ఊరించి ఉసూరుపనిపించిన ఎస్ఆర్‌హెచ్.. కారణం చెప్పిన కమిన్స్
x

ఊరించి ఉసూరుపనిపించిన ఎస్ఆర్‌హెచ్.. కారణం చెప్పిన కమిన్స్

ఐపీఎల్ 2024 ఫైనల్స్‌‌లో ఎస్‌ఆర్‌హెచ్ చిత్తయింది. మ్యాచ్ తర్వాత ఇరు జట్ల సారధులు తమ పరాజయానికి, విజయానికి కారణాలు వివరించారు. అవేంటంటే..


ఐపీఎల్ 2024 మ్యాచ్ నెవ్వర్ బిఫోర్ అనే థ్రిల్ ఇస్తుందని కలలు కన్న క్రికెట్ ప్రేమికులను ఆదివారం నిరాశే ఎదురైంది. క్వాలిఫయర్ 1 గెలిచి ఫైనల్స్‌కు చేరిన కేకేఆర్‌తో.. ఫైనల్స్‌కు రావడానికి క్వాలిఫయర్‌లో ఆర్ఆర్‌ను చిత్తు చేసి తాను ఇంకా ఫామ్‌లోనే ఉన్నాను, కప్ కొట్టడానికి తానకు అవకాశాలు ఉన్నాయని చూపించిన ఎస్‌ఆర్‌హెచ్ తలపడింది. ప్లేఆఫ్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇచ్చిన కంబ్యాక్ చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈసారి ఆరెంజ్ ఆర్మీ దండయాత్ర తథ్యమని, టోర్నీ గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు.

ప్రారంభం నుంచి తుస్సే

ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే ఆరెంజ్ ఆర్మీ తట్టాబుట్టా సర్దుకోవడం ప్రారంభించేసిందని అర్థమైపోయింది. అత్యంత పేలవమైన ప్రదర్శనతో గేమ్ ప్రారంభం నుంచి పేలని టపాసులా మారింది ఎస్‌ఆర్‌హెచ్. చివరకు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఇంటికి మోసుకెళ్లింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 113 పరుగులకే ఆలౌట్ అయి ఉసూరుమనిపించింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్.. రెండు వికెట్లు కోల్పోయి 10.3 ఓవర్లలో ఛేజ్ చేసి విజేతగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటతీరు ఆరంభం నుంచి తుస్సుమనే అంది. ఓపెనర్స్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ, త్రవిస్ హెడ్ ఇద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. రెండు పరుగులకే అభిషేక్.. పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత 6 పరుగుల దగ్గర త్రవిస్ హెడ్ కూడా వికెట్ కోల్పోయి వెనుతిరిగాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి కూడా 9 పరుగులు చేసి చాలనుకున్నాడు. అలా ఒకరి తర్వాత ఒకరిగా అత్యల్ప స్కోర్‌లు చేసి పెవిలియన్ బాటపట్టారు. వీరి గేమ్ చూస్తున్నంత సేపు కూడా అసలు ఇది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్న టోర్నీ ఫైనల్ మ్యాచా లేకుంటే గల్లీలో పిల్లలు ఆడుకుంటున్న మ్యాచా అన్న సందేహాలు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్ జట్టు మొత్తంలోకి అత్యధిక స్కోరర్‌‌గా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిలిచాడు. అతడు 19 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత మార్‌క్రమ్ 20 పరుగులు చేశాడు.

కేకేఆర్ వీర విహారం

114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు మైదానంలో వీరవిహారం చేశారు. ఓపెనర్‌గా వచ్చిన రహ్మనుల్లాహ్ గుర్బాజ్.. తొలి బంతి నుంచే ఊపడం ప్రారంభించాడు. 32 బంతుల్లో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన వెంకటేష్ అయ్యార్.. బంతిని చుక్కల్లో చూపించాడు. 26 బంతుల్లోనే 52 పరుగులు చేసి కేకేఆర్‌కు ఒంటిచేత్తో ట్రోఫీని అందించాడు.

కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా కేకేఆర్ ఏమాత్రం తగ్గలేదు. ఆండ్రూ రస్సెల్ మూడు వికెట్ల పడగొడితే, మిఛెల్ స్టార్క్, హర్షిత్ రాణా చెరి రెండు వికెట్లు తీశారు. మిగిలిన వైభర్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు. ఆదివారం చెన్నైలోని ఎం చిదంబరం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం ఎప్పుడు చూసిన కేకేఆర్ వీరవిహారమే కనిపించింది.

‘అందుకే ఓడిపోయాం’

మ్యాచ్ ముగిసిన తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. తమ ఓటమికి కారణాన్ని వివరించారు. కోల్‌కతా అసాధారణ ప్రదర్శన తమ ఓటమిలో కీలక పాత్ర పోషించిందని కమిన్స్ వివరించాడు. క్వాలిఫయర్ 1 మ్యాచ్ తరహాలోనే ఫైనల్‌లో కూడా తమకు కోలుకునే అవకాశాన్ని కేకేఆర్ ఏమాత్రం ఇవ్వలేదని చెప్పాడు. ‘‘ఐపీఎల్ 2024 ఫైనల్లో కేకేఆర్ సాధించిన గెలుపు క్రెడిట్ పూర్తిగా వాళ్ల బౌలర్లకే దక్కుతుంది. వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లో మేము అత్యంత దారుణంగా విఫలమయ్యాం. మా స్థాయికి తగిన విధంగా ప్రదర్శన చేయలేకపోయాం. కేకేఆర్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశాం. కనీసం 160 పరుగులు చేసి ఉన్నా పోరాడటానికి అవకాశం ఉండేది. కానీ అందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఈ సీజన్‌ మాకు చాలా ప్రత్యేకం. ఈ సీజన్‌లో మేము చాలా బలమైన జట్టుగా నిలిచాం. మూడుసార్లు 250 పరుగులు చేశాం’’ అని చెప్పాడు. మరోమాటలో చెప్పాలంటే.. తమ గెలుపుకు కేకేఆర్ బలమైన బౌలర్లే కారణం తప్పా తమ చేతకాని తనం కాదని కమిన్స్ తమ ఓటమిని కప్పిపుచ్చుకున్నాడు.

‘మాకదే కలిసొచ్చింది’

ఐపీఎల్ 2024 టోర్నీ ఛాంపియన్‌గా కేకేఆర్ నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ సాధించిన మూడో టైటిల్ ఇది. ఈ మ్యాచ్‌లో వార్ వన్‌సైడ్‌గా సాగింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తమ విజయ రహస్యాన్ని వెల్లడించాడు. తమ గెలుపుకు కొన్ని అంశాలు బాగా కలిసి వచ్చాయన్నాడు. ‘‘మా విజయంలో స్టార్క్, రసెల్ కీలకంగా వ్యవహరించారు. మా గెలుపులో అధిక క్రెడిట్ వారిదే. ఒత్తిడితో సాగిన ఈ పోరులో స్టార్క్ అద్భుతంగా రాణించాడు. అతడిని చూసి యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్‌లో ప్రతి విషయం మాకు కలిసొచ్చింది. తొలుత బౌలింగ్ చేయడం కూడా అందులో ఒకటి. ప్లేయర్స్ అందరూ కూడా టీమ్ గెలుపే తమ గెలుపుగా భావించి ఆడారు. మా విజయ రహస్యం ప్లేయర్ల మధ్య ఉన్న ఐకమత్యం’’ అని చెప్పాడు.

‘‘జట్టు సభ్యుల నుంచి మేం కోరుకున్నదాన్ని వాళ్లు అందించారు. కీలక సమయాల్లో అంతా కలిసికట్టుగా జట్టుకోసం నిలబడ్డారు. ఈ సీజన్ మొత్తం అజేయులుగా నిలిచాం. తొలి మ్యాచ్ నుంచే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. అదే విధంగా అద్భుతమైన ప్రదర్శన, పోటీ ఇచ్చిన ఎస్‌ఆర్‌హెచ్‌కు కంగ్రాట్స్’’ అని వివరించాడు.

Read More
Next Story