
తమిళనాడు తర్వాత కేరళలో గవర్నర్–ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన..
‘‘గవర్నర్ తన ప్రసంగంలో కొన్ని కీలక పేరాలను తొలగించారు. కొన్ని పదాలను అదనంగా చేర్చి ప్రభుత్వ వైఖరిని మార్చే ప్రయత్నం చేశారు. ’’ - సీఎం పినరయి విజయన్
తమిళనాడు తరహాలోనే కేరళ(Kerala)లో కూడా గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగపర వివాదం తలెత్తింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ప్రసంగించారు. అయితే కేబినెట్ ఆమోదించిన అంశాలను యథాతథంగా కాకుండా, గవర్నర్ మార్చి చదివారని ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Pinarayi Vijayan) శాసనసభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘కొన్ని ముఖ్యమైన పేరాలను తొలగించారు’
రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం.. గవర్నర్ ప్రసంగం పూర్తిగా మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రకటనను మాత్రమే ప్రతిబింబించాల్సి ఉంటుందని, అందులో ఎలాంటి చేర్పులు లేదా తొలగింపులు చేయడానికి గవర్నర్‌కు అధికారం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గవర్నర్ తన ప్రసంగంలో కొన్ని కీలక పేరాలను తొలగించారని, కొన్ని పదబంధాలు చేర్చడం ద్వారా ప్రభుత్వ వైఖరిని మార్చే ప్రయత్నం జరిగిందని పినరయి విజయన్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కేరళ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇది ఆర్థిక సమాఖ్యవాద సూత్రాలను బలహీనపర్చడమేనన్న వాక్యాన్ని గవర్నర్ తొలగించారని విజయన్ ఆరోపించారు. అలాగే శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో జరుగుతోన్న జాప్యంపై ప్రస్తావించిన కొన్ని పేరాలను సైతం తొలగించారని విమర్శించారు.
సభ్యులకు అసలు ప్రతి అందజేత..
రాష్ట్రాలకు పన్నుల వాటా, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రాజ్యాంగ హక్కులేనని పేర్కొన్న పేరాలో ‘నా ప్రభుత్వం నమ్ముతుంది’ అనే పదాలను చేర్చారని ఆరోపించారు. విధాన ప్రకటన ప్రసంగం పూర్తిగా ఎన్నికైన ప్రభుత్వానిదేనని సీఎం గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో తొలగించిన భాగాలు, చేసిన చేర్పులను మినహాయించి, మంత్రివర్గం ఆమోదించిన అసలు వెర్షన్‌ను ప్రభుత్వం ముద్రించి సభ్యులకు పంపిణీ చేసింది. దాన్నే అధికారిక విధాన ప్రకటనగా గుర్తించాలని చైర్‌ను ముఖ్యమంత్రి కోరారు.
ఇదిలా ఉండగా, తమిళనాడు( Tamil Nadu)లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి జాతీయ గీతం ఆలాపన అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రసంగం చేయకుండా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగం చదివినట్టుగా భావిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
కేరళలో చోటుచేసుకున్న ఈ పరిణామం.. గవర్నర్ పాత్ర పరిమితులు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగ సంప్రదాయాలపై కొత్తగా చర్చకు దారితీసింది.

