
‘నిధులున్నా.. పుణేలో పరిష్కారం కాని సమస్యలు..’
‘రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండా’ - మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్..
మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో పుణె(Pune) నగరం ఎప్పటికీ కీలకమే. రాష్ట్రానికి ఆర్థిక చోదక శక్తిగా ఉన్న ఈ నగరం.. పాలనా వైఫల్యాలకు ప్రతీకగా మారింది. జనవరి 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పుణెలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Deputy CM Ajit Pawar) పుణె మున్సిపల్ కార్పొరేషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పౌర సమస్యలకు పరిష్కరించడంలో పుణె మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ట్రాఫిక్ సమస్య, నీటి కొరత, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఏ చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో PMCపై ఆధిపత్యం చెలాయించిన BJP పాలన నగరాభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నగరాభివృద్ధికి కేటాయించిన సుమారు రూ.1,130 కోట్ల నిధులు సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండాగా ప్రజల ముందుకు వెళ్తామని, పుణె నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని పవార్ స్పష్టం చేశారు.
పవార్ విమర్శలకు భారతీయ జనతా పార్టీ కౌంటర్ ఇచ్చింది. తమ పార్టీ ఆరోపణలు చేయడం ప్రారంభిస్తే.. పవార్ ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రవీంద్ర చవాన్ హెచ్చరించారు.
పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే శివసేన మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో భాగస్వాములు. కానీ జనవరి 15న ఎన్నికలు జరగనున్న పూణే మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి)తో పాటు 29 మున్సిపల్ కార్పొరేషన్లలో కొన్నింటిలో విడివిడిగా పోటీ చేస్తున్నాయి.

