
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లోకి ద్రవిడ్, అశ్విన్..
ఫ్రాంచైజీ కొనుగోలుకు భారత కన్సార్టియం సిద్ధం
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఈ లీగ్‌లో ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేయనున్న భారత పెట్టుబడిదారుల కన్సార్టియంలో వీరిద్దరూ భాగస్వాములుగా ఉన్నారని అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి.
‘బీబీసీ స్పోర్ట్’ నివేదిక ప్రకారం.. ఈ వేసవిలో ప్రారంభం కానున్న ఆరు జట్ల టోర్నమెంట్‌లో గ్లాస్గోకు చెందిన ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి భారత కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీ కొనుగోలు ప్రక్రియ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
అదే సమయంలో రోటర్‌డామ్‌కు చెందిన మరో డచ్ ఫ్రాంచైజీని దక్షిణాఫ్రికా పెట్టుబడిదారుల బృందం కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఈ బృందానికి మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఫాఫ్ డు ప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్, జాంటీ రోడ్స్ నేతృత్వం వహిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ రెండు ఫ్రాంచైజీలను ఈ నెలాఖరులో జరిగే ఒక కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమ్స్టర్డామ్, బెల్ఫాస్ట్, ఎడిన్‌బర్గ్ నగరాలకు చెందిన మూడు ఫ్రాంచైజీలను జనవరిలో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ పెట్టుబడిదారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
డబ్లిన్‌కు చెందిన ఒక ఫ్రాంచైజీ మాత్రమే ఇంకా అమ్ముడుపోలేదు. ఈ జట్టును కొనుగోలు చేయడానికి పలు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌లోని కనీసం రెండు జట్ల యజమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు బీబీసీ నివేదిక తెలిపింది.
ఇదిలా ఉండగా రవిచంద్రన్ అశ్విన్ ఈ లీగ్‌లో ఆటగాడిగా పాల్గొంటాడా లేదా అనే విషయం ఇంకా స్పష్టంగా లేదు. ప్రస్తుతం 39 ఏళ్ల అశ్విన్ డిసెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్‌లలో పాల్గొనే ఆసక్తి ఉన్నట్లు గతంలో ఆయన తెలిపిన విషయం తెలిసిందే.
ఇటీవల ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, మోకాలి గాయంతో ఆ టోర్నమెంట్‌లో ఆడలేకపోయాడు. గత డిసెంబర్‌లో చెన్నైలో శిక్షణ పొందుతున్న సమయంలో గాయపడిన అశ్విన్ శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం పునరావాసంలో ఉన్నాడు.
అశ్విన్ ఈ లీగ్‌లో ఆటగాడిగా పాల్గొంటే ETPLకు అది పెద్ద ఆకర్షణగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక రాహుల్ ద్రవిడ్ విషయానికి వస్తే, స్కాట్లాండ్ క్రికెట్‌తో ఉన్న పాత అనుబంధం కారణంగా గ్లాస్గో ఫ్రాంచైజీతో ఆయన అనుబంధం ఏర్పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2003లో స్కాట్లాండ్ తరపున విదేశీ ప్రొఫెషనల్ ఆటగాడిగా ద్రవిడ్ ఆడిన విషయం గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో స్కాట్లాండ్ జట్టు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ పరిమిత ఓవర్ల పోటీల్లో పాల్గొంది.
ఆ సీజన్‌లో నేషనల్ క్రికెట్ లీగ్‌లో ద్రవిడ్ 11 మ్యాచ్‌లు ఆడి మూడు సెంచరీలతో కలిపి 600 పరుగులు చేశాడు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన ద్రవిడ్, భారత జట్టుకు 164 టెస్టులు, 344 వన్డేలు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 48 సెంచరీలతో 24 వేలకుపైగా పరుగులు సాధించాడు.
క్రికెట్ కెరీర్ అనంతరం కూడా ఆయన భారత క్రికెట్‌కు సేవలందించారు. నవంబర్ 2021 నుంచి జూన్ 2024 వరకు భారత పురుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఇప్పుడు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో పెట్టుబడిదారులుగా ప్రవేశించబోతున్న ద్రవిడ్, అశ్విన్ అడుగు ప్రపంచ క్రికెట్‌లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలో జరిగే అధికారిక ప్రకటన తర్వాత ఈ లీగ్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

