బంతులా.. బుల్లెట్లా.. బూమ్రా ధాటికిి వణికిన ఆసీస్ బ్యాట్స్ మెన్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బీజీటీ సిరీస్ తొలి రోజు బౌలర్లు పండగ చేసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 150 పరుగులకే ఆలౌట్ కాగా, ఆసీస్ కూడా తడబాటు..
ఆసీస్ లోని పెర్త్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక బోర్డర్- గవాస్కర్ సిరీస్ తొలి టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు బౌలర్లు పండగ చేసుకున్నారు. టాస్ గెలిచిన తాత్కలిక కెప్టెన్ బూమ్రా బ్యాటింగ్ ఎంచుకోగా భారత్ కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. నితిశ్ కుమార్ రెడ్డి 41 టాప్ స్కోరర్. అయితే ఈ ఆనందం ఆసీస్ కు ఎక్కువ సేపు నిలవలేదు. బ్యాటింగ్ కు దిగిన కంగారులకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆట ముగిసే సమయానికి 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ జట్టు ఇంకా 83 పరుగులు వెనకబడి ఉంది.
భారత్ బ్యాట్స్ మెన్ తడబాటు..
టాస్ గెలిచిన సంతోషం భారత జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో వికెట్లు తీయడం మొదలు పెట్టారు. వీరి దెబ్బకు సినియర్, జూనియర్ బ్యాట్స్ మెన్ అనే తేడా లేకుండా వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. ఒపెనర్ యశ్వస్వీ జైస్వాల్, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ దేవదత్ పడిక్కల్ కనీసం ఖాతా కూడా తెరవలేదు.
మరో ఒపెనర్ కేఎల్ రాహుల్ మాత్రమే 26 పరుగులు చేయగా, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి కేవలం 5 పరుగులు చేసి వెనుదిరిగాడు. భారత ఏ జట్టు తరఫున్ అదరగొట్టిన ధ్రువ్ జురెల్ కూడా కేవలం 11 పరుగులు మాత్రమే సాధించాడు. పంత్, మరో అరంగ్రేట ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి(41) కలిసి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్ని కాసిన్ని పరుగులు చేశారు.
వీరు ఇద్దరు 48 పరుగులు జోడించారు. మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్, కమిన్స్ బౌలింగ్ లో బాదిన సిక్స్ తొలిరోజుకే హైలైట్ అని చెప్పవచ్చు. లంచ్ తరువాత ఎక్కువ సేపు భారత్ బ్యాటింగ్ చేయలేదు. కేవలం 49. 5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ తరఫున హజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, స్టార్క్, కమిన్స్, మార్ష్ లకు రెండు వికెట్లు దక్కాయి. కాగా కేఎల్ రాహుల్ అవుట్ ఈ మ్యాచ్ లో వివాదాస్పదంగా మారింది. బంతి బ్యాట్, ప్యాడ్ దేనికి తగిలిందో డీఆర్ఎస్ లో తెలియకున్నా థర్ఢ్ అంపైర్ అవుట్ ప్రకటించడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆసీస్ బ్యాట్స్ మెన్ల బ్రేక్ డ్యాన్స్
మొదటి ఇన్సింగ్స్ లో బ్యాటింగ్ దిగిన ఆసీస్ కు ఆరంభంలోనే కెప్టెన్ బుమ్రా(4/10) బుల్లెట్ లాంటి బంతులు విసిరి కంగారు పుట్టించాడు. మొదట మెక్ స్వీని, తరువాత ఖవాజా, స్మిత్ ను వెనక్కి పంపాడు. ధాటిగా ఆడబోయిన హెడ్ ను అరంగ్రేట బౌలర్ హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు.
రెండో స్పెల్ సిరాజ్ సైతం అద్బుతమైన బంతులు సంధించి రెండు వికెట్లు పడగొట్టాడు. వన్ డౌన్ బ్యాట్స్ మెన్ మార్నస్ లబుషేన్ 49 బంతులు ఆడి కేవలం 2 పరుగులే సాధించాడు. క్రీజులో ఉన్నంత సేపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఆట ముగిసే సమాయానికి వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అలెక్స్ కేరీకి తోడుగా, స్టార్క్ క్రీజులో ఉన్నారు. మొత్తం మీద ఒక్కరోజు ఇరు జట్లవి 17 వికెట్లు నేలకూలాయి.
Next Story