
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో యూఎస్ రాయబారీ సెర్గీయో గోర్
తెలంగాణలో ఒక రోడ్ అమెరికా అధ్యక్షుడి పేరు
ట్రంప్ పేరు ఎందుకు పెట్టారని రాహుల్ గాంధీని విమర్శించిన బీజేపీ
అమెరికా అధ్యక్షుడి పేరును హైదరాబాద్ లోని ఓ రోడ్ కు పెట్టడంపై రాజకీయ వివాదం రాజుకుంది. నగరంలోని యూఎస్ కాన్సులేట్ సమీపంలోని ఓ రోడ్ కు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ట్రంప్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది.
దీనితో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టింది. గతంలో రాహుల్, ట్రంప్ భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన సంగతిని గుర్తు చేస్తూ చురకలు వేసింది.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరును రహదారికి ఎందుకు పెడుతోందని కాషాయ పార్టీ ప్రశ్నించింది. 'ఎక్స్' ఛానెల్‌లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ట్రంప్ పేరును రహదారికి పెట్టడం ద్వారా ఆయనకు 'అత్యున్నత నివాళి' అర్పిస్తోందని, ఇది రాహుల్ 'కపటత్వం' అని ఆరోపించారు.
ట్రంప్ రోడ్, రాహుల్ పై విమర్శ
"రాహుల్ కపటత్వానికి ఇది పరాకాష్ట. అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు. అలాంటప్పుడు తెలంగాణలోని ఆయన ప్రభుత్వం ఆయన పేరును రహదారికి పెట్టి అత్యున్నత నివాళి ఎందుకు అర్పిస్తోంది?" అని పూనావాలా ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎద్దేవా చేస్తూ, ఆయన రాహుల్‌ను సీరియస్‌గా తీసుకోరని బీజేపీ నాయకుడు వాదించారు. గతంలో కూడా ఆయన అదానీ గ్రూప్‌పై మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడి విమర్శలను తోసిపుచ్చి, దానితో ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారని ఆయన గుర్తుచేశారు. "అంటే రేవంత్ రెడ్డి అసలు రాహుల్ బాబాను సీరియస్‌గా తీసుకోరా? రాహుల్ 'అదానీ అదానీ' అని నినాదాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇలాగే చేశారు... వెళ్లి అదానీ గ్రూప్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు" అని పూనావాలా అన్నారు.
ట్రంప్‌పై రాహుల్ విమర్శలు..
ట్రంప్ ప్రభుత్వంతో కేంద్రం సంబంధాలపై గతంలో రాహుల్ చేసిన విమర్శల నేపథ్యంలో బీజేపీ ఆయనపై ఎదరు దాడి చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో, అమెరికాతో వాణిజ్య చర్చల సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసిందని, మితిమీరిన రాయితీలు ఇచ్చిందని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. ఆయన వాషింగ్టన్‌ను భారత్‌తో "సమానంగా" వ్యవహరించాలని కోరారు. దేశ ఆర్థిక ప్రాధాన్యతలను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును ప్రశ్నించారు.
నేపథ్యం ఏంటీ..
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న ఒక రహదారికి "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా పేరు మార్చిన సందర్భంగా, యూఎస్ రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ఫలకాన్ని ఆవిష్కరించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ కాన్సులేట్ ప్రకారం, ఈ చర్య అమెరికాను గుర్తించడమే కాకుండా, భారత్-అమెరికా సంబంధాలలో హైదరాబాద్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.
ఈ చర్యకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇది అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన బలమైన భాగస్వామ్యానికి ప్రతీక అని గోర్ అన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, సాంకేతిక - పెట్టుబడి సహకారాన్ని ప్రోత్సహించడంలో హైదరాబాద్ పాత్రను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
Next Story

