Sports | మను బాకర్, గుకేశ్‌తో పాటు మరో ఇద్దరికి ‘‘ఖేల్ రత్న’’
‘‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’’ పురస్కారానికి నలుగురిని, అర్జున అవార్డుకు 32మందిని, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురిని ఎంపిక చేశారు.
భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను(Khel Ratna Award) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి నలుగురు క్రీడాకారులను ఎంపిక చేసింది. చెస్ విభాగంలో డి.గుకేశ్(Gukesh Dommaraju), హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh), పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్(Praveen Kumar), షూటింగ్ విభాగంలో మను బాకర్(Manu Bhaker) ఈ అవార్డు అందుకోనున్నారు. వీరితో పాటు 32మంది అర్జున, ఐదుగురు ద్రోణాచార్య పురస్కారాలు అందుకోనున్నారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్నవారిలో 17మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకుంటారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
22 ఏళ్ల మను భాకర్ ఒలింపిక్స్‌లో ఒకే సారి రెండు పతకాలు గెలుచుకున్న మొదటి అథ్లెట్. ఆమె ఆగస్టులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
18 ఏళ్ల గుకేశ్ అతిపిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యారు. గత ఏడాది ఇండియా చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు కూడా.
ఖేల్‌రత్న విజేతలకు రూ. 25 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, పతకం లభిస్తాయి. అర్జున అవార్డు గ్రహీతలకు రూ.15 లక్షల నగదు బహుమతి, అర్జున విగ్రహం ప్రశంసాపత్రం లభిస్తాయి.