
న్యూజిలాండ్ పై స్వీట్ రివెంజ్ తో ట్రోఫీ సాధించిన భారత్
మూడోసారి కప్పు కైవసం
ఆదివారం (9.3.25) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు గెలుచుకుంది. 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ చేతిలో ఫైనల్స్ ఓడిన భారత జట్టు అదే న్యూజిలాండ్ మీద స్వీట్ రివెంజ్ తీర్చుకుని ట్రోఫీని సాధించింది. ఇంతవరకు ఐదు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన భారత్ జట్టు మూడు సార్లు దాన్ని గెలుచుకుంది.
కొంతవరకు రాణించిన న్యూజిలాండ్ స్పిన్నర్లు
ఐసీసీ టోర్నమెంట్లలో 10-6 తేడాతో బలమైన జట్టుగా ఉన్న న్యూజిలాండ్ ను భారత్ సునాయాసంగా ఓడించింది. లీగ్ దశలో కూడా న్యూజిలాండ్ మీద అలవోకగా విజయం సాధించిన భారత్, ఫైనల్స్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగింది. స్పిన్ పిచ్ అని పేరుపడిన పిచ్ మీద భారత స్పిన్నర్లు, న్యూజిలాండ్ బౌలర్లతో ఆడుకున్నారు. కొంతవరకు న్యూజిలాండ్ బౌలర్లు కూడా గెలిచే అవకాశాలను సృష్టించినప్పటికీ, బలమైన భారత జట్టు బ్యాటింగ్ వల్ల న్యూజిలాండ్ స్పిన్నర్ల మాయాజాలం పనిచేయలేదు. కొంతవరకు భారత బ్యాట్స్మెన్లను నిలవరించినప్పటికీ, విజయం సాధించలేకపోయారు.
న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను తిప్పేసిన భారత స్పిన్నర్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకున్న న్యూజిలాండ్ జట్టు ఓపెనర్లు 8 ఓవర్లలో 57పరుగులు జోడించారు. తర్వాత యంగ్ 15 పరుగులకు, రవీంద్ర 37 పరుగులకు అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన విలియంసన్ పెద్దగా పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. అప్పుడు న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 23 ఓవర్లకు 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే 27 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 143 పరుగులు చేయడానికి కారణం మిచెల్(64), బ్రేస్ వెల్(53), ఫిలిప్స్(34) చక్కగా బ్యాటింగ్ చేయడమే. భారత జట్టు స్పిన్నర్లు ఐదు వికెట్లు తీశారు. చాలా కాలం తర్వాత ఆడుతున్న షమీ ఒక వికెట్ మాత్రమే తీశాడు.స్పిన్నర్ల కు అనుకూలమైన పిచ్ అని పేరుపడిన దుబాయ్ స్టేడియంలోని పిచ్ అది నిజమేనని అని రుజువు చేసింది. చివరికి న్యూజిలాండ్ జట్టు భారత్ ముందు మర్యాదపూర్వకమైన 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎత్తు పల్లాలతో సాగి ఓ రకమైన స్కోరును చేసిందని భావించాలి.
మరోసారి ఫెయిల్ అయిన గిల్- రాణించిన రోహిత్
252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ధాటిగానే ప్రారంభించింది. ప్రారంభంలోనే రెండు ఫ్లోర్లు, ఒక సిక్స్ కొట్టాడు రోహిత్. గిల్ ఇంతవరకు మూడు మ్యాచ్ లలో పెద్దగా రాణించలేదు. ఫైనల్స్ లో గిల్ సత్తా చూపించవలసిన అవసరం లేదు కానీ, మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. నాలుగు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 30 పరుగులతో భారత ముందుకు నడిచింది. స్మిత్ వేసిన మొదటి ఓవర్లో రోహిత్ శర్మ తన రెండవ సిక్స్ ను కొట్టి, తన అభిమతాన్ని స్పష్టం చేశాడు.
భారత జట్టు 17 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 100 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త నిదానించి పరుగులు జోడిస్తూ పోయాడు. మూడు సిక్సర్లు 7 బౌండరీలతో భారత జట్టు స్కోరును ముందుకు నడిపాడు. ఈ లెక్కన చూస్తే 40 ఓవర్ల లోనే మ్యాచ్ అయిపోయేటట్లు అనిపించింది. గిల్ కూడా తనవంతుగా 31 పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్ లో ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. ఆ విధంగా భారత్ తన మొదటి వికెట్ ను కోల్పోయింది.
కొంత ఉత్కంఠత రేపినప్పటికీ... ఫలితం లేకపోయింది
తర్వాతి ఓవర్ లో బ్రేస్ వెల్ వేసిన బంతికి కోహ్లీ అవుట్ కావడం తో న్యూజిలాండ్ ఆటగాళ్లలో కొంత ఉత్సాహం వచ్చింది. మ్యాచ్ కొంత ఉత్కంఠ భరితంగా మారే అవకాశం కలిగింది. అయితే రోహిత్ శర్మ తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు . రెండు ముఖ్యమైన వికెట్లు కోల్పోయినప్పటికీ, భారత జట్టు పటిష్టమైన స్థితిలోనే ఉండింది. కోహ్లీ తర్వాత వచ్చిన శ్రేయస్ కూడా ఒక బౌండరీ తో బ్యాటింగ్ మొదలుపెట్టాడు. రెండు వికెట్లు తీసుకోవడం వల్ల, న్యూజిలాండ్ స్పిన్ బౌలర్లలో కొంత ఉత్సాహం వచ్చింది. 25 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.
రాణించి బ్రేస్ వెల్.. సాంట్నర్
సాంట్నర్ ,బ్రేస్ వెల్ ల జంట భారత బ్యాట్స్మెన్ లకు కొంత కళ్లెం వేశారు. 26వ ఓవర్ ను బ్రేస్వెల్ మేడేన్ ఓవర్ వేయడం అందుకు ఉదాహరణ. రవీంద్ర వేసిన ఓవర్లో ఉన్నట్టుండి రోహిత్ శర్మ ఓట్ అయ్యాడు. ముందుకు వచ్చి సిక్స్ కొట్టే ప్రయత్నంలో స్టంప్ అవుట్ అయ్యాడు. భారత్ కు ఇది కొంచెం ఇబ్బంది కలిగించింది. రవీంద్ర ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.
భారత బ్యాట్స్మెన్లు ఫాస్ట్ బౌలింగ్ ని ఆడినంత సులభంగా స్పిన్ బౌలింగ్ ఆడ లేకపోవడం విశేషం. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉన్న పిచ్ స్పిన్ కు అనుకూలమని అనిపించింది. ఈ దశలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ స్పిన్ బౌలర్ల నే కంటిన్యూ చేయడం విశేషం. 30 ఓర్లు ముగిసే సమయానికి భారత జట్టు 133 పరుగులకు మూడు వికెట్లు పోగొట్టుకుని చేసింది. ఇక 20 ఓవర్లలో 119 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. రన్ రేట్ ఆరు కు చేరుకుంది. అంతవరకు ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు కొంచెం పై చేయిగా ఉన్నట్లు అనిపించింది.
ఆ క్యాచ్ ను పట్టి ఉంటే....!!
37 ఓవర్ లో శ్రేయాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ను న్యూజిలాండ్ ఫీల్డర్ జేమిసన్ వదిలేయడం న్యూజిలాండ్ కు పెద్ద దెబ్బ. వదిలేసింది క్యాచ్ ను కాదు కప్పును అనిపించింది. చాలా సులభమైన క్యాచ్ అది. అది మ్యాచ్ను మలుపు తిప్పే అవకాశం ఉన్న క్యాచ్ . 39 ఓవర్ లో రవీంద్ర పట్టిన మంచి క్యాచ్ తో శ్రేయాస్,42 పరుగులకు అవుట్ అయ్యాడు. మరోసారి సాంట్నర్ న్యూజిలాండ్ ను మ్యాచ్ లోకి తీసుకొచ్చాడు. మ్యాచ్ చివరి వరకు వెళ్లే అవకాశం కనిపించింది. ఈ దశలో అక్షర్ కొట్టిన సిక్సర్ కొంత రిలీఫ్ ఇచ్చింది .
చివరి 10 ఓవర్లలో 61 పరుగులు చేయాల్సిన దశ కి భారత్ చేరుకుంది. ఇప్పటి కి కూడా భారత్ కే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. సాంట్నర్ బౌలింగ్లో వికెట్ కీపర్ రాహుల్ కొట్టిన సిక్స్ తో భారత్ ముందడుగు వేసింది.
చివర్లో కొంత ఉత్కంఠ రేపిన న్యూజిలాండ్ బౌలింగ్
బాగా ఆడుతున్న అక్షర పటేల్ బ్రేస్ వెల్ బౌలింగ్లో అవుట్ కావడంతో న్యూజిలాండ్ మళ్లీ, మ్యాచ్ లోకి వచ్చింది. ఇక భారత్ కు కప్పు ఇవ్వాల్సిన బాధ్యత పాండ్యా, రాహుల్ ల పైన పడింది. ఈ దశలో రెండు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. చివరి ఆరు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన స్థితికి భారత్ చేరుకుంది. 45 ఓవర్లో మొదటి బంతికే బౌండరీ కొట్టిన రాహుల్ తర్వాత బౌండరీకి రెండు పరుగులు చేసి, భారత్ ను గెలుపు వైపుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు భారత్ 33 బంతులకు 33 పరుగులు చేయవలసిన స్థితికి చేరుకుంది. ఇక చివరికి 5 ఓవర్లలో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితికి భారత్ చేరుకుంది. ఇద్దరు గుర్తింపు పొందిన బ్యాట్స్మెన్ లు ఉండడం వల్ల పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ దశలో మళ్ళీ రవీంద్ర బౌలింగ్ కి వచ్చాడు . అయితే భారత్ సూపర్ హిట్ మాన్ పాండ్యా నేరుగా సైడ్ స్క్రీన్ మీద కొట్టిన సిక్స్ తో న్యూజిలాండ్ పట్టు జారింది.
పాండ్యా తొందరగా ముగించే పనిలో పడ్డాడు. 47 వ ఓవర్ లో ఒక ఫోర్ కొట్టాడు. చివరికి మూడు ఓవర్లలో 12 పరుగులు చేయవలసిన స్థితికి భారత్ చేరుకుంది. ఇక అద్భుతం ఏదైనా జరిగితే తప్ప న్యూజిలాండ్ గెలిచే అవకాశం లేదు. 2000 సంవత్సరం న్యూజిలాండ్ చేతిలో ఫైనల్స్ ఓడిపోయిన, భారత్ 25 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ ను ఫైనల్స్ లో 4 వికెట్ల తేడాతో ఓడించి బదులు తీర్చుకోవడమే కాకుండా ఐసీసీ చాంపియన్ ట్రోఫీ కప్ ను మూడోసారి గెలుచుకుంది. చివరి 10 ఓవర్లలో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ ను భారత్ గెలిచి ట్రోఫీ ని సొంతం చేసుకుంది.
న్యూజిలాండ్ బ్యాటింగ్:
251 పరుగులు/7 వికెట్లు (50 ఓవర్లు)
రచిన్ రవీంద్ర 37 పరుగులు (29 బంతులు)
బ్రేస్ వెల్ 53 పరుగులు (40 బంతులు)
మిచ్చెల్ 63 పరుగులు (101 బంతులు)
ఫిలిప్స్ 34 పరుగులు (52 బంతులు)
భారత్ బౌలింగ్:
వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు (10 ఓవర్లు)
కుల్దీప్ 2 వికెట్లు (10 ఓవర్లు)
షమ్మి 1 వికెట్ (9 ఓవర్లు)
రవీంద్ర జడేజా 1 వికెట్ (10 ఓవర్లు)
భారత్ బ్యాటింగ్ :
254 పరుగులు/6 వికెట్లు (49 ఓవర్లు)
రోహిత్ శర్మ 76 పరుగులు (83 బంతులు)
అక్షర పటేల్ 29 పరుగులు (40 బంతులు)
అయ్యర్ 48 పరుగులు (62 బంతులు)
హార్దిక్ పాండ్యా 18 పరుగులు (18 బంతులు)
రాహుల్ 34 పరుగులు (33 బంతులు)
న్యూజిలాండ్ బౌలింగ్ :
బ్రేస్ వెల్ 2 వికెట్లు (10 ఓవర్లు)
జేమిసన్ 1 వికెట్ (5 ఓవర్లు)
సాంట్నర్ 2 వికెట్లు (10 ఓవర్లు)
రవీంద్ర 1 వికెట్ (10 ఓవర్లు)