కెనడా పాప్ సింగర్ ధిల్లాన్ ఇంటిపై కాల్పుల నిందితుడి అరెస్ట్..
ఇండో-కెనడియన్ రాపర్, గాయకుడిగా పేరున్న ధిల్లాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచారు?
కెనడాలోని పంజాబీ గాయకుడు అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ AP ధిల్లాన్ నివాసంపై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. సెప్టెంబర్ 2024లో కొందరు వ్యక్తులు ఆయన ఇంటి వెలుపల తుపాకీతో కాల్పులు జరిగారు. కిటికీ అద్దాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఇంటికి సమీపంలో ఆపి ఉన్న రెండు వాహనాలను కూడా దగ్ధం చేశారు.
కేసు విచారణ చేపట్టిన ది రాయల్ కెనడియన్ మౌంటెంట్ పోలీసులు.. విన్నిపెగ్‌కు చెందిన 25 ఏళ్ల అబ్జీత్ కింగ్రాగా అంటారియోలో అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఇదే కేసులో మరో నిందితుడు 23 ఏళ్ల విక్రమ్ శర్మ ఇండియాకు పారిపోయినట్లు భావిస్తున్నారు. చివరిగా ఇతను విన్నిపెగ్‌లో నివాసం ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. విక్రమ్ శర్మ ఫొటో పోలీసుల వద్ద లేకపోవడంతో అతడిని గుర్తించడం కష్టంగా మారింది. అయితే తమ వద్ద డేటాను భారత పోలీసులకు పంపినట్లు సమాచారం.
సేఫ్ అంటూ మెసేజ్..
కాల్పుల ఘటన తర్వాత తాను సేఫ్‌గానే ఉన్నానని AP ధిల్లాన్ తెలిపారు. "నేను క్షేమంగానే ఉన్నా. నా ప్రజలు కూడా క్షేమంగా ఉన్నారు. నా గురించి ఆందోళన పడ్డ వారందరికీ ధన్యవాదాలు" అని తన అభిమానులకు ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ధిల్లాన్‌ను ఎందుకు టార్గెట్ చేశారు?
ధిల్లాన్ గతంలో ‘ఓల్డ్ మనీ’ పేరిట షార్ట్ యాక్షన్ ఫిల్మ్ విడుదల చేశారు. అందులో బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సంజయ్‌దత్ నటించారు. ఈ ఫిల్మ్ రిలీజ్ చేసిన కొన్ని వారాలకు ధిల్లాన్ ఇంటిపై కాల్పులు జరిగాయి. తన షార్ట్ ఫిల్మ్‌లో సల్మాన్ ఖాన్ నటిం చినందుకే బిష్ణోయ్ గ్యాంగ్ ధిల్లాన్‌ను టార్గెట్ చేసినట్లు సమాచారం. "నీ హద్దులో ఉండకపోతే కుక్క చావు చస్తావు' అని గతంలో ధిల్లాన్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
సల్మాన్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు?
రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడి చంపాడని సల్మాన్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కృష్ణ జింకలను దైవంతో సమానంగా భావించే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అప్పటి నుంచి సల్మాన్‌ను టార్గెట్ చేసింది. ఆయనను హత్య చేసేందుకు గ్యాంగ్ పలుమార్లు ప్రయత్నించింది.
అసలు ఏపీ ధిల్లాన్ ఎవరు?
అమృతపాల్ సింగ్ ధిల్లాన్ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా ములియన్వాల్‌లో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించారు. అమృత్‌సర్‌లోని బాబా కుమా సింగ్ జీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2015లో బ్రిటిష్ కొలంబియాలోని సానిచ్‌లోని కామోసన్ కాలేజీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సు చేయడానికి గురుదాస్‌పూర్ నుంచి కెనడాకు మకాం మార్చారు. ఇండో-కెనడియన్ రాపర్, గాయకుడిగా పేరున్న ధిల్లాన్.. 'బ్రౌన్ ముండే,' 'ఎక్స్‌క్యూస్‌లు,' 'సమ్మర్ హై' వంటి హిట్ ట్రాక్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.