AAPకు హ్యాండిచ్చిన ఎమ్మెల్యేలు..
x

AAPకు హ్యాండిచ్చిన ఎమ్మెల్యేలు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీని వీడారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?


మరో మూడు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Polls). హస్తనను కైవసం చేసుకునేందుకు అటు బీజేపీ(BJP), ఇటు కాంగ్రెస్ (Congress) శాయశక్తులు ఒడ్డుతున్నాయి. వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి కూడా గెలవాలన్న కసితో ఉంది. ఈ విషయం అటుంచితే.. ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆప్‌కు హ్యండిచ్చి కాషాయ పార్టీలో చేరిపోవడం ఢిల్లీలో ప్రస్తుతం హాట్ టాపిక్. అసలు వారి రాజీనామాకు కారణలేంటి..

ఆ ఎమ్మెల్యేలు ఎవరంటే..

గిరీష్ సోనీ (మదిపూర్), రోహిత్ మెహ్రౌలియా (త్రిలోకపురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), రాజేష్ రిషి (జనక్‌పురి), నరేశ్ యాదవ్ (మెహ్రౌలి), భావనా గౌర్ (పాలం), పవన్ కుమార్ శర్మ (ఆదర్శ్ నగర్) మరియు బీఎస్ జూన్ (బీజ్వాసన్).

ఢిల్లీ ఎన్నికలను ఈ సారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న AAP..20 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలను తప్పించింది. కొంతమంది స్థానాలను భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు కేటాయించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయి పార్టీని వీడారు.

1. గిరీష్ సోనీ: ఈయన మదిపూర్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే. తనను పక్కన పెట్టడంపై ఎక్స్ వేదికగా స్పందించారు. పార్టీ‌ గతకొంత కాలంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా"షీష్ మహల్" అంశం. ఇటీవల పరిణామాల నేపథ్యంలో పార్టీ అన్ని బాధ్యతల నుంచి, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నా," అని పేర్కొన్నారు.

2. రోహిత్ కుమార్ మెహ్రౌలియా: త్రిలోకపురి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఢిల్లీ రాజకీయాల్లో AAP ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన ఈయన.. అన్ని పదవుల నుంచి, కేజ్రివాల్ నేతృత్వంలోని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పుకున్నారు. దళిత/వాల్మీకి సమాజాభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నది ఆయన ప్రధాన ఆరోపణ. రాజకీయ ప్రయోజనాల కోసం తన సమాజాన్ని వాడుకున్నారని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో AAP విఫలమైందని ఆరోపించారు.

3. మదన్ లాల్: కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే. ఈ సారి ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దీంతో AAPకి రాజీనామా చేశారు. పార్టీపై పెట్టుకున్న నమ్మకం పోయిందని, అరవింద్ కేజ్రివాల్‌‌ను ఎన్నటికి విశ్వసించనని చెప్పారు.

4. భావనా గౌర్: పాలం నియోజకవర్గ ఎమ్మెల్యే. "మీ మీద (అరవింద్ కేజ్రివాల్), పార్టీపైన విశ్వాసాన్ని కోల్పోయాను," అంటూ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను ఎక్స్ (X)లో పోస్ట్ చేశారు.

5. రాజేష్ రిషి: జనక్‌పురి నియోజకవర్గం AAP ఎమ్మెల్యే. అన్ని పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అవినీతిరహిత పాలన, పారదర్శకత సిద్ధాంతాలను కేజ్రీవాల్ పార్టీ వదిలేసిందని ఆరోపించారు.

6. పవన్ కుమార్ శర్మ: ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే. పార్టీ ఏర్పాటయినపుడు ఉన్న నిజాయితీ, సిద్ధాంతాలు ఇప్పుడు లేవని, పార్టీ పరిస్థితిని చూసి బాధేస్తుందన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నా..దయచేసి అంగీకరించండి అంటూ శర్మ కోట్ చేశారు.

7. బీఎస్ జూన్: భూపేందర్ సింగ్ జూన్, బీజ్వాసన్ నియోజకవర్గ ఎమ్మెల్యే. పార్టీ ప్రాథమిక విలువలు, సిద్ధాంతాల్లో చాలా మార్పులు వచ్చాయని పేర్కొంటూ రాజీనామా చేశారు. కాలక్రమేణా పార్టీలో పారదర్శకత లోపించిందని, ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోయాయని పేర్కొన్నారు.

8. నరేశ్ యాదవ్: మెహ్రౌలి నియోజకవర్గ ఎమ్మెల్యే. తన రాజీనామాకు ముఖ్య కారణం "అవినీతి" అని తెలిపారు. ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "AAP పూర్తిగా అవినీతిలో మునిగిపోయింది. అన్నా హజారే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీగా, ఢిల్లీలో, దేశమంతటా అవినీతి అంతం చేయడమే మా లక్ష్యం. అదే ఆలోచనతోనే నేను AAPలో చేరాను" అని నరేశ్ యాదవ్ అన్నారు.

ఢిల్లీ శాసససభలో మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి. 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Read More
Next Story