
దేశంలో తగ్గిన శిశు మరణాల రేటు..
గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 44 నుంచి 28కి, పట్టణ ప్రాంతాల్లో 27 నుంచి 18కి తగ్గింది.
ఇది నిజంగా మనమందరం సంతోషించే వార్త. దేశంలో శిశు మరణాలు రేట్లు బాగా తగ్గాయి. 2013లో 40 పాయింట్ల నుంచి 2023లో 25 పాయింట్లకు తగ్గినట్లు ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం నివేదిక-2023’ (Sample Registration System Report- 2023) వెల్లడించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో దేశంలోనే అత్యధికంగా 37 పాయింట్లు, మణిపుర్‌లో అత్యల్పంగా మూడు పాయింట్ల ఐఎంఆర్ రేటు నమోదైంది. పెద్ద రాష్ట్రాల్లో కేవలం కేరళలో మాత్రమే సింగిల్ డిజిట్ (5) రేటు నమోదైంది. తెలంగాణలో ఇది 18, ఆంధ్రప్రదేశ్‌లో 19గా తేలింది.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు(Infant Mortality Rate) తగ్గుదల 44 నుంచి 28కి చేరగా.. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 27 పాయింట్ల నుంచి 18కి తగ్గింది. 2023లో బీహార్‌లో అత్యధిక జనన రేటు 25.8గా నమోదుకాగా.. అండమాన్, నికోబార్ దీవుల్లో10.1తో అత్యల్పంగా నమోదయ్యింది.
గత ఐదు దశాబ్దాలుగా మరణాల రేటు క్రమంగా తగ్గింది. 1971లో 14.9 కాగా 2023లో 6.4కి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 2022లో 7.2 నుంచి 2023లో 6.8కి, పట్టణ ప్రాంతాల్లో 2022లో 6.0 నుంచి 2023లో 5.7కి పడిపోయింది. చండీగఢ్‌లో అత్యల్ప మరణాల రేటు 4 కాగా, ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 8.3 మరణాలు నమోదయ్యాయని నివేదిక తెలిపింది.