రేపటి మ్యాచ్ కి వరుణ్ చక్రవర్తిని తప్పిస్తే ఛాన్స్ ఎవరికీ?
x

రేపటి మ్యాచ్ కి వరుణ్ చక్రవర్తిని తప్పిస్తే ఛాన్స్ ఎవరికీ?

"టైమ్ ఎత్తు పోడు" తంబీ అని సంజూ శాంసన్ ఎందుకన్నారు!.. అభిషేక్ సేఫేనా?


న్యూజిలాండ్‌తో రేపు (ఆదివారం) జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు ముందు టీమ్ ఇండియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టుగా ఫైనల్‌కు చేరిన భారత్‌లో స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని ఫైనల్ తుది జట్టు నుండి తప్పించి, కుల్దీప్ యాదవ్‌ను తీసుకుంటారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఫైనల్‌లో 'వరుణ్' ఉంటాడా?
సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ ఫైనల్‌కు చేరినప్పటికీ, వరుణ్ చక్రవర్తి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్ బెథెల్ ఒకే ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదడం వరుణ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్లు కనిపిస్తోంది.

గత డిసెంబర్ నుంచి వరుణ్ వేసిన స్పెల్స్‌లో 8 బంతులు అత్యంత ఖరీదైనవిగా నమోదయ్యాయి. మంచి బంతులు వేసినా బ్యాటర్లు సులువుగా సిక్సర్లు కొడుతుండటం కోచ్‌లను ఆలోచనలో పడేసింది.
సెమీఫైనల్‌లో సంజు శాంసన్ పదే పదే వరుణ్ దగ్గరకు వెళ్లి తమిళంలో "టైమ్ ఎత్తు పోడు" ((Time eduthu podu- సమయం తీసుకుని బౌలింగ్ చేయి) అని ధైర్యం చెప్పాల్సి వచ్చింది. ఒక బౌలర్ ఒత్తిడికి లోనవుతున్నప్పుడు అది జట్టుకు ప్రమాదకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా వరుణ్ తనపై తాను ఎక్కువ ఒత్తిడి పెంచుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.
కుల్దీప్ యాదవ్ రేసులోకి వస్తాడా?
వరుణ్ చక్రవర్తి 'మిస్టరీ' బౌలింగ్‌ను ఇప్పుడు బ్యాటర్లు కనిపెట్టేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ వరుణ్‌ను పక్కన పెట్టాలని భావిస్తే, మేనేజ్‌మెంట్ ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం కుల్దీప్ యాదవ్. పెద్ద మ్యాచ్‌లలో కుల్దీప్ అనుభవం, వికెట్లు తీయగల సామర్థ్యం జట్టుకు అదనపు బలం కాగలవు.
అభిషేక్ శర్మ పరిస్థితి ఏంటి?
వరుసగా తక్కువ స్కోర్లకే అవుట్ అవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మను కూడా తప్పిస్తారా? అన్న చర్చ జరుగుతున్నా, టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అతనిపై పూర్తి నమ్మకంతో ఉంది. అభిషేక్ కేవలం పరుగులకే దూరమయ్యాడు కానీ, ఫామ్‌లో లేడని అనలేమని.. అతను టీ20 క్రికెట్‌లో అవసరమైన 'రిస్క్' తీసుకుంటున్నాడని జట్టు వర్గాలు అంటున్నాయి. కాబట్టి అభిషేక్ ఫైనల్ ఆడటం దాదాపు ఖాయం.
నిర్ణయం ఎవరిది?
కెప్టెన్, కోచ్ ఫైనల్ పిచ్‌ను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. వరుణ్‌కు ఉన్న విభిన్న రకాల బంతులు (Variations) న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేస్తాయని భావిస్తే అతనే కొనసాగుతాడు. లేదంటే, నమ్మదగ్గ వికెట్ టేకర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Read More
Next Story