48 గంటల్లోనే సూర్యవంశీ వైభవం తల్లకిందులు!
x
క్రికెటర్ సూర్యవంశీ

48 గంటల్లోనే సూర్యవంశీ 'వైభవం' తల్లకిందులు!

నిన్న కీర్తించిన నోళ్లే నేడు తెగనాడాయి!


ఆ పిల్లాణ్ణి ఆడనీయకుండా ఇంద్రుడు, చంద్రుడు, క్రికెట్ వీరుడు, శూరుడు అన్నారు. ఇప్పుడేమో అందరూ తిడుతున్నారు. వచ్చీ రాగానే అంత తొందరెందుకు, సంయమనం అవసరం లేదా అని తెగనాడుతున్నారు. అతడే వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశి వైభవం 48 గంటల్లోనే తలకిందులైంది. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో తొలిబంతికే డకౌట్ కావడమే ఇందుకు కారణం.
క్రికెట్ అనేది ఎంతటి అనిశ్చిత క్రీడో వైభవ్ సూర్యవంశీ ఉదంతం మరోసారి నిరూపించింది. నిన్నటి వరకు "వీరుడు.. శూరుడు.. భవిష్యత్తు స్టార్" అని ఆకాశానికెత్తిన నోళ్లే, నేడు ఒక్క విఫల ఇన్నింగ్స్‌తో విమర్శలు గుప్పిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డకౌట్ కావడంతో వైభవ్ 'వైభవం' ఒక్కసారిగా ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికి, క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడి వైభవం కేవలం 24 గంటల వ్యవధిలోనే ఒక్క డకౌట్‌తో వెలవెలబోయింది.
అప్పుడు అద్భుతం.. ఇప్పుడు అగాధం
వేలంలో భారీ ధర, అరంగేట్రంలో మెరుపులు.. ఇలా గడిచిన కొన్ని గంటలుగా వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోయింది. కానీ, ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ప్రఫుల్ హింగే వేసిన ఆ మాయాజాలానికి వైభవ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే, అది కూడా ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరడం ఈ యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశం.
ప్రఫుల్ దెబ్బకు విలవిల
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ప్రఫుల్ హింగే, వైభవ్‌ను ఖాతా తెరవకుండానే వెనక్కి పంపాడు. కేవలం వైభవ్‌నే కాకుండా, అదే ఓవర్‌లో ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్ వంటి కీలక ఆటగాళ్లను సైతం డకౌట్ చేయడంతో రాజస్థాన్ కోలుకోలేని స్థితికి చేరుకుంది.
క్రీడల్లో గెలుపోటములు సహజమే అయినా, భారీ అంచనాల మధ్య బరిలోకి దిగినప్పుడు ఇలాంటి వైఫల్యాలు మరింత చర్చకు దారితీస్తాయి. 24 గంటల కిందట స్టార్‌గా వెలిగిన సూర్యవంశీ, ఇప్పుడు విమర్శల పాలవ్వడం ఐపీఎల్ గ్లామర్ వెనుక ఉన్న చేదు నిజం. మరి ఈ పరాజయం నుండి పాఠాలు నేర్చుకుని వైభవ్ మళ్ళీ తన పేరుకు తగ్గట్టుగా ఎలా పుంజుకుంటాడో వేచి చూడాలి.
Read More
Next Story