
అమరావతి రైతుల ప్లాట్ల పాట్లు!
పదేళ్ల ఆలస్యం, రాజకీయ ఆటలు, రైతుల ఆవేదన.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు పాట్లు తప్పటం లేదు. రాజధాని నిర్మాణంలో భాగంగా ల్యాండ్ పూలింగ్ పథకం కింద రైతుల నుంచి సేకరించిన భూముల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. 34,000 ఎకరాలకు పైగా భూములపై రిటర్నబుల్ ప్లాట్లు అందించడంలో జరుగుతున్న ఆలస్యం, పాలకుల అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2014 తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆరంభించిన ల్యాండ్ పూలింగ్ పథకం రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, వార్షిక యాన్యూయిటీ చెల్లింపులు, పెన్షన్లు వంటి హామీలతో మొదలైంది.
అయితే పదేళ్లు దాటినా 2 శాతం మంది రైతులు ఇంకా తమ ప్లాట్లు పొందలేదు. యాన్యూయిటీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సమస్యలు పరిష్కారమవ్వకపోవడంతో రైతుల ఆగ్రహం మరింత పెరిగింది. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వానికి గడువులు విధిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం రైతుల భూములను వాడుకుంటున్నారనే విమర్శలు బలపడతాయి.
రాజధాని రైతు పరిరక్షణ సమితీ నాయకులు ఇటీవల మీడియాతో మాట్లాడిన దృశ్యం.
ఆలస్యాలకు మూలకారణాలు
అమరావతి ల్యాండ్ పూలింగ్ పథకం ఆలస్యమవడానికి ప్రధాన కారణం రాజకీయ మార్పులు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన చేసి, అమరావతి అభివృద్ధిని పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మందగించాయి. యాన్యూయిటీ చెల్లింపులు ఆగిపోయాయి. పెన్షన్లు రద్దయ్యాయి. రైతులు 1,900 రోజుల పాటు నిరసనలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. 2024లో టీడీపీ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించింది. కానీ ఆలస్యాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు 69,421 ప్లాట్లలో 61,793 మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మిగిలిన 7,628 పెండింగ్‌లో ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు, రోడ్ ఎలైన్‌మెంట్ సమస్యలు, ఇన్‌హెరిటెన్స్ డిస్ప్యూట్స్ (Inheritance Disputes) (కుటుంబ యజమాని మరణించిన సందర్భంలో వచ్చే న్యాయపరమైన సమస్యలు), రోడ్ ఎంక్రోచ్‌మెంట్స్ ఈ ఆలస్యాలను మరింత తీవ్రతరం చేశాయి.
ఫండింగ్ లోపం మరో కీలక కారణం
అమరావతి అభివృద్ధికి మొదటి ఫేజ్‌లోనే రూ.1 లక్ష కోట్లు అవసరమని అంచనా. కానీ ప్రభుత్వం దీన్ని విడతల వారీగా చేపట్టడం వెనుక ఆంతర్యం స్పష్టం. ఆర్థిక సమస్యలు ప్రధానం. విడతల వారీ అభివృద్ధి అంటే... మొదటి ఫేజ్‌లో పూర్తి చేసిన ప్లాట్లు మాత్రమే అందించడం, మిగిలినవి తర్వాత అందించడటం. కానీ ఇది రైతులకు అన్యాయం చేయటమే. ఎందుకంటే వారి భూములు మొత్తం తీసుకుని, పాక్షికంగా మాత్రమే రిటర్న్ ఇవ్వడం ఒప్పందానికి విరుద్ధం. ఈ విధానం వెనుక రాజకీయ లబ్ధి ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. భూముల విలువ పెంచి, తర్వాత విక్రయించే అవకాశం ఉందనే విమర్శలు ఉన్నాయి.
పాలకులపై రాజకీయ విమర్శలు, భూములపై వ్యాపారాలు?
గత టీడీపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రస్తుత కూటమి కూడా అదే బాటలో నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో చెప్పాలంటే మొదటి ఫేజ్ భూములను అభివృద్ధి చేయకుండా రెండో ఫేజ్‌లో మరో 50,000 ఎకరాలు సేకరించడం అనుమానాస్పదం. రిటర్నబుల్ ప్లాట్లు తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో కేటాయించడం వల్ల రైతులు విక్రయించుకోలేక పోతున్నారు. ఇది ఒక వ్యూహాత్మక డిజైన్ అని, రైతులు చిన్న ప్లాట్లు పొంది విక్రయించేలా చేసి డెవలపర్లు ఎక్కువ ఎకరాలు కొనుగోలు చేసేలా ప్రణాళికలు ఉన్నాయి. అమరావతి ప్రస్తుతం నిశ్శబ్ద ప్రాతంగా మారిందని, రైతులు తమ భూములు కోల్పోయి, ప్రయోజనం పాలకులకు చేరుతుందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ఇటీవల రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్‌ను జనసేన పార్టీ వ్యతిరేకించడం, క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటుకు దారితీసింది. ఇది రాజకీయ లాభాల కోసమేననే చర్చ అమరావతి రైతుల్లో ఉంది.
రైతుల ఆగ్రహం, జేఏసీ నిరసనలు
అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. జేఏసీ సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వానికి అభ్యర్థనలు సమర్పిస్తున్నా ఫలితం లేదు. జేఏసీ నాయకుడు మల్లికార్జునరావు మాటల్లో ‘‘ప్లాట్ అలాట్మెంట్‌లో అవినీతి పెరిగింది. అధికారుల నిర్లక్ష్యాన్ని చూస్తూ ఉండలేకపోతున్నాం’’ అని ఆరోపించారు. మరో నాయకుడు శివకుమార్ ‘‘యాన్యూయిటీ చెల్లింపులు ఆలస్యం, ప్లాట్లు తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో కేటాయించడం అన్యాయం’’ అని తెలిపారు.
జేఏసీ కన్వీనర్ రామకృష్ణ ‘‘ప్రభుత్వం ఒక నెలలో సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తాం’’ అని హెచ్చరించారు. ఈ అభిప్రాయాలు రైతుల ఆవేదనను ప్రతిబింబిస్తాయి. వారు ‘పీపుల్స్ క్యాపిటల్’ కోసం భూములు ఇచ్చారు. కానీ ప్రయోజనం పాలకులకు చేరుతోంది.
మొత్తంగా అమరావతి ప్రాజెక్ట్ రాజకీయ కుతంత్రాలకు బలవుతోందని, ప్రభుత్వం తక్షణమే గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేసి, టైమ్‌బౌండ్ ప్లాన్ అమలు చేయకుంటే రైతుల నిరసనలు మరింత తీవ్రమవుతాయని రాజధాని రైతులు పేర్కొంటున్నారు. ఇది కేవలం భూమి సమస్య కాదు, రాజకీయ విశ్వసనీయతకు పరీక్ష.

