Delhi Elections | అమిత్ షాను ‘చునావీ ముసల్మాన్’గా అభివర్ణించిన ఆప్
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల సమయం ఉండగానే..ఆప్, బీజేపీ మధ్య ప్రచార యుద్ధం మరింత హాట్‌గా మారింది.
ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ (EC) ప్రకటించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ప్రచార జోరు పెంచాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. కొత్త హామీలతో ఢిల్లీ వాసులను ఆకర్షించే పనిలో బిజీగా వున్నారు ఆప్ నేతలు. ఇప్పటికే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పలు పథకాలను ప్రకటించారు. AAP తిరిగి అధికారంలోకి వస్తే.. అధికంగా వచ్చిన నీటి బిల్లులను మాఫీ చేస్తామన్నారు. ‘పూజారి గ్రంథి సమ్మాన్ యోజన’ పథకం కింద ఆలయాల పూజారులకు గౌరవ వేతనంగా నెలకు రూ. 18వేలు ఇస్తామని ప్రకటించారు. దీనికి బీజేపీ (BJP) వెంటనే కౌంటర్ ఇచ్చింది. కేజ్రీవాల్‌ను “చునావి (ఎన్నికల) హిందువు”గా చిత్రీకరించింది. ‘భూల్ భూలయ్యా’లో నటుడు రాజ్‌పాల్ యాదవ్ పాత్రను పోలి, రుద్రాక్ష పూసలు, వెర్మిలియన్ ధరించి, పూజారి అవతారంలో కేజ్రీవాల్‌ను చూయించారు. ఈ రోజు (జనవరి 7)న ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Sha) ను ‘చునావి (ఎన్నికల) ముసల్మాన్’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమిత్ షాను ‘చునావీ ముసల్మాన్’గా సంబోధిస్తూ పోస్టర్లు వేసింది. అమిత్ షా కశ్మీరీ టోపీ ధరించినట్లుండి, బ్యాక్ గ్రౌండ్‌లో ఢిల్లీ జామా మసీద్ కనిపించేలా పోస్టర్ డిజైన్ చేశారు. ఎన్నికల సమయంలోనే బీజేపీకి ముస్లింలు ఎందుకు గుర్తుకొస్తారంటూ ఆప్ ప్రశ్నించింది. కేవలం వారిని తన ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని ఆరోపించింది.
తగ్గేదేలే అన్నట్లుగా బీజేపీ హామీలు..
తామేం తక్కువ కాదన్నట్లు బీజేపీ కూడా హామీలిచ్చేసింది. తాము అధికారంలోకి రాగానే ఆప్ అమలు చేస్తున్న పథకాలన్నింటిని కొనసాగిస్తామని చెప్పుకొచ్చింది. కాషాయ నేతలు ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. కేజ్రీవాల్ 'షీష్ మహల్'పై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా ఆయనపై విరుచుకుపడ్డారు. కొవిడ్ సమయంలో ప్రజలంతా సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతుంటే కేజ్రీవాల్ మాత్రం 'షీష్ మహల్' (అద్దాల మేడ) నిర్మించుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. దాని నిర్మాణం కోసం ఆయన చాలా డబ్బు ఖర్చుచేశారని విమర్శించారు.
పరస్పర విమర్శలు..
రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీయుల అక్రమ ప్రవేశంపై బీజేపీ, ఆప్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అక్రమ వలసదారులకు ఆప్ అధికారిక పత్రాలు ఇచ్చి వాళ్లను ఓటు బ్యాంకుగా మార్చుకుంటోందని బీజేపీ ఆరోపించింది. అయితే రోహింగ్య శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది బీజేపీయేనని ప్రతి ఆరోపణ చేసింది.