
అప్పన్న నిజరూప దర్శనం ఈసారైనా దక్కేనా?
30న సింహాచలం అప్పన్న చందనోత్సవం జరుగనుంది. కొన్నేళ్లుగా భక్తులు ఎదుర్కొంటునన ఇబ్బందులకు ఈసారైనా చెక్ పెట్టి సామాన్యులకు నిజరూపదర్శనం దక్కేలా చూడాలనే డిమాండ్ పెరిగింది
సింహాచలం దివ్యక్షేత్రం చందనోత్సవానికి ముస్తాబవుతోంది. ఏప్రిల్ 30న సింహాచలం అప్పన్న చందనోత్సవం జరగనుంది. ఏడాది పొడవునా చందనరూపుడై ఉండే వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆ ఒక్కరోజే భక్తులకు నిజరూప దర్శనమిస్తారు. ఇందుకోసం భక్తులు భారీగా తరలివస్తారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని నిర్ణయించారు. ప్రముఖుల సేవలో తరలించకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయిస్తున్నారు.
కరోనా వల్ల వరుసగా రెండేళ్లు నిజరూప దర్శనం భక్తులకు కలగలేదు. మరో రెండేళ్లు వివాదాలు, వైఫల్యాలతో చందనోత్సవం పెద్ద ప్రహసనంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జరుగుతున్న ఉత్సవం ఇది.
2022లో అప్పన్న నిజరూప దర్శన టికెట్ల వ్యవహారం పెద్ద ప్రహసనంలా సాగింది. న్యాయమూర్తులకు ప్రొటోకాల్ పాటించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిజరూప దర్శనం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.
2023లో అప్పటి దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్, కలెక్టర్ నేతృత్వంలో ఇష్టానుసారంగా వీవీఐపీ టికెట్లు జారీ చేశారు. దీనికితోడు పోలీసుల అత్యుత్సాహంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నాటి చందనోత్సవ వైఫల్యంపై ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు అదేశించింది.
2025లో భక్తుల రద్దీ కొంత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. లక్షన్నర మందికి తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలు పెద్ద సంఖ్యలోనే ఉండనున్నట్లు సమాచారం. దీంతో వ్యూహాత్మకంగా సమన్వయం చేసుకుంటూ వెళ్లకపోతే అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది.
అంతరాలయంలో ప్రముఖులకు దర్శనాలు కల్పించిన ప్రతిసారీ ఉత్సవం విఫలం కావడం గమనార్హం. భక్తుల మనోభావాలకు విఘాతం కలగకుండా పోలీసులు వ్యవహరించాలి. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలి.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలనుకుంటున్నారు.
Next Story