
ఉత్సాహంగా ఏపీ లెజిస్లేచర్స్ స్పోర్ట్స్ మీట్
ఐక్యత, ఉల్లాసాలకు వేదికగా శాసనసభ్యుల క్రీడా ఉత్సవాలు.
ప్రజా ప్రతినిధుల దినచర్యలోని ఒత్తిడిని తాత్కాలికంగా మరచిపోయి, ఆటపాటలతో ఉల్లాసం పంచుకునే అపూర్వ వేదికగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా ఉత్సవాలు 2026 మంగళవారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ మూడురోజుల కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు లు క్రీడా జ్యోతి ప్రజ్వలన, స్పోర్ట్స్ ఫ్లాగ్, జాతీయ జెండా, అసెంబ్లీ జెండా ఆవిష్కరణతో శుభసూచకంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈ వేదిక కేవలం క్రీడల కోసమే. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు అని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల మధ్య తిరిగే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు, అభివృద్ధి పనులతో ఒత్తిడి ఎదుర్కుంటుంటారు. అటువంటి ప్రజా ప్రతినిధులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు గొప్ప మానసిక ఉపశమనం అని అన్నారు. 1983లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీలో దాదాపు 78 శాతం యువ ఎమ్మెల్యేలు ఉండటం ఈ పోటీలకు అదనపు ఉత్సాహం నింపుతుందని అన్నారు. “ప్రజలు కూడా వచ్చి తమ ప్రతినిధులను ప్రోత్సహించాలి” అని ఆహ్వానించారు.
తన చిన్నతనపు జ్ఞాపకాలు పంచుకుంటూ స్పీకర్ “నేను వాలీబాల్ ఆడేవాడిని. ఎన్టీఆర్ నా ఆట చూసి రాజకీయాల్లోకి ఆహ్వానించారు” అని గుర్తు చేసుకున్నారు. క్రీడా ఉత్సవాల ముగింపు రోజు (అసెంబ్లీ చివరి రోజు) ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలిసి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలిపారు. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రదానోత్సవం జరుగుతాయని ప్రకటించారు.
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ, గతంలో ఎన్టీఆర్ హయాంలో మొదలై మధ్యలో నిలిచిపోయిన ఈ అద్భుత సంప్రదాయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరిగి ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. పార్టీలు, వ్యక్తుల మధ్య చిన్న విభేదాలను మరచిపోయి అందరూ ఒక్కటై కలిసి మెలసి ఉండేందుకు ఈ క్రీడలు గొప్ప వేదిక అవుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలు, పాఠశాలల్లో క్రీడల ప్రాధాన్యతను మళ్లీ ప్రజలకు గుర్తు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా యువత, విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరిగి, జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులు ఉద్భవించడానికి ఇది నాంది కావాలని కోరారు.
శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ స్పీకర్ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, గత ఏడాది కంటే ఈసారి మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆకాంక్ష మేరకు ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో శాసనవ్యవస్థ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, డిప్యూటీ స్పీకర్ కే రఘురామ కృష్ణ రాజు, ప్రభుత్వ విప్‌లు జీవీ ఆంజనేయులు, పి అనురాధ, శాప్ వీసీ & ఎండీ ఎస్ భరణి పాల్గొన్నారు. మొదట స్పీకర్ అయ్యన్నపాత్రుడితో కలిసి అందరు ప్రజా ప్రతినిధులు కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.

