కేరళకు రాబోతున్న ఫుట్ బాల్ స్టార్ మెస్సీ
అధికారికంగా పర్యటన ఖరారైందని తెలిపిన రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖ
అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఈ ఏడాది భారత పర్యటనకు రాబోతున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లో కేరళకు రాబోతున్నాడని ఆ రాష్ట్ర మంత్రి వి. అబ్దుర్ రహమాన్ ప్రకటించారు. ఆయన గత ఏడాది మెస్సీ పర్యటనకు రాబోతున్నాడని ప్రకటించారు.
తాజాగా దానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయినట్లు క్రీడామంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 25న కోజికోడ్ వస్తాడని, ఆయన నవంబర్ 2 వరకూ రాష్ట్రంలోనే ఉంటాడని పేర్కొంది. ఈ పర్యటనలో మెస్సీ ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటంతో పాటు పలు పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
పట్టుబట్టిన కేరళ..
2022 లో ఖతార్ లో జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్ ను మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా గెల్చుకుంది. ఆ తరువాత అర్జెంటీనా జట్టు ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి తన సమ్మతిని తెలియజేస్తూ సమాచారం ఇచ్చింది.
అయితే ఫెడరేషన్ అందుకు తిరస్కరించింది. ఖర్చులు భరించే శక్తి తమకు లేదని తను సమాచారం ఇచ్చింది. అయితే ఈ సమాచారం తెలుసుకున్న కేరళ క్రీడల శాఖ మంత్రి ఓ లేఖను అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కు పంపారు. తరువాత మంత్రిగారు స్వయంగా స్పెయిన్ కు వెళ్లి ఫుట్ బాల్ స్టార్ ను కలిశారు.
తరువాత మెస్సీ కేరళ రావడానికి సమ్మతించారు. ఈ పర్యటనలో మెస్సీతో పాటు అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు కూడా వస్తోంది. వారు ఇక్కడ ఓ మ్యాచ్ ఆడతారు. భారత్ లో కేరళ, వెస్ బెంగాల్ లో ఫుట్ బాల్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. భారత్ లో తమకున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలపడానికి వస్తామని 2022లోనే ఆ జట్టు ప్రకటించింది.
Next Story