పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచిన ప్రభుత్వం.. అందుకేనా..!
పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధ్యతలు కూడా స్వీకరించకుముందే అకస్మాత్తుగా పవన్‌కు భద్రత ఎందుకు పెంచారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం సహా పలు శాఖలను జనసేనాని పవన్ కల్యాణ్‌కు కేటాయించడం జరిగింది. రెండు రోజుల్లో ఆయన ఛార్జ్ కూడా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం సహా పలు శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్‌కు అధిక భద్రతను కల్పించాలని నిశ్చయించుకుంది. ఆ మేరకు ఆదేశాలను జారీ చేసి పవన్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
పవన్ కల్యాణ్‌కు వై-ప్లస్ భద్రతను అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించింది సర్కార్. ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత ఉండేలా చూసుకోవడం తమ బాధ్యత అని, ప్రోటోకాల్ ప్రకారమే ఆయనకు భద్రత అందించామని ప్రభుత్వ వర్గాలు కూడా చెప్పాయి. ఈ భద్రత నేటి నుంచే అమలవుతుందని వివరించారు.
ఈరోజు పవన్ కల్యాణ్.. గన్నవరం వెళ్లి అక్కడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గం స్థితి గతులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అనంతరం అక్కడి సమస్యల పరిష్కారికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేస్తారని జనసేన వర్గాలు వివరిస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కల్యాణ్ ఈరోజు సచివాలయం చేరుకుని అక్కడ తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలించనున్నారని, అక్కడ తనకు కావాల్సిన వసతుల గురించి అధికరులకు వివరిస్తారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించకముందే పవన్‌కు భారీ భద్రత ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్న అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాగా ముందస్తు చర్యగా మాత్రమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చల్లారని అల్లర్ల కారణంగా ఈ చర్యలు తీసుకుంటూ భద్రత పెంచడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
వై ప్లస్ సెక్యూరిటీ అంటే..
ప్రభుత్వం కల్పించే భద్రతలు పలు కేటగిరీలు ఉన్నాయి. వాటిలో వై ప్లస్ కేటగిరీ ఒకటి. వై ప్లస్ సెక్యూరిటీలో వై కేటగిరీలో ఉండే 11 సెక్యూరిటీ సిబ్బంది సహా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, ఎస్కార్ట్ వాహనం ఉంటాయి. అదనంగా ఒక గార్డ్ కమాండర్, నలుగురు గార్డ్‌లను కూడా నియమిస్తారు. ఈ గార్డ్‌లలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఉంటారు. వీరి దగ్గర ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి.