టీమిండియాకు షాక్.. పెర్త్ టెస్ట్ కు గిల్ దూరం
x

టీమిండియాకు షాక్.. పెర్త్ టెస్ట్ కు గిల్ దూరం

ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫికి ముందే భారత్ షాక్ తగిలింది. యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు.


ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫి ముందే భారత్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సిరీస్ ప్రారంభానికి ముందే ఒపెనర్ గా భావిస్తున్న కేఎల్ రాహుల్ కు గాయం అయింది, దీనితో నవంబర్ 22న ప్రారంభం అయ్యే తొలి టెస్టు కు రాహుల్ అందుబాటు లో ఉంటాడో లేదో అన్న అనుమానం మొదలయింది.

తాజాగా మరో యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ పెర్త్ టెస్ట్ కు గాయంతో దూరమయ్యాడు. భారత్ జట్టు, ‘ఏ’ జట్టుతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయన ఎడమ చేతి బొటన వేలు విరిగింది. బంతిని ఆపే క్రమంలో గిల్ వేలికి గాయం కావడంతో నొప్పితో మైదానంలో విలవిలాడాడు.
స్కాన్ లో వేలు విరిగినట్లు తెలియడంతో అధికారికంగా మ్యాచ్ కు దూరమయ్యాడు. అడిలైడ్ లో జరిగే రెండో టెస్టుకు మాత్రం సిద్దమవుతారని తెలుస్తోంది. గిల్ కు రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని తరువాత ప్రాక్టీస్ కు హజరవుతారని మేనేజ్ మెంట్ తెలిపింది.
రోహిత్ దూరం..
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం పితృత్వ సెలవులో ఉన్నాడు. మొదటి టెస్టు కు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో గిల్ ఒపెనర్ గా వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. క్రితం సారీ ఆసీస్ లో జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో గిల్ కూడా అద్భుతంగా రాణించాడు.
రోహిత్ దూరం కావడం, తరువాత రాహుల్ కు గాయం, ఇప్పుడు గిల్ మొదటి టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో ఓపెనర్ గా అభిమన్యు ఈశ్వరన్ కు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. విరాట్ కు కూడా గాయం కావడంతో స్కాన్ కు వెళ్లినట్లు సమాచారం. కానీ గాయం పెద్దది కాదని తేలడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది.
రెండో టెస్టుకు షమీ..
దాదాపు ఏడాది గాయం తరువాత రంజీ మ్యాచుల్లో అడుగుపెట్టిన నాలుగు వికెట్లతో ఫామ్ చాటుకున్న వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రెండో టెస్టు నాటికీ జట్టుతో చేరతాడని బీసీసీఐ లోని ఓ సోర్స్ వెల్లడించింది. మధ్యప్రదేశ్ తో జరిగిన రంజీ మ్యాచ్ లో దాదాపు 43 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బంతులు సంధించాడు.
టీమిండియా వైద్యబృందం అతడు ఫిట్ గా ఉన్నాడని భావించిన పక్షంలో రెండో టెస్ట్ నాటికి షమీ జట్టుతో చేరే అవకాశం ఉంది. రోహిత్ మొదటి టెస్టుకు అందుబాటులో ఉండని పక్షంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.
కానీ రోహిత్ భార్య ప్రసవించిన నేపథ్యంలో అతడు ఆసీస్ కు తిరిగి వచ్చిన మొదటి టెస్టుకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. భారత జట్టు మరో రెండు సెషన్ లు ప్రాక్టీస్ చేశాక, భారత ఏ జట్టు తిరిగి స్వదేశానికి రానుంది. ఆటగాళ్లంతా సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్ కి అందుబాటులో ఉంటారు.
కాగా గత దశాబ్ధకాలంగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫిని ఆస్ట్రేలియా గెలుచుకోలేదు. భారత్ లోనూ, ఆసీస్ లోను టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. దీనికి తోడు ఈ సిరీస్ గెలిచిన జట్టే నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉండటంతో ఇరు జట్టు హోరాహోరీగా పోరాడతాయనడంలో సందేహం లేదు. 2022-23 లో జరిగిన బీజీటీ సిరీస్ లో భారత జట్టు యువకులతోనే సిరీస్ ను 2-1 తో గెలుచుకుని చరిత్ర సృష్టించింది.


Read More
Next Story