ఈ కుర్రాళ్లని అతిగా పొగిడి  పాడు చేస్తున్నారేమో!
x
ప్రఫుల్, వైభవ్ సూర్యవంశీ

ఈ కుర్రాళ్లని అతిగా పొగిడి పాడు చేస్తున్నారేమో!

సూర్యవంశీ వర్సెస్ ప్రఫుల్.. ఈ ఇద్దర్నో ఎవరు గొప్ప?


రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య సోమవారం రాత్రి మ్యాచ్ చూసిన వాళ్లందరి మదిలో రెండు పేర్లు బాగా మెదలిఉంటాయి. ఐపీఎల్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇద్దరు కుర్రాళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఒకరు వేలంలో కోట్లు పలికిన 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ కాగా, మరొకరు అరంగేట్రం మ్యాచ్‌లోనే నిప్పులు చెరిగే బంతులతో వికెట్లు పడగొట్టిన విదర్భ ఎక్స్‌ప్రెస్ ప్రఫుల్ హింగే.
యువ సంచలనాల పోరు..
ఐపీఎల్ అంటేనే అనూహ్య పరిణామాల వేదిక. నిన్నటి వరకు ఒకరు హీరో అయితే, నేడు మరొకరు వారిని మించి వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం వైభవ్ సూర్యవంశీ ప్రతిభ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో, అతడిని తొలి బంతికే బోల్తా కొట్టించి ప్రఫుల్ హింగే అసలైన 'గేమ్ ఛేంజర్' అనిపించుకున్నాడు.

సూర్యవంశీ: అంచనాల భారం..

వైభవ్ సూర్యవంశీ.. అతి చిన్న వయసులోనే కోట్లాది రూపాయల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించాడు.

టెక్నిక్ పరంగా మంచి పట్టున్న ఈ బ్యాటర్, గత మ్యాచ్‌ల్లో తన ఫామ్‌తో ప్రత్యర్థులను భయపెట్టాడు. అయితే, నిన్నటి మ్యాచ్‌లో ప్రఫుల్ విసిరిన వ్యూహానికి బలైపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే, వైభవ్ మీద ఉన్న విపరీతమైన హైప్ అతనికి శత్రువుగా మారింది.
ప్రఫుల్ హింగే: పక్కా ప్లాన్‌...
మరోవైపు ప్రఫుల్ హింగే కథ పూర్తిగా భిన్నం. 13 ఏళ్ల వరకు లెదర్ బాల్ అంటేనే తెలియని ఈ కుర్రాడు, తన కఠిన శ్రమతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గూటికి చేరాడు.

తన అరంగేట్రం ఎలా ఉండాలో ముందే డైరీలో రాసి పెట్టుకున్నాడంటే అతనికి తనపై ఉన్న నమ్మకం అర్థమవుతుంది.
ముందే చెప్పాడు.. చేసి చూపాడు. "సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేస్తా" అని తన సన్నిహితులతో చెప్పిన ప్రఫుల్, అన్నట్టుగానే పక్కా బౌన్సర్‌తో అతడిని పెవిలియన్ పంపాడు.
తొలి ఓవర్‌లోనే ప్రకంపనలు సృష్టించాడు. కేవలం వైభవ్‌నే కాకుండా, అదే ఓవర్‌లో మరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి నడ్డి విరిచాడు.

ఇద్దరి మధ్య పోలికలు - వ్యత్యాసాలు

వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అటాకింగ్ శైలి. చిన్నవయసులోనే అపారమైన టాలెంట్ ను చూపించిన వాడు. టీనేజీ సెన్సేషన్. కోట్ల రూపాయల ధర పలుకుతున్న వాడు. అటువంటి కుర్రాడిపై అధిక ఒత్తిడి పెంచడం సరికాదు. "తదుపరి సచిన్" లేదా "తదుపరి కోహ్లీ" వంటి బిరుదులు ఇస్తే, ఆ అంచనాలను అందుకోవాలనే ఒత్తిడిలో తన సహజమైన ఆటను కోల్పోతారు.
చిన్న వయసులోనే విపరీతమైన కీర్తి, డబ్బు (ముఖ్యంగా IPL వేలం తర్వాత) రావడం వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్నే 'సక్సెస్ తలకెక్కడం' అంటారు.
అతిగా పొగిడినప్పుడు, తన ఆటలో లోపాలు లేవని ఆటగాడు భావించవచ్చు. కానీ వైభవ్ ఎదుర్కోవాల్సింది అంతర్జాతీయ స్థాయి బౌలర్లను, అక్కడ నిలబడాలంటే నిరంతరం మెరుగుపడాలి.
ఇక ప్రఫుల్ హింగే ...
దేశవాళి బౌలరు. మహారాష్ట్ర విదర్భ. లోకల్ టాలెంట్ ఉంది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, నిప్పులు చెరిగే పేస్, బౌన్సర్లు, మానసిక ధైర్యం, పక్కా ప్లానింగ్ అతని సొంతం. సూర్యవంశీ ధర కోట్లలో ఉంటే రూ. 30 లక్షలు కూడా పలకని ఈ కుర్రాడు కసిగా ఆడి తన సత్తా నిరూపించుకున్నాడు.
అరంగేట్రం మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడం వల్ల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ప్రతి మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రాణించడం సవాలుతో కూడుకున్న పని. కాబట్టి, సక్సెస్‌ను తలకెక్కించుకోకుండా నిలకడైన లైన్ అండ్ లెంగ్త్‌పై దృష్టి పెట్టాలి.
ప్రఫుల్ బౌన్సర్లు బాగా వేస్తున్నాడు, కానీ కేవలం వేగంపైనే ఆధారపడితే బ్యాటర్లు త్వరగా అలవాటు పడిపోతారు.
ప్రఫుల్ ఇప్పటికే గాయాల నుంచి కోలుకుని వచ్చినట్లు చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లకు ఫిట్‌నెస్ ప్రాణం. ముఖ్యంగా వెన్ను, మోకాళ్ల గాయాలు కాకుండా ఫిజియోల సూచనలు పాటిస్తూ వర్కవుట్స్ చేయాలి.
తొలి బంతికే వికెట్ తీస్తానని చెప్పి మరీ తీశాడంటే, అతనికి ప్రత్యర్థి బలహీనతలను విశ్లేషించే అలవాటు ఉందని అర్థమవుతోంది. ఇదే విశ్లేషణా సామర్థ్యాన్ని (Analysis) కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజ బ్యాటర్ల విషయంలో కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఒక్క మ్యాచ్‌తోనే స్టార్ అయిపోయాననే భావన రాకుండా చూసుకోవాలి. సన్‌రైజర్స్ టీమ్‌లో ఉన్న సీనియర్ బౌలర్ల నుంచి స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
నిన్నటి మ్యాచ్ ఫలితాన్ని చూస్తే ప్రఫుల్ హింగే స్పష్టంగా పైచేయి సాధించాడు. వైభవ్ వంటి డేంజరస్ బ్యాటర్‌ను మైండ్ గేమ్‌తో బోల్తా కొట్టించడం మామూలు విషయం కాదు. అయితే, ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే.
Read More
Next Story