‘దాదా’ అజిత్ పవార్ నిష్క్రమణ
x

‘దాదా’ అజిత్ పవార్ నిష్క్రమణ

‘అజిత్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం లభించి ఉంటే మహారాష్ట్రకు అత్యుత్తమ సీఎంగా నిలిచేవారు’ - పార్టీ శ్రేణులు


Click the Play button to hear this message in audio format

అజిత్ పవార్(Ajith Pawar) మరణం మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది. ‘దాదా’గా సుపరిచితుడైన అజిత్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బారామతి గడ్డపై రాజకీయాల్లోకి ప్రవేశించి అదే బారామతిలో జరిగిన విమాన ప్రమాదం(Aircraft crash)తో ఆకాలమరణం చెందారు.

బుధవారం (జనవరి 28) ఉదయం పూణే జిల్లా బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) మృతి చెందారు. ఈ దుర్ఘటనతో రాష్ట్రం మొత్తం షాక్‌కు గురైంది. అజిత్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం లభించి ఉంటే మహారాష్ట్రకు అత్యుత్తమ సీఎంగా నిలిచేవారన్నది చాలా మంది అభిప్రాయం.

విషాదం జరిగిన ఒక రోజు ముందు వరకు కూడా అజిత్ పవార్ ప్రభుత్వ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు కూడా. ఇటీవల జరిగిన మునిపల్ ఎన్నికల ఫలితాలపై పార్టీ అంతర్గత చర్చల్లోనూ పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విభేదాలున్నా..ఆయన మరణంపై అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


మాటకు కట్టుబడే వ్యక్తి..

అజిత్‌ను గుర్తుచేసుకుంటూ.. “ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే, దాన్ని పూర్తి చేయకుండా వదిలేవారు కాదు. అదే ‘కాదు’ అని చెప్పారంటే మాత్రం ఆ పని జరగదన్నది స్పష్టంగా తెలిసిపోయేది” అని వ్యాఖ్యానించారు శివసేన (ఉద్ధవ్ వర్గం) లోక్‌సభ సభ్యుడు అరవింద్ సావంత్.


ఫడ్నీవీస్‌తో కలిసి బారమతికి షిండే..

మరో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా అజిత్ మృతికి సంతాపం తెలిపారు. “ఇది మహా విషాదం. మాటలు రావడం లేదు” అని అన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ఆయన బారామతికి బయలుదేరారు.


అలుపెరగని వ్యక్తిగా..

‘దాదా’గా సుపరిచితుడయిన అజిత్ పవార్ తన రాజకీయ జీవితంలో ఆర్థిక, జలవనరులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. క్రమశిక్షణ గల నాయకుడిగా గుర్తింపు ఉన్నా.. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదాలు తెచ్చిపెట్టాయి.

అవిశ్రాంతంగా కష్టపడే మనస్తత్వం ఉన్న అజిత్ సాధారణంగా ఉదయం 5.30 గంటల నుంచే పని ప్రారంభించి అర్ధరాత్రి వరకు పనిచేసేవారు. దాదాపు నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితం అంతా ఇలాగే కొనసాగించారు.


జీవితం, రాజకీయ ప్రవేశం..

శరద్ పవార్ అన్నయ్య అనంతరావు పవార్‌కు అజిత్ 1959 జూలై 22న జన్మించారు. 1980లో బారామతిలోని సహకార చక్కెర కర్మాగారం, పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బోర్డుల్లో ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1991లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు.

శరద్ పవార్ రాజకీయ వారసత్వంలో పెరిగినా.. తనదైన శైలి, విధానాలతో ముందుకు సాగారు. బారామతి నుంచి ఆయన ఎన్నడూ ఎన్నికల్లో ఓడిపోలేదు. 2004లో శరద్ పవార్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఎన్సీపీ పార్టీ వ్యవస్థాపక బాధ్యతలను అజిత్ పవార్ నిర్వహించడం ప్రారంభించారు.


అందని ద్రాక్షగా సీఎం పదవి ..

అజిత్‌కు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎంత పట్టు ఉందో.. పట్టణ సమస్యలపైనా అంతే అవగాహన ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు స్థానిక సామెతలు, గ్రామీణ భాషను సహజంగా ఉపయోగించేవారు. కఠిన రాజకీయ నాయకుడిగా కనిపించినప్పటికీ, ఆయనలో భావోద్వేగం, మానవీయత కూడా ఉందని సన్నిహితులు చెబుతారు. బారామతి ప్రజలతో ఆయనకు ఎప్పుడూ దూరం లేదు.

అయితే ముఖ్యమంత్రి పదవి మాత్రం ఆయనకు ఎప్పుడూ అందని ద్రాక్షగానే మిగిలింది. 1999లో ఎన్సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ఆ అవకాశం కాంగ్రెస్‌కు దక్కింది. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి కాగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి స్థాయికే పరిమితమయ్యారు.


తిరుగుబాట్లు, విభజనలు..

2022లో మొదటిసారిగా తన చిన్నాన్న శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసినా అది విఫలమైంది. ఆ తర్వాత 2023 జూలైలో ఎన్సీపీని విభజించి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వర్గం తీవ్రంగా నష్టపోయినా, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తన రాజకీయ బలం నిరూపించుకున్నారు.


రాజకీయాలకు అతీతంగా..

రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, కుటుంబ సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదని అజిత్ పవార్ బహిరంగంగానే చెప్పారు. శరద్ పవార్ తన గురువు అని, సుప్రియ సులే తన సోదరి అని పలుమార్లు పేర్కొన్నారు.

ఎన్సీపీ చిహ్నంపై రెండు వర్గాల మధ్య వివాదం సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వేళ.. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో రెండు వర్గాలు కలిసి పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


వివాదాలు, ఆరోపణలు..

అజిత్ పవార్ రాజకీయ జీవితం అనేక వివాదాలతో నిండి ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులు, సహకార బ్యాంకులు, చక్కెర కర్మాగారాలపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా ఒక దశలో ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే రాజకీయంగా అవేవీ ఆయనను కూల్చలేకపోయాయి. పార్టీ చీఫ్‌గా ఉన్న సమయంలో, నేరపూరిత నేపథ్యం ఉన్న నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ, అక్రమాల భరతం పడతానని ప్రకటించారు.

Read More
Next Story