తీన్మార్ కు ఎదురుగాలి మొదలైందా ?
x

తీన్మార్ కు ఎదురుగాలి మొదలైందా ?

కాంగ్రెస్ పార్టీ నేత అన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకాలం తీన్మార్ వ్యవహారశైలిని భరించినట్లు చెప్పారు.


ఇంతకాలానికి ఎంఎల్సీ తీన్మాన్ మల్లన్న ఆరోపణలు, విమర్శలపై ఎదురుదాడి మొదలైంది. బీసీ నేతను అని చెప్పుకుని సొంత పార్టీ, ప్రభుత్వాన్నే ఇంతకాలం ఆరోపణలు, విమర్శలతో తీన్మార్ ఇరుకునపెడుతున్న విషయం తెలిసిందే. డైరెక్టుగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్ణయాలనే తీన్మార్ రెగ్యులర్ గా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్య జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో బాగా వివాదాస్పమైన జీవో 29 రద్దుపైన తీన్మార్(Teenmar Mallanna) తన నోటికొచ్చినట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎంఎల్సీనే జీవో 29ని తప్పుపట్టడంతో ప్రతిపక్షాలు మరింతగా రెచ్చిపోయాయి. కాంగ్రెస్(Congress MLC ) ఎంఎల్సీ అయ్యుండీ సొంత పార్టీతో పాటు ప్రభుత్వంపై మల్లన్న ఆరోపణలు, విమర్శలు చేయటాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే బీసీ(BC Leader)నేత అన్న ఒకే కారణంతో పార్టీలోని సీనియర్లలో ఎవరూ మల్లన్న వ్యవహారాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారు.

ఈ నేపధ్యంలోనే పార్టీలోని కొందరు యువనేతలు తీన్మార్ వ్యవహారంపై ఎదురుదాడికి దిగారు. రాజ్యసభ ఎంపీ అనీల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav), మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనీల్, మెట్టుసాయికుమార్ మీడియాతో మాట్లాడుతు తీన్మార్ వ్యవహారాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేత అన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకాలం తీన్మార్ వ్యవహారశైలిని భరించినట్లు చెప్పారు. తన ఆరోపణలు, విమర్శల ద్వారా బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్(Central Minster Bandi Sanjay) తో కుమ్మకైనట్లు అర్ధమవుతోందన్నారు. తీన్మార్ ఎంఎల్సీ అయ్యింది కాంగ్రెస్ పార్టీ వల్లే అన్న విషయాన్ని మరచిపోకూడదని హెచ్చరించారు. తాను కూడా బీసీ కోటాలోనే రాజ్యసభ ఎంపీ అయినట్లుగా అనీల్ చెప్పారు. పార్టీలోని నేతలందరు మద్దతిస్తేనే తాను ఎంపీ అయిన విషయాన్ని తాను ఎప్పటికీ మరచిపోనని చెప్పారు. అలాగే పార్టీ నేతలంతా కష్టపడితేనే తాను ఎంఎల్సీ అయిన విషయాన్ని తీన్మార్ ఎప్పటికీ మరచిపోకూడదని హితవు పలికారు. పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి, అందరు కష్టపడి పనిచేస్తేనే ఎంఎల్సీ అయిన తీన్మార్ అదే పార్టీ, ప్రభుత్వాన్ని విమర్శిస్తు, ఆరోపణలు చేస్తుంటే తాము చూస్తు ఊరుకోబోమని గట్టిగానే హెచ్చరించారు.

తీరు మార్చుకోకపోతే సమయం, సందర్భం వచ్చినపుడు పార్టీ తీన్మార్ మల్లన్నపై యాక్షన్ తీసుకోవటం తథ్యమని కూడా చెప్పారు. పరిస్ధితి అంతవరకు తెచ్చుకోకుండా ఉంటేనే మల్లన్నకు చాలా మంచిదన్నారు. జీవో 29 రద్దు చేయకపోతే బీసీ అభ్యర్ధులకు తీరని నష్టం వస్తుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపణలు చేసినట్లుగానే మల్లన్న కూడా ఆరోపణలు చేయటం చాలా విచిత్రంగా ఉందన్నారు. పరీక్షలు అయిన తర్వాత టీజీపీఎస్సీ(TGPSC) రిలీజ్ చేసిన వివరాల ప్రకారం మెయిన్స్ లో బీసీల పార్టిసిపేషన్ 57 శాతంగా తేలినట్లు అనీల్ చెప్పారు. అదే జీవో 55 ప్రకారమే పరీక్షలు నిర్వహించి ఉంటే బీసీల పార్టిసేపేషన్ 39 శాతంగా మాత్రమే ఉండేదని చెప్పారు. జీవో 29 వల్ల బీసీలకు మంచి జరిగిందా ? లేకపోతే జీవో 55 వల్ల బీసీలకు మంచి జరిగేదా అని తీన్మార్ చెప్పాలని డిమాండ్ చేశారు. తీన్మార్ చేసిన యాగీవల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వం, పార్టీకి ఇబ్బందులు తెచ్చినందుకు తీన్మార్ ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని అనుకుంటే ఎంఎల్సీకి, పార్టీకి రాజీనామా చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకోవచ్చని కూడా సూచించారు.

మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీన్మార్ ఇంతకాలం చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు పార్టీలోని యువనేతలతోనే సీనియర్లు చెక్ పెట్టేపని మొదలుపెట్టారు. మామూలుగా తీన్మార్ ఆరోపణలు, విమర్శలపై సీనియర్లు ఎప్పుడో ఎదురుదాడి మొదలుపెట్టేవారే. కాని తీన్మార్ విషయంలో ఎందుకనో సంయమనం వహించారు. అయితే దాన్ని ఎంఎల్సీ అలుసుగా తీసుకుని బహిరంగ వేదికలతో పాటు తన సొంత యూట్యూబ్ ఛానల్లో రెచ్చిపోతున్నారు. ఇపుడు యువనేతలు మొదలుపెట్టారు కదా మిగిలిన వాళ్ళు కూడ అందుకునే అవకాశాలున్నాయి. పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే సీనియర్లు, జూనియర్ల దెబ్బకు తీన్మార్ తన పద్దతిని అయినా మార్చుకోవాలి లేదా పార్టీలో నుండి బయటకు అయినా రావాల్సిందే. మరి ఏది ముందు జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story