
‘పదేళ్ల ఓటరు జాబితా, వీడియో రికార్డింగులు ఇవ్వండి’
ఈసీని కోరిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
బీజేపీ, భారత ఎన్నికల సంఘం (EC) లక్ష్యంగా చేసుకుని.. లోక్‌సభ(Lok Sabha)లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ఆరోపణలను బెంగళూరులో మరోసారి పునరుద్ఘాటించారు. నిన్నటి రోజున (ఆగస్టు 7) ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటరు జాబితాలో అవకతవకలపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాషాయ పార్టీ ఈసీతో కుమ్మకై ‘ఓట్ల చోరీ’కి పాల్పడిందని, ఈ విషయంలో తక్షణం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మహాదేవపుర శాసనసభ స్థానానికి చెందిన ఓటర్ల జాబితాను తమ పార్టీ విశ్లేషించిందని చెప్పారు. ఈ సందర్భంగా 1,00,250 ఓట్లు చోరీకి అయినట్లు తేలిందన్నారు. ‘‘ఈ నియోజకవర్గంలో 11,965 డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. 40,009 మంది తప్పుడు అడ్రస్ ఇచ్చారు. 10,452 మంది ఒకే అడ్రస్‌లో ఉన్నారు. 4,132 మంది ఓటర్లవి తప్పుడు ఫొటోలున్నాయి. 33,692 మంది ఫారం-6 దుర్వినియోగం చేశారు’’ అని రాహుల్ వివరించారు.
ఈసీ ఓట్ల దొంగతనానికి పాల్పడిందని ఆరోపించిన రాహుల్.. తక్షణమే పదేళ్ల ఓటరు జాబితా, ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన వీడియో రికార్డింగులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెంగళూరులో జరిగిన 'ఓటు అధికార్ ర్యాలీ'లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడానికి మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లను ఎక్కించారని ఆరోపించారు.
రాహుల్‌కు కర్ణాటక సీఎం మద్దతు..
రాహుల్ వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్థించారు. "బీజేపీని అధికారంలో ఉంచడానికి 2024 ఎన్నికలను ఈసీ తారుమారు చేసింది. "కర్ణాటక రాష్ట్రం మహదేవపురలో మాత్రమే లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని రాహుల్ గుర్తించారు. దేశవ్యాప్తంగా తమ గెలుపుకోసం బీజేపీ ఇలాంటి వ్యూహాలను అనుసరించి ఉండవచ్చు. ఇది మీ ఓటును కాపాడానికి మేం చేస్తున్న పోరాటం,’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.