
రాజ్యసభకు ఆప్ చీఫ్ కేజ్రీవాల్?
పంజాజ్‌లోని లూధియానా వెస్ట్ నుంచి ఆప్ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను పోటీ చేయించడం వెనక కారణాలున్నాయి? బీజేపీ నేతలు ఏమంటున్నారు?
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఓటమి పాలైంది. భారతీయ జనతా పార్టీకి అధికార పగ్గాలు దక్కాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై కాషాయ పార్టీ అభ్యర్థి పర్వేశ్ వర్మ విజయ సాధించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి అతిశీ వ్యవహరిస్తున్నారు. ఇక ఢిల్లీ పాలిటిక్స్‌లో కేజ్రీవాల్ రోల్ ఏమిటన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలో తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ ఉండిపోతారా? లేక తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
లుదియానా వెస్ట్ నుంచి రాజ్యసభ ఎంపీ..
ఈ నేపథ్యంలో మరో వార్త బయటకు వచ్చింది. పంజాబ్ రాష్ట్రం లూధియానా(Ludhiana) వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా(Sanjiv Arora) పోటీ చేస్తారని ఫిబ్రవరి 26న ఆప్ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఈ స్థానం నుంచి గెలిచిన ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. సంజీవ్ అరోరాను తప్పించి ఆయన స్థానంలో కేజ్రీవాల్(Arvind Kejriwal)ను రాజ్యసభకు పంపాలన్న ఆలోచనతోనే ఇలా చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాల్వియా స్పందిస్తూ.. "కేజ్రీవాల్ ఓడిపోయాక రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారు. అందుకే ఈ వ్యూహం. రాజ్యసభ స్థానం ఖాళీ చేసినందుకు ప్రతిగా అరోరా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది? అని మాల్వియా అనుమానం వ్యక్తం చేశారు.
Sitting Rajya Sabha AAP MP Sanjeev Arora declared candidate for Ludhiana West Bypoll (MLA) . Why did this happen:
— Jaiveer Shergill (@JaiveerShergill) February 26, 2025
>Kejriwal wants to enter Rajya Sabha ?
>Kejriwal wants Govt accommodation in Delhi ?
>Kejriwal having major power FOMO after losing elections ?
Has Sitting AAP… pic.twitter.com/lpfEXWKQZT
"ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించకూడదు. లుదియానా ప్రజలు సంజీవ్ అరోరాను ఓడించాలి," అని ఆయన X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
"కేజ్రీవాల్ రాజ్యసభకు రావాలనుకుంటున్నారా? ఢిల్లీలో ఆయనకు ప్రభుత్వ వసతి కావాలా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోతున్నామనే భావన ఆయనలో మనసులో ఉన్నట్లుంది?" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్.
AAP స్పందిస్తుందా?
కేజ్రీవాల్‌ను రాజ్యసభకు పంపుతున్నట్లు AAP ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. అయితే బీజేపీ ఆరోపణలకు ఆప్ ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.