
‘సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును వీడరు’
ముంబై రంజీ జట్టును వీడతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్న ముంబై క్రికెట్ అసోసియేషన్
రాబోయే రంజీ ట్రోఫీ(Ranji Trophy) సీజన్‌కు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తన సహచరులతో కలిసి గోవా జట్టుకు మారతారని వచ్చిన వార్తలను ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) గురువారం తోసిపుచ్చింది. రంజీ జట్టు సీనియర్ ఆటగాళ్లతో విభేదాల కారణంగా తాను ముంబై(Mumbai) నుంచి గోవా(Goa)కు మారినట్లు యువ ముంబై ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే అంతర్-రాష్ట్ర బదిలీకి BCCI అనుమతి తప్పనిసరి.
అజింక్య రహానే నాయకత్వంలోని ముంబై రంజీ జట్టు నుంచి సూర్యకుమార్ వైదొలగుతారని ఒక మీడియాలో వచ్చింది. దీన్ని సూర్యకుమార్ కూడా తోసిపుచ్చాడు.
‘‘సూర్యకుమార్ జట్టు మారతారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. అసత్యాలను ఎవరూ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దు’’ అని ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అభయ్ హడప్ ఒక ప్రకటనలో కోరారు.
"MCA అధికారులు ఈ ఉదయం సూర్యతో మాట్లాడారు. అవన్నీ పుకార్లేనని నిర్ధారించుకున్నారు. సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టుతోనే ఉంటాడు. ముంబై తరపున ఆడటానికి ఆయన ఎంతో గర్వపడుతున్నాడు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని కోరుతున్నాము" అని హడప్ పేర్కొన్నారు.
హైదరాబాద్ తరఫున ఆడుతున్న తిలక్ వర్మ గోవాకు మారుతున్నట్లు వస్తున్న వార్తలు కూడా ఊహాగానాలేనని పేర్కొన్నారు.