
ఆందోళన బాట పట్టిన అమరావతి ఓఆర్ఆర్ రైతులు
రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం జరిగే భూ సేకరణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రాజెక్టు, రైతుల వ్యతిరేకతతో మరోసారి వివాదాస్పదం అవుతోంది. ముందుగా 140 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించిన ఈ రోడ్డును 250 మీటర్లకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నోటిఫికేషన్ వల్ల తమ సారవంతమైన భూములు ప్రభుత్వ స్వాధీనం అవుతాయి. ఈ భూములు కోల్పోతే భవిష్యత్ అంధకారం అవుతుందని, జీవనోపాధి కోసం వెతుక్కుంటూ వలసలు పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు బ్యాక్‌గ్రౌండ్ వివరాలు
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ రాజధాని ప్రాంతాన్ని త్వరగా విస్తరించేలా చేయడానికి కీలకమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. ఇది మొత్తం 189 కిలోమీటర్ల పొడవుతో 6+2 లేన్ల (ఆరు ప్రధాన లేన్లు + రెండు సర్వీస్ రోడ్లు) కాన్ఫిగరేషన్‌తో రూపొందించారు. ప్రారంభంలో 140 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్టు, ఇటీవల సవరణలతో 250 మీటర్లకు (రివైజ్డ్ నోటిఫికేషన్ ప్రకారం) పెంచారు. మొత్తం అంచనా వ్యయం సుమారు రూ. 25,000 కోట్లు. ఇందులో భూసేకరణ ఖర్చులు కూడా ఉన్నాయి.
కంచికచెర్ల తహశీల్దార్ ఆఫీసులో డిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రం ఇస్తున్న రైతులు
మూడు ఫేజ్‌లలో 11 ప్యాకేజీలుగా ప్రాజెక్టు విభజన
ఫేజ్-1: కంచికచర్ల నుంచి పోతూరు వరకు (63 కిమీ), కృష్ణా నదిపై 3 కిమీ బ్రిడ్జి.
ఫేజ్-2: పోతూరు నుంచి పొట్టిపాడు వరకు (65 కిమీ), కృష్ణా నదిపై 4.8 కిమీ బ్రిడ్జి.
ఫేజ్-3: పొట్టిపాడు నుంచి కంచికచర్ల వరకు (53 కిమీ), కొండూరు చుట్టుపక్కల 4.4 కిమీ టన్నెల్.
ఇది 22 మండలాలు, 87 గ్రామాలను కవర్ చేస్తుంది. ఇందులో కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం వంటి మండలాలు ఉన్నాయి. మొత్తం 3,404 హెక్టార్ల భూమి సేకరణ అవసరం. ఇందులో గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కు సమర్పించింది. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం నిర్మాణ ఖర్చును భరిస్తుందని ప్రకటించింది.
గెజిట్ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా జారీ అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో మొదటి నోటిఫికేషన్ 3ఏ జారీ అయింది. ఇందులో గ్రామాలు, సర్వే నంబర్లు, ఎఫెక్టెడ్ రైతుల వివరాలు ఉన్నాయి. ఇతర జిల్లాలకు కూడా త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నాయి. జనవరి 5న రివైజ్డ్ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇది వెడల్పును 250 మీటర్లకు పెంచడాన్ని తెలియజేస్తోంది. రోడ్డు రెండు వైపులా 500 మీటర్ల బఫర్ జోన్ ప్రపోజల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం మండలాల్లోని 18 గ్రామాల్లో 1,798 సర్వే నంబర్ల కింద 1,416.31 హెక్టార్ల భూమి స్వాధీనం చేసుకోనున్నారు.
రైతుల వ్యతిరేకత, ఆందోళనలు
ఈ ప్రాజెక్టు వల్ల చాలా మంది రైతులు భూములు కోల్పోతున్నారు. ముఖ్యంగా కంచికచర్ల, అగిరిపల్లి, పొట్టిపాడు, కంకిపాడు వంటి ప్రాంతాల్లోని వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా భూములు తరతరాలుగా సాగు చేస్తున్న సారవంతమైనవి. ఏటా మూడు పంటలు పండుతాయి. ఇటువంటి భూములను బలవంతంగా తీసుకోవడం దుర్మార్గం’’ అని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వెడల్పు పెంపును ‘అత్యంత దుర్మార్గం, ఏకపక్షం’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు ఆధ్వర్యంలో ఎంపీకి రైతులు వినతి పత్రం అందజేశారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నాలుగు రెట్లు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలి. భూములు సీఆర్డిఏ, అమరావతి జోన్ పరిధిలో ఉన్నాయని పొటెన్షియల్ ఏరియాగా గుర్తించాలి. సమీప డోర్ నెంబర్లలో నమోదైన విలువల ఆధారంగా భూమి ధరలు నిర్ణయించాలి. ఓఆర్‌ఆర్‌లో పోతున్న భూములపై ఉన్న రుణాలు మాఫీ చేయాలి. ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, కేవలం న్యాయమైన పరిహారం కోరుతున్నాం అని వినతిపత్రంలో పేర్కొన్నారు.
విజయవాడ ఎంపీ చిన్ని హామీ
ఆమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ‘నష్టపరిహారం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని’, రైతుల పక్షాన నిలబడి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) పేర్కొన్నారు. రెవెన్యూ, జాతీయ రహదారుల అధికారులతో రైతుల తరపున మాట్లాడతాను. శాసన సభ్యులు, రెవెన్యూ, రహదారుల అధికారులతో ‘జాయింట్ సమావేశం’ ఏర్పాటు చేసి సమస్యలు చర్చించి, రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎంపీకి వినతిపత్రం అందించిన వారిలో ఓఆర్ఆర్ బాదిత రైతులు గంగిరెడ్డి రంగారావు, నన్నపనేని భాస్కరరావు, బుడ్డి సూర్యప్రకాష్, టి జ్ఞానరెడ్డి, వి.ఎల్.నరసింహారావు, బుడ్డి వీరప్రసాద్, బుడ్డి రామకృష్ణ, అల్లడి కోటేశ్వరరావు, జొన్నలగడ్డ బాబు, మంగినేని ఏడుకొండలు, మల్లెల సుబ్బారావు, సూర్యదేవర రమ, చెన్నుపాటి రాధాకృష్ణమూర్తి, జూలూరు విశ్వనాథం, మంగలపూడి ప్రసాదరావు (కంచికచర్ల, వీరులపాడు మండలాలు)లు ఉన్నారు.
అమరావతి ఓఆర్‌ఆర్ రైతుల ధర్నా
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కంచికచర్ల మండల తహసిల్దార్ కార్యాలయం ముందు భారీగా బైఠాయించి ధర్నా నిర్వహించారు.
“ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, సారవంతమైన భూములు అనవసరంగా వృథా కాకూడదు” అని రైతులు స్పష్టం చేశారు. డిమాండ్లు అంగీకరించకపోతే భూ సేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని, లేకపోతే తీవ్ర కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.
రైతులు కంచికచర్ల డిప్యూటీ తహసిల్దార్ వి మానసకు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందించిన వారిలో రైతులు, రైతు సంఘం నాయకులు కోట కళ్యాణ్, గంగిరెడ్డి రంగారావు, వి.ఎల్.నరసింహారావు, అల్లడి కోటేశ్వరరావు, బుడ్డి వీరప్రసాద్, నన్నపనేని భాస్కరరావు, టి. జ్ఞానరెడ్డి, బుడ్డి సూర్యప్రకాష్, సూర్యదేవర రమ, జూలూరి విశ్వనాథం, కపలవాయి సుబ్బారావు, తేళ్ల శ్రీనివాసరావు లు ఉన్నారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తున్న రైతులు
ప్రత్యామ్నాయ భూమి కావాలి...
అమరావతి ప్రాంతంలో భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఓఆర్ఆర్ వల్ల భూమి కోల్పోతే, మళ్లీ అదే ప్రాంతంలో భూమి కొనుగోలు చేయడం అసాధ్యమని రైతులు చెబుతున్నారు.
సరైన నోటీసులు ఇవ్వకుండా భూమి స్వాధీనం చేసుకుంటున్నారని, సారవంతమైన భూమికి తగిన పరిహారం ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ వాల్యుయేషన్, రియల్ మార్కెట్ ప్రైసెస్ మధ్య తేడా ఉందని వారు పేర్కొంటున్నారు.
ప్రత్యామ్నాయ భూమి చూపించకుండా స్వాధీనం చేసుకోవద్దని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భూమిని కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చేతకాదని, ఎమ్మెల్యేలు, తహశీల్దార్లు, ఉన్నతాధికారులకు అర్జీలు సమర్పిస్తున్నారు.
ఫార్మర్ యూనియన్లు భూసేకరణ చట్టం సెక్షన్ 26(1) ప్రకారం, సమీప ప్రాంతాల్లోని మూడేళ్ల సేల్ వాల్యూల ఆధారంగా నాలుగు రెట్లు పరిహారం డిమాండ్ చేస్తున్నాయి. మరికొందరు ఆరు రెట్లు కోరుతున్నారు. రైతుల సమ్మతి లేకుండా సేకరణ చేయవద్దని, ఫీజిబిలిటీ అసెస్‌మెంట్ ఆధారంగా వెడల్పును 70 మీటర్లకు తగ్గించాలని వారు కోరుతున్నారు.
మంత్రి నారాయణ హామీ
ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రాజధాని విస్తరణకు కీలకమని పేర్కొంటోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ పి నారాయణ, అమరావతి రైతులకు 100 శాతం న్యాయం చేస్తామని ప్రకటించారు. ల్యాండ్ పూలింగ్ గ్రీవెన్సెస్‌ను పరిష్కరిస్తామని, రోడ్ అలైన్‌మెంట్ ఎఫెక్టెడ్ ప్లాట్లను రీఅలాట్ చేస్తామని, అసైన్డ్ ల్యాండ్స్ ఇష్యూస్‌ను క్యాబినెట్‌లో చర్చిస్తామని చెప్పారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్&బీ) ప్రాజెక్టులకు ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్స్ ద్వారా పరిహారం ఇస్తామని ప్రకటించారు. భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 3,117 కోట్లు కేటాయించింది.
అయితే రైతుల ఆందోళనలపై ప్రత్యక్ష స్పందన ఇంకా స్పష్టంగా లేదు. ప్రాజెక్టు వల్ల రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. భూమి ధరలు 35 శాతం పెరిగాయి. కొందరు రైతులు రియల్టర్లతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. కానీ ఇది అందరి రైతులకు వర్తించదు. ముఖ్యంగా సారవంతమైన భూముల యజమానులకు చాలా ఇబ్బంది కలుగుతోంది.
ఔటర్ రింగ్ రోడ్డు అవసరం ఇప్పుడు లేదు: మాజీ మంత్రి వడ్డె
అమరావతిలో రైతులను ప్రభుత్వం నానా ఇబ్బందులు పెడుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు అవసరం ఇప్పుడు లేదు. విలువైన భూములు ఇప్పటికే అవమరావతి ఇవ్వడం ద్వారా కోల్పోయారు. మళ్లీ ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో కొంత, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో కొంత పోగొట్టుకుంటే రైతుల బతుకేమి కావాలని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరావు ప్రశ్నించారు. రైతుల భూములను బలవంతంగా లాక్కున్న వారు బాగుపడిన దాఖలాలు లేవన్నారు.
నాలుగు రెట్లు పరిహారం ఇవ్వాల్సిందే: కేవీవీ
అమరావతి ఔటర్ రింగ్ నిర్మాణానికి తీసుకునే భూములు మూడు పంటలు పండే భూములని, అందుకే ఆ భూములకు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నాలుగు వంతులు ఎక్కవ పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేవీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే వేల ఎకరాల భూములు అమరావతి కోసం రైతులు త్యాగాలు చేసి వదిలేసారని, ఈ కారణంగా కొందరు వారి ఊర్లు వదిలి వెళ్లారన్నారు. ఆ పరిస్థితులు ప్రస్తుతం భూములు కోల్పోయే వారికి రాకూడదని స్పష్టం చేశారు.

