కలకలం రేపిన సామూహిక అత్యాచార ఘటన
x

కలకలం రేపిన సామూహిక అత్యాచార ఘటన

శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న సామూహిక అత్యాచార ఘటన రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఏపీ, కర్ణాటకలో ఇది సంచలనంగా మారింది.


శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న సామూహిక అత్యాచార ఘటన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది. బాధితులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కావడంతో అక్కడ, ఆంధ్రప్రదేశ్‌లో రేప్‌కు గురి కావడంతో ఏపీలో ఈ ఘటన సంచలనంగా మారింది.

మరో వైపు సామూహిక అత్యాచార ఘటనను విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. విచారణ చేపట్టి బాధితులను ఆదుకోవడంతో పాటు దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సామాన్య పౌరులకు రక్షణ కరువైందని, భద్రత కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో నాలుగు అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే విమర్శలు గుప్పించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనను శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్‌ తీవ్రంగా పరిగణించారు. స్త్రీని ఆదిపరా శక్తిగా కొలిచే విజయదశమి రోజు ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగి పోయాయని విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. మంత్రి సవిత, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ట ఇంత వరకు బాధితులను పరామర్శించ లేదని ధ్వజమెత్తారు. మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అప్పటికప్పుడు హెలికాప్టర్‌లో ఉన్నతాధికారులను పంపిన ప్రభుత్వం ఈ ఘటనపై ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఈ గ్యాంగ్‌ రేప్‌పై కూడా అంతే స్థాయిలో స్పందించాలని డిమాండ్‌ చేశారు.
పరమ పవిత్రమైన విజయదశమి రోజున ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరగడం ఘోరమైన ఘటనని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. నలుగురు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, మహిళలకు భద్ర కల్పించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. దోషులను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దోషులకు కఠిన శిక్షించాలని జిల్లా పోలీసులను ఆదేశించింది. బాధితులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోలీసులకు చెప్పారు. విచారణ జరిపి తక్షణమే నివేదికను ఇవ్వాలని హోమ్‌ మంత్రి అనిత పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన మహిళలపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని మంత్రి సవిత పోలీసులను ఆదేశించారు.
Read More
Next Story