దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం
x

దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం

జైస్వాల్ అద్భుత సెంచరీ, రోహిత్ 75… దక్షిణాఫ్రికా 270 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన భారత్


విశాఖపట్నం వేదికగా జరిగిన మూడోది, ఆఖరిదీ అయిన వన్డేలో భారత్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేజ్ చేస్తూ సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగినా మధ్య ఓవర్లలో భారత బౌలర్ల దాటికి సఫారీ జట్టు కుప్పకూలింది. తర్వాత రోహిత్–జైస్వాల్ జోడీ ఆద్యంతం ఆటపై పట్టుపై సాధించి భారత్‌ను గెలుపు దిశగా నడిపించారు. 271 పరుగుల లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి 39.5 ఓవర్లలోనే టీమ్ఇండియా ఛేదించింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా తేలికగా ఛేదించింది. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌ను గెలిచింది. దీంతో సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ–యశస్వి జైస్వాల్ జోడీ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించగా, సఫారీ బౌలర్లు మ్యాచ్ మొత్తంలో ప్రభావం చూపలేకపోయారు.
దక్షిణాఫ్రికా 270కి ఆలౌట్ అయిన తర్వాత భారత్ బ్యాటింగ్ ప్రారంభం నుంచే నిలకడగా సాగింది. యాన్సెన్ తొలి ఓవర్‌లోనే వైడ్‌ల రూపంలో బౌండరీలు వచ్చాయి. ఆరంభ మూడు ఓవర్లలో పెద్దగా పరుగులు రాలేకపోయినప్పటికీ, 6వ ఓవర్లో జైస్వాల్ సిక్స్, రోహిత్ ఫోర్‌తో స్కోరు పెరుగుతూనే వచ్చింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 29/0తో ఉత్సాహంగా ఉంది.
20వేల పరుగులు అధిగమించిన రోహిత్
ఆ తర్వాత రోహిత్–జైస్వాల్ జోడీ దాడి మరింత పెరిగింది. 12 ఓవర్లకే స్కోరు 59 దాటింది. 14వ ఓవర్‌లో సింగిల్ తీసుకుని రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. క్రమంగా ఆడతూ, 20వ ఓవర్‌లో రోహిత్ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
జైస్వాల్ కూడా దూకుడును పెంచాడు. 23వ ఓవర్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తరువాత రెండు ఫోర్లు బాదాడు. మరోవైపు రోహిత్, బాష్ వేసిన ఓవర్లలో సిక్స్‌లు, ఫోర్లతో సఫారీ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగించాడు. 25 ఓవర్లు పూర్తయ్యే సమయానికి భారత్ 153/0తో మ్యాచ్‌ను పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది.
అయితే 75 పరుగుల వ్యక్తిగత స్కోరులో రోహిత్ శర్మ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌కు బ్రిట్జ్కేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ అప్పటికే భారత్ విజయం దిశగా దూసుకుపోతున్నది. క్రీస్‌లోకి వచ్చిన కోహ్లీ జైస్వాల్‌కు సహకరిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
జైస్వాల్ మాత్రం తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ, సిక్స్‌లు, ఫోర్లతో రన్‌రేట్‌ను మెరుగుపర్చాడు. 36వ ఓవర్ లో సెంచరీ పూర్తి చేశారు. 114 బంతుల్లో వందపరుగులు పూర్తి చేశాడు. ఈ సెంచురీతో జైస్వాల్ మూడు ఫార్మట్లలోనూ సెంచురీలు చేసినట్టయింది. భారత్‌కు విజయానికి 20 ఓవర్లలో 91 పరుగులు మాత్రమే అవసరం ఉండటం మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షంగా సాగింది.
విరాట్ కోహ్లీ వీరవిహారం..
మ్యాచ్ ఏకపక్షంగా సాగుతోందని అర్థమైన తర్వాత విరాట్ కోహ్లీ రెచ్చిపోయారు. జైస్వాల్ సెంచురీ పూర్తి చేసేంత వరకు ఆగిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత వచ్చిన ఏ ఛాన్సునూ వదల్లేదు. అప్పటి వరకు 35 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ ఆ తర్వాత 5 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశారు.
విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తాను చాటారు. అప్పటికి భారత్ స్కోర్ 251. ఇంకో 20 పరుగులు చేస్తే భారత్ విజయం పూర్తి అయినట్టే అనుకున్న దశలో జైస్వాల్ మరో సిక్స్ బాది స్కోరును 263కి పెంచారు. దీంతో భారత్ గెలుపు తుది దశకు చేరింది.
270 పరుగులకు దక్షిణాఫ్రికా ఆల్ ఔట్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 270 పరుగులకు ఆల్ ఔట్ అయింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 3వ వన్డేలో సఫారీ జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. 270 పరుగులకు ఆల్ ఔట్ అయింది. ఒక దశలో బలమైన స్థితిలో ఉన్నప్పటికీ, మధ్యలో వికెట్లు వరుసగా కోల్పోయి కుప్పకూలే పరిస్థితికి చేరింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ శతకంతో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన సౌతాఫ్రికా, అతను ఔట్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఆరంభంలో బావుమా–డికాక్ జోడీ భారత పేసర్లను ధైర్యంగా ఎదుర్కొంది. 19 ఓవర్లకే జట్టు స్కోరు 100 పరుగులు దాటగా, 42 బంతుల్లో డికాక్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 113 పరుగుల భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న బావుమా (48) జడేజా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే డికాక్ మాత్రం తన అగ్రెసివ్ స్టైల్‌ను కొనసాగించి, 80 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.
కానీ అతని సెంచరీ ఎక్కువసేపు నిలువలేదు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 32.5 ఓవర్‌కు డికాక్ (106) క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ మలుపుతిరిగింది. ఆ తర్వాత ప్రసిద్ధ్ అదే ఓవర్లో మరో వికెట్ తీసి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచారు.
ఇక కుల్‌దీప్ యాదవ్ తన స్పిన్ తో మాయాజాలం చేశారు. 38వ ఓవర్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (29) రోహిత్‌కు క్యాచ్ ఇవ్వగా, మూడు బంతుల వ్యవధిలో మరోసారి చక్కని వికెట్ తీసి మార్కో యాన్సెన్‌ను (17) పెవిలియన్‌కి పంపించాడు. ఈ రెండు వికెట్లతో సఫారీ ఇన్నింగ్స్ పూర్తిగా కుంగిపోయింది. 42వ ఓవర్‌లో కుల్‌దీప్ తన మూడో వికెట్‌గా కోర్బిన్ బాష్ (9)ను ఔట్ చేసి సౌతాఫ్రికాను మరింతగా కుంగదీశారు.
చివరి దశలో లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్‌లు క్రీజులో ఉన్నా, పరుగులు జోడించే పరిస్థితి కనిపించలేదు. 43 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 252/8గా ఉంది. ఒక దశలో 200/4 వద్ద బాగా కనిపించిన జట్టు, దాదాపు 50 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది.
డికాక్ సెంచరీతో మొదలైన సఫారీ ఇన్నింగ్స్‌ను భారత బౌలర్లు మధ్య ఓవర్లలో అద్భుతంగా తిరగరాశారు. ముఖ్యంగా కుల్‌దీప్, ప్రసిద్ధ్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పరుగుల ప్రవాహాన్ని ఆపేశారు.
Read More
Next Story