన్ గా పిలుస్తుంటారు. చట్టాల్లోని లొసుగులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆమె దిట్ట. కేసులకి, శిక్షలకి ఆమె భయపడదని డాక్టర్ నమ్రతను దగ్గర్నుంచి చూసిన వారు చెబుతుంటారు.
చైల్డ్ ట్రాఫికింగ్, ఫేక్ సరిగసీ లాంటి ఆరోపణలపై ఆమె గతంలోనూ అరెస్ట్ అయ్యారు.
Read More
Next Story