గుకేష్ కు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ ప్రకటించిన  స్టాలిన్ సర్కార్
x

గుకేష్ కు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ ప్రకటించిన స్టాలిన్ సర్కార్

తెలుగు మూలాలు ఉన్నాయనే చర్చలు జరుగుతున్న సందర్భంలో ప్రైజ్ మనీ ప్రకటన


చిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజుకు తమిళ నాడు ప్రభుత్వం భారీ మొత్తంలో ప్రైజ్ మనీ ప్రకటించింది. సీఎం స్టాలిన్ రూ. 5 కోట్ల నగదును ఈ గ్రాండ్ మాస్టర్ కు అందజేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

గురువారం, 18 ఏళ్ల గుకేశ్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ (5 టైటిల్స్) తర్వాత ప్రపంచ ట్రోఫీని కైవసం చేసుకున్న రెండో భారతీయుడు గుకేష్ కావడం గమనార్హం. గుకేశ్ సాధించిన “స్మారక విజయాన్ని” పురస్కరించుకుని రూ. 5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించినట్లు స్టాలిన్ తెలిపారు.
“ పిన్న వయస్కుడైనప్పటికీ ప్రపంచ చెస్ ఛాంపియన్ సాధించిన @DGukesh విజయాన్ని పురస్కరించుకుని, ₹5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను! అతని చారిత్రాత్మక విజయం దేశానికి ఎనలేని గర్వాన్ని, ఆనందాన్ని తెచ్చిపెట్టింది. అతను ఇలాగే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యువ తారను పోషించడంలో అసాధారణమైన మద్దతు, ప్రోత్సాహం కోసం గౌరవనీయులైన @Udhaystalin, @SportsTN_లకు నా నమస్కరాలు’’ #WorldChessChampionship #GukeshD (sic)" అని స్టాలిన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
సింగపూర్ లో జరిగిన ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ లిరెన్‌పై 7.5-6.5 స్కోరుతో గుకేశ్ క్లాసికల్ టైమ్ ఫార్మాట్‌లో 14వ (చివరి గేమ్‌లో) గెలిచి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఛాంపియన్‌షిప్‌లో గెలుపొందినందుకు గుకేష్‌కు రూ.11 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది.
ప్రపంచ ఛాంపియన్ తన రాష్ట్రానికి చెందినదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెల్లడించడంతో గుకేష్ వారసత్వంపై ఆన్‌లైన్ చర్చల మధ్య ఈ ప్రకటన వచ్చింది. అయితే తెలుగు మూలాలున్న గుకేశ్ పుట్టి పెరిగింది మాత్రం తమిళనాడులోనే.



Read More
Next Story