దేశ రాజధానిలో దడ పుట్టిస్తున్న వాయు కాలుష్యం
x

దేశ రాజధానిలో దడ పుట్టిస్తున్న వాయు కాలుష్యం

దేశ రాజధానిలో బుధవారం వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. ఉదయం 9 గంటలకు ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 278గా రికార్డయ్యింది.


దేశ రాజధానిలో బుధవారం వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. దీపావళికి ఒక రోజు ముందు ఢిల్లీలో గాలి నాణ్యత చాలా తక్కువగా నమోదైంది. ఉదయం 9 గంటలకు ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 278గా రికార్డయ్యింది. గత కొన్ని రోజుల నుంచి హస్తనలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెట్టడమే ఇందుకు కారణం. దీనికి తోడు పొగమంచు కూడా రాజధానిని ఆవహిస్తోంది. దీంతో నగరంలో రోజురోజుకూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్వానస్థితికి చేరుకుంటున్నట్లు కాలుష్య నియంత్రణ మండ‌లి పేర్కొంది.

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ లెక్కలివి..

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవాలి.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. మొత్తం 36 మానిటరింగ్ కేంద్రాలకు గాను ఎనిమిదింటిలో (ఆనంద్ విహార్, అశోక్ విహార్, అయా నగర్, బవానా, జహంగీర్‌పురి, ముండ్కా, వివేక్ విహార్, వజీర్‌పూర్) గాలి నాణ్యత బాగా పడిపోయింది. ఉదయం 8 గంటలకు తేమ శాతం 83గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు.

Read More
Next Story