
గంగూలీ
కొత్తగా కోచ్ పాత్రలో కనిపించనున్న గంగూలీ
దక్షిణాఫ్రికా లో టీ20 జట్టుకు ప్రధాన కోచ్ గా నియామకం
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, దాదా సౌరబ్ గంగూలీ కోచింగ్ కెరీర్ ను ప్రారంభించాడు. 2026 సీజన్ కోసం ఎస్ఏ20 ఫ్రాంచైజీ ప్రిటోరియా క్యాపిటల్స్ కొత్త ప్రధాన కోచ్ గా గంగూలీ నియమితులయ్యారు. ఆయన కెరీర్ లో తొలి ప్రయత్నం. దీనికి సంబంధించిన ప్రకటన ఆదివారం వెలువడింది.
మొదటి కోచింగ్ అసైన్ మెంట్..
అంతకుముందు ఈ జట్టుకు ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్ మెన్ జోనాథన్ ట్రాట్ కోచ్ గా ఉండేవాడు. అతను తప్పుకోవడంతో గంగూలీ ఇందులో చేరాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ షాన్ పొల్లాక్ అసిస్టెంట్ కోచ్ గా నియమితులయ్యారు.
ఎస్ఏ20 ఇంతకు ముందు 2025 సీజన్ కు ముందు ట్రాట్ ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు. కానీ ఫ్రాంచైజీ 10 గ్రూప్ మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలతో నాకౌట్ లను చేరుకోలేకపోయింది. ఆరు జట్ల టీ20 లీగ్ పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
‘‘జోనాథన్ ట్రాట్, మీ నాయకత్వానికి జట్టు పట్ల అచంచలమైన అంకితభావానికి ఎప్పటికీ కృతజ్ఞుడను’’ అని ఫ్రాంచైజీ ట్రాట్ కు వీడ్కోలు పలికింది. ఇదే సమయంలో గంగూలీకి స్వాగతం పలికింది.
‘‘ప్రిన్స్ క్యాపిటల్ శిబిరానికి రాజరికపు ప్రతిభను తీసుకురావడానికి సిద్దంగా ఉన్నాడు. సౌరబ్ గంగూలీని మా కొత్త చీఫ్ కోచ్ గా ప్రకటించడానికి మేము సంతోషంగా ఉన్నాము’’ అని ట్వీట్ చేసింది.
బీసీసీఐ చీఫ్ నుంచి ప్రధాన కోచ్..
గంగూలీ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా వ్యవహరించడం ఇదే తొలిసారి. గంగూలీ గతంలో 2018-19 వరకూ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్ గా పనిచేశాడు. బీసీసీఐ అధ్యక్షుడైన తరువాత ఆ పదవిని వదులుకున్నాడు.
2008 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత గంగూలీ క్రికెట్ పరిపాలనలోకి వెళ్లి 2019 నుంచి 2022 వరకూ బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశాడు. గత సంవత్సరం గంగూలీ జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్ లో క్రికెట్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఇది ప్రిటోరియా క్యాపిటల్స్ ను తో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కు సహ యజమానిగా ఉంది.
Next Story