
బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్..
షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన కర్ణాటక క్యాబినెట్..
బెంగళూరు చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహణకు కర్ణాటక మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. అయితే భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని షరతులు పెట్టింది. ఈ నిబంధనలను కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA), ఆర్‌సీబీ (RCB) తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
తొక్కిసలాట ఘటనతో..
జూన్ 2025లో ఆర్‌సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. విజయోత్సవాల సందర్భంగా స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత స్టేడియంలో మ్యాచ్‌లు ఆడటంపై నిషేధం విధించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం జస్టిస్ జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పలు భద్రతా సిఫార్సులు చేసింది. అవి అమలయ్యాయా లేదా అన్నది పరిశీలించేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ కమిషనర్ ఎం. మహేశ్వర్ రావు నేతృత్వంలో మరో ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేశారు.
‘భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే..’
“ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి ఇస్తున్నాం. కానీ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయి” అని మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి హెచ్‌కే పాటిల్ పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) అంశంపైనా కేబినెట్ చర్చించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ అమలుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ నెలాఖరు నాటికి నివేదిక అందే అవకాశముందని మంత్రి తెలిపారు.

