ఆమె మూడు పూటలా తిండికే కష్టమైన రోజులను చూసింది. బాల్యమంతా అర్థాకలితోనే గడిపింది. పూట గడవని ఆ ఇంట పరుగుల ఆటను ఎంచుకుంది. వచ్చీ రాని పరుగుతో ముందుకు దూసుకెళ్లింది. అలా ఆమె దూకుడు రాకెట్‌ను తలపించింది. అథ్లెట్ శిక్షకుల దృష్టిలో పడింది. పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ పతకాల పంటను పండించింది. రికార్డులపై రికార్డుల మోత మోగించింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్ గౌరవాన్ని నిలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆమె ప్రతిభకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో పట్టం కట్టింది. ఇప్పుడు ఆ పరుగుల రాణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్–1 ఉద్యోగంతో పాటు 500 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి గౌరవించింది. ఆమె విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీ.. ఔరా! అనిపించే ఆమె ఆసక్తికరం ప్రస్థానంపై ఈ కథనం..
పరుగులో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ..
ఆకలితో అలమటించిన రోజుల నుంచి..
అథ్లెట్ జ్యోతి యర్రాజీ 1999 ఆగస్టు 29న విశాఖపట్నంలో జన్మించింది. జ్యోతి తండ్రి సూర్యనారాయణ (66) నగరంలోని డైమండ్ పార్కు వద్ద ఓ షాపులో నైట్ సెక్యూరిటీ గార్డు. తల్లి కుమారి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయాగా పనిచేసేది. వీరికొచ్చే అరకొర ఆదాయంతో తమ ఇద్దరి బిడ్డలు సురేష్, జ్యోతిల పోషణ అతి కష్టమ్మీద సాగింది. ఆకలేస్తుందమ్మా! ఏదైనా పెట్టు అని జ్యోతి అడిగితే.. ఇవిగో ఈ గంజి నీళ్లు తాగమ్మా! అని ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చేది. ఇలా కడుపు నిండా తిండి లేని రోజులెన్నిటినో జ్యోతి నెట్టుకొచ్చింది. అయినా బడి మానకుండా వెళ్లేది. అక్కడ పెట్టే మధ్యాహ్న భోజనం తినేది. అది అరిగే దాకా స్కూల్లో పరుగులు పెట్టేది. అలా ఆమె పరుగు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటుకుంటూ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇతరుల రికార్డులనే కాదు.. తన రికార్డులను కూడా తానే బద్దలు కొట్టేస్తోంది. సంచలనాలపై సంచలనాలను సృష్టిస్తూ భారతదేశానికి మరో పీటీ ఉషగా మారింది.
గెలుపు అనంతరం అభివాదం చేస్తూ..
ప్రాథమిక విద్య పోర్టు స్కూల్లో..
విశాఖ డీఎల్‌బీ పోర్టు హైస్కూలులో జ్యోతి పాఠశాల విద్యనభ్యసించింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలో ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేస్తోంది. తొలుత హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో చేరింది. 2019 నుంచి భువనేశ్వర్‌లోని రిలయెన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది.
విశాఖపట్నంలో జ్యోతి సొంతిల్లు ఇదే
జ్యోతి విజయాల్లో మచ్చుకు కొన్ని..
+ జ్యోతి యర్రాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. 100 మీటర్ల హర్డిల్స్‌లో నైపుణ్యంతో జాతీయ రికార్డును సాధించింది. జ్యోతి 2022 మే 10న 13.23 సెకన్లలో అనురాధ బిస్వాల్ (13.40 సెకన్లలో) చేసిన దీర్ఘకాల రికార్డును బద్దలుకొట్టింది.
+ 2022 అక్టోబర్ 17న భారత జాతీయ క్రీడల ఎడిషన్ వంద మీటర్ల హర్డిల్స్‌లో ఆమె 13 సెకన్లకన్నా తక్కువ సమయంలోనే వంద మీటర్ల హర్డిల్స్ సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.
+ 2022లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అదే ఏడాది 100 మీటర్ల మహిళల హర్డిల్స్‌లో రెండు అత్యుత్తమ ఆసియా పతకాలను గెలుచుకుంది.
+ 2022లో చైనా హాంగౌజ్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకోవడం జ్యోతి కెరీర్‌లో హైలెట్‌గా నిలిచింది.
+ 2023లో కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచింది. ఇండోర్ 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డును ఐదు సార్లు బద్దలుకొట్టింది.
+ 2024 ఫిబ్రవరి 17న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 60 మీటర్ల హర్డిల్స్‌లో 8.12 సెకన్లలోనే గమ్యం చేరి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ క్రమంలో ఆమె గత ఏడాది తానే నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును తానే బద్దలుకొట్టింది.
+ 2024 ఫిబ్రవరిలో ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ 30 అండర్ జాబితాలోకి ఆమె పేరును చేర్చింది.
ఏడాది క్రితం జ్యోతికి అర్జున్ అవార్డు..
అథ్లెట్ జ్యోతి యల్లాజీ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినందుకు ఆమెకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జనవరి 2న ప్రతిష్టాత్మక అర్జున్ అవార్డును ప్రకటించింది. దీంతో జ్యోతి టాలెంట్‌కు సముచిత గౌరవం దక్కినట్టయింది.
తాజాగా గ్రూప్–1 ఉద్యోగం.. 500 గజాలæ స్థలం..
జ్యోతి యర్రాజీ ప్రతిభను ప్రోత్సహిస్తూ సీఎం చంద్రబాబు నెల రోజుల క్రితం రూ.35 లక్షల చెక్కును విజయవాడలో అందజేశారు. తాజాగా ఇప్పుడు జ్యోతికి గ్రూప్–1 ఉద్యోగంతో పాటు విశాఖపట్నంలో 500 గజాల ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర కేబినెట్ బుధవారం తీర్మానం చేసింది. జ్యోతి డిగ్రీ పూర్తి చేయగానే గ్రూప్–1 ఉద్యోగం పొందనుంది.
జ్యోతి తల్లిదండ్రులు సూర్యనారాయణ, కుమారి
నడుచుకుంటూ తండ్రి నైట్ డ్యూటీకి..
తన కుమార్తె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఇప్పటికీ ఆ తండ్రి తన నైట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని మానలేదు. గతంలో ఓ షాపు యజమాని జ్యోతి తండ్రి ఆర్థిక పరిస్థితిని చూసి ఉదార స్వభావంతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చే రూ.8 వేల జీతం కోసం 66 ఏళ్ల వయసులో ప్రతిరోజూ రాత్రి తన ఇంటి నుంచి షాపు వద్దకు నడుచుకుంటూ వెళ్తుంటాడు జ్యోతి తండ్రి సూర్యనారాయణ.
జ్యోతి కుటుంబం ఆనంద పరవశం..
విశాఖ నగరంలోని కైలాసపురం బాపూజీనగర్ లోపల బైక్ కూడా వెళ్లలేని చోట 50 గజాల్లో ఓ పాత ఇంట్లో జ్యోతి కుటుంబం ఏళ్ల తరబడి ఉంటోంది. ఇటీవలే ఆ ఇంటిని ఖాళీ చేసి వేపగుంటలో అద్దె ఇంటికి మారింది. అథ్లెట్ జ్యోతి ఆ ఇంటికి ఆశా జ్యోతిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు ఆనంద పరవశులవుతున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో గ్రూప్–1 ఉద్యోగంతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తూ తీర్మానించిన విషయాన్ని బుధవారం మధ్యాహ్నం ఐటీ మంత్రి లోకేష్ తనకు ఫోన్ చేసి చెప్పారని జ్యోతి తన సోదరుడు సురేష్‌కు ఆనందంతో తెలియజేసింది. ‘ప్రస్తుతం మా చెల్లెలు మార్చిలో జరిగే గేమ్స్ కోసం ముంబైలో ప్రాక్టీసు చేస్తోంది. జ్యోతికి గ్రూప్–1 ఉద్యోగం, 500 గజాల ఇంటి స్థలం ఇస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఇంకా మా అమ్మా నాన్నలకు తెలియదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు. మా చెల్లెలకు జాబ్ వచ్చిందంటే మాకు వచ్చినట్టే కదా?’ అని జ్యోతి సోదరుడు సురేష్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో తన సంతోషాన్ని పంచుకున్నాడు.