T20 ప్రపంచ కప్ వివాదం: భారత్ మ్యాచ్ బహిష్కరణపై ICC–PCB చర్చలు
x

T20 ప్రపంచ కప్ వివాదం: భారత్ మ్యాచ్ బహిష్కరణపై ICC–PCB చర్చలు

లాహోర్ చేరిన BCB చీఫ్


Click the Play button to hear this message in audio format

2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న పాకిస్తాన్ నిర్ణయం నేపథ్యంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ (ICC), పీసీబీ (PCB) మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ లాహోర్‌కు చేరుకున్నారు.

పీసీబీ ఆహ్వానం మేరకు జరిగిన ఈ పర్యటనలో అమీనుల్ ఇస్లాం పీసీబీ ఉన్నతాధికారులతో పాటు ఐసీసీ ప్రతినిధులను కూడా కలిసే అవకాశముంది. టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, భద్రతా అంశాలు మరియు విస్తృత క్రికెట్ సమస్యలపై చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ భారత్‌లో ఆడటానికి నిరాకరించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో బంగ్లాదేశ్ పోటీ నుంచి వైదొలిగింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చారు.

ఇక బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి తమ ప్రభుత్వ ఆదేశాలే కారణమని పీసీబీ ఐసీసీకి తెలియజేసింది. దీనిపై “ఫోర్స్ మేజూర్” నిబంధనను వర్తింపజేసిన కారణాలు వెల్లడించాలని ఐసీసీ కోరింది.


ఫోర్స్ మేజూర్ అంటే ఏమిటి?

అనూహ్యమైన ప్రకృతి విపత్తులు, యుద్ధాలు లేదా ప్రభుత్వ ఆదేశాలు వంటి నియంత్రణకు అతీతమైన పరిస్థితుల వల్ల ఒప్పంద బాధ్యతలను నిర్వర్తించలేనప్పుడు వర్తించే చట్టపరమైన సూత్రాన్నే ఫోర్స్ మేజూర్ అంటారు.

ఈ నేపథ్యంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా కూడా పీసీబీ అధికారులతో చర్చల కోసం లాహోర్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరిగేలా మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. సరైన కారణాలు చూపలేకపోతే పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించే అవకాశముందని ఐసీసీ హెచ్చరించినట్లు సమాచారం.


ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ ప్రాముఖ్యం..

భారత్–పాక్ మ్యాచ్‌లు కేవలం క్రీడా పరంగానే కాకుండా ఆర్థికపరంగానూ అత్యంత ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, టిక్కెట్ల ద్వారా కోట్లాది డాలర్ల ఆదాయం వచ్చే అవకాశముంది.

ఇదిలా ఉండగా టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ రెండూ తమ తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. పాకిస్తాన్ నెదర్లాండ్స్‌పై స్వల్ప తేడాతో గెలవగా, భారత్ అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది

Read More
Next Story