
గుంటూరు కార్పొరేషన్ లో బహిరంగ దందా!
వీధి వ్యాపారులు రోజుకు చెల్లించేది రూ. 40,000 లు... కార్పొరేషన్ కు అధికారులు కట్టేది రూ. 2,000 లు: రేట్ పేయర్స్ అసోసియేషన్
గుంటూరు నగరం ఎదుర్కొంటున్న తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలకు పరిష్కారం పౌర నిఘాతోనే సాధ్యమని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 6వ తేదీ ఆదివారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశం సామాజిక విశ్లేషకులు టి ధనుంజయ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఓరుగంటి నారాయణరెడ్డి ప్రసంగిస్తూ స్వర్గీయ ఎస్వీవిఎల్ నరసింహారావు గుంటూరు నగర లోక్ సభ ప్రధమ సభ్యుని నేతృత్వంలో ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ 1955 లో ప్రారంభమైందని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా గుంటూరు నగరంలో గల 62 మంచినీటి ట్యాంకులను నిశితంగా పరిశీలించి ట్యాంకులలో పేరుకు పోయిన మురికిని తొలగించడంలో రేట్ పేయర్స్ అసోసియేషన్ విశిష్ట కృషి చేసిందన్నారు. దాదాపు 30కి పైగా నీళ్ల ట్యాంకులలో పేరుకు పోయిన టన్నుల కొద్ది మురికిని అధికార బృందం సహకారంతో తొలగించడం గర్వ కారణమన్నారు.
గుంటూరు నగరంలో 1975 మంది పారిశుద్ధ్య కార్మికులు, 57 ట్రాక్టర్లు ఉన్నప్పటికీ పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. 2,80,000 వేల నివాస గృహాలకు మంచినీటి సరఫరా నగరపాలక సంస్థ చేస్తుందని, 62 వాటర్ ట్యాంకులను నిరంతరం పరిశుభ్రంగా ఉంచితేనే స్వచ్ఛమైన నీటిని అందించగలమన్నారు. 200కు పైగా ఉన్న సచివాలయాలను గుంటూరు నగర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నారు.
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ పటిష్టమైన గ్రీవెన్స్ సెల్ ను రూపొందించి బలోపేతం చేయాలని, గుంటూరు నగర ప్రజలకు టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులో ఉంచి, ఫిర్యాదులు స్వీకరించి, సమస్యల పరిష్కారం వైపు దృష్టి సాధించాలన్నారు. వీధి వ్యాపారులకు ప్రత్యేక కూడళ్ళు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేస్తున్న కృషిని కొనసాగించాలన్నారు. ప్రతి 350 గృహాలకు పారిశుద్ధ్య కార్మికులను కేటాయించి, వారి వివరాలను గృహ యజమానులకు అందించడం ద్వారా పౌర నిఘా పెరిగి సత్ఫలితాలు వస్తాయన్నారు.
మానవత కార్యదర్శి కె సతీష్ బాబు మాట్లాడుతూ ప్రతిరోజు గుంటూరు నగరంలో వీధి వ్యాపారుల నుంచి 40 వేల రూపాయలు వసూలు చేస్తున్న అధికారులు, గుంటూరు కార్పొరేషన్ కు కేవలం 2,000 రూపాయలు మాత్రమే చెల్లించడం బాధాకరమన్నారు. గుంటూరు నగరంలో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న హోర్డింగ్స్ నుంచి సక్రమంగా పన్నులు రాబట్ట లేకపోవడం వలన ఆదాయాన్ని కోల్పోతున్నామన్నారు.
అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ప్రసంగిస్తూ మూడు సంవత్సరాల లో ఇంటి పన్ను రెట్టింపు అయిందని, దీనికి తగ్గట్టుగా పౌర సేవలు మెరుగవ్వడం లేదని, ప్రతి పౌరుడు ప్రశ్నించే లక్షణాన్ని అలవర్చుకోవాలని హితువు పలికారు. పౌర సంస్థలతో కలిసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిర్మాణాత్మక కృషి నగరపాలక సంస్థ చేపట్టాలన్నారు.
సామాజిక విశ్లేషకులు టి ధనుంజయ రెడ్డి ప్రసంగిస్తూ గుంటూరు నగరంలోని పౌర సంస్థలు రేట్ పేయర్స్ అసోసియేషన్ లో భాగస్వాములుగా మారి నాణ్యమైన పౌర సేవలను సాధించుకునేందుకు కృషి జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవత చైర్మన్ పావులూరు రమేష్, రేట్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ అంజిరెడ్డి, సంయుక్త కార్యదర్శి వి సదాశివరావు, శ్యామల నగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ నేత కనపర్తి రాఘవరావు, విశ్రాంత ఫార్మసిస్ట్ అన్నపూర్ణమ్మ, విశ్రాంత అధ్యాపకులు సూరం నారాయణరెడ్డి, మానవత నేతలు చావా శివాజీ, టి సుందర రామయ్య, ఎన్ సాంబశివరావులు పాల్గొని మాట్లాడారు.