Coco Gauff
x
కోకో గాఫ్ తన బ్యాట్ ను విరగ్గొడుతున్నట్టున్న చిత్రాన్ని ఏఐ గ్రాఫిక్స్ ద్వారా రూపకల్పన

కొకొ గాఫ్ ఓటమి తర్వాత ఏమి చేసిందీ? యువత ఒత్తిడికి అది ప్రతీకా!

కొకొ గాఫ్ ఓటమి తర్వాత చేసిన చిన్న చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చ. ఇది కేవలం కోపం కాదు… యువత డిప్రెషన్, ప్రెషర్‌ల ప్రతిధ్వనా..


జనవరి 27 రాత్రి.. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 క్వార్టర్ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. స్టేడియం వెలుగులు చిమ్ముతోంది. ప్రేక్షకులు హోరెత్తుతున్నారు. 21 ఏళ్ల అమెరికన్ స్టార్ కోకోగాఫ్ ఉక్రెయిన్ (Ukraine) దేశానికి చెందిన ఎలినా స్విటోలినా (Elina Svitolina) చేతిలో 6-1, 6-2తో ఓడిపోయింది. ప్రేక్షకుల హోరు ఆగింది. కానీ కొకొ గాఫ్ అల్లాడిపోయింది. మనసు కల్లోలమైంది. ఓటమిని తట్టుకోలేకపోయింది. నిండా 20 ఏళ్లు కూడా లేని కోకోగాఫ్ కొన్ని నెలలుగా మంచి ఫామ్‌లో ఉంది. టైటిల్ కల కన్నది. ఈసారి ఆమె టోర్నమెంట్‌లో అడుగుపెట్టిన తీరు చూసి.. “ఈ ఏడాది ఆమెదే” అని చెప్పిన వాళ్లే ఎక్కువ.

ఆటలో జయాపజయాలు మామూలే. గంటలోపే మ్యాచ్ ముగిసిపోయింది. వరస సెట్లలో పరాజయం. కోర్ట్ లో ఆమె ఆట మాత్రమే కాదు… ఆమె ధైర్యం కూడా క్రమంగా సన్నగిల్లినట్టు కనిపించింది. మ్యాచ్ అయిపోయింది. హ్యాండ్‌షేక్ అయిపోయింది. కెమెరాలు ఇంకా ఫోకస్‌లోనే ఉన్నాయి. కానీ నిజమైన పోరాటం అప్పుడే మొదలైంది.
ఓటమి తర్వాత… మాటలకంటే ఎక్కువగా మాట్లాడిన ఆ మౌనం.. కొకొ ముఖంలో నవ్వు లేదు. మామూలుగా ఓటమిని కూడా గౌరవంగా తీసుకునే ఆమె… ఈసారి మాత్రం లోపల ఏదో విరిగిపోయింది. ఆమె నడక నెమ్మదిగా మారింది. ప్రపంచం మొత్తం చూస్తున్నా… ఆమె ఒంటరిగా అనిపించింది. లాకర్ రూమ్ వైపు వెళ్లే దారిలో.. ఎవరూ గమనించకుండా… ఆమె చేతిలో ఉన్న తన ఆయుధం- రాకెట్ ను ఒక్కసారిగా సిమెంట్ నేల మీద గట్టిగా కొట్టింది.
అలా మళ్లీ, మళ్లీ,, ఐదు, ఆరు సార్లు. అలా ఎన్ని సార్లు కొట్టిందో..తర్వాత ఆ రాకెట్ ను పక్కకు విసిరేసింది. అప్పుడు - ఆ సిమెంట్ నేలపై ప్రతిధ్వనించిన ఆ శబ్దం.. ఓ కల ముక్కలైన చప్పుడులా అనిపించింది.
అది కోపమా కాదు... అది బాధా, అసహనమా.. కాదు. మరేమిటీ.. తన మీద తనకే వచ్చిన నిరాశ. ఏమీ మాట్లాడలేదు.
కానీ ఆ శబ్దం మాత్రం చాలా మాట్లాడింది. ఇది ఓ క్రీడాకారుని బలహీనత కాదు… ఒక మనిషి నిజం.
ప్రపంచం కొకొ గాఫ్‌ను “స్టార్”గా చూస్తుంది. కానీ ఆమె కూడా ఒక యువతి. కలలు కనే పిల్ల. ఓటమిని జీర్ణించుకోవాల్సిన మనసు. ట్రోఫీలు మాత్రమే కాదు… ఈ ఆటలో ఓటములు కూడా భారమే.
దీనిపై ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జి. విజయసారధి ఇలా వివరించారు.
ఆమె చేసిన ఆ చిన్న చర్య, క్రీడాకారులపై ఉండే ఒత్తిడి ఎంత తీవ్రమో చెబుతుంది. ప్రతి మ్యాచ్ ఒక పరీక్ష. ప్రతి ఓటమి ఒక ప్రశ్న. “నేను సరిపోతున్నానా?”, “నేను ముందుకు వెళ్లగలనా?”

“ఈ ఆశల బరువు నేను మోయగలనా?” అనే తీవ్ర నిరాశ, నిస్పృహలో ఈ పని చేసింది.
కొకొ గాఫ్ కథ ఇంకా ఈ ఒక్క ఆటతోనే ముగియలేదు, బోలెడంత భవిష్యత్ ఉంది. ఇది ఆమె ప్రయాణంలో ఒక పేజీ మాత్రమే. ఇంకా చాలా టైటిళ్లు ఉన్నాయి. ఇంకా చాలా కథలు మిగిలి ఉన్నాయి.
ఆమె ఈ పని చేసినపుడు గుట్టుచప్పుడు కాకుండా ఓ యువకుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కొందరు ఫస్ట్రేషన్ అంటున్నారు, కొందరేమో చిన్న పిల్లల మనస్తత్వం అంటున్నారు. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. స్పోర్టవ్ తీసుకోవాల్సిన ఓటమిని బ్యాట్ పై కసి తీర్చుకున్నట్టుగా కనిపిస్తోందని, ఇంకా మానసికంగా ఎదగాల్సిన అవసరం ఉందనే వాళ్లూ ఉన్నారు.
కొకొ గాఫ్ రాకెట్ నేలపై పడిన శబ్దం…
అది కేవలం ఒక ఆటగాడి ఫ్రస్ట్రేషన్ కాదు.
అది ఈ తరం యువత అంతా మోస్తున్న ఒక అశాంతి ప్రతిధ్వని.
ఇప్పటి యువత జీవితాన్ని “ప్రాసెస్”గా కాకుండా “ఫలితం”గా చూస్తోంది.
విజయం రావాలి… వెంటనే రావాలి.
టైటిల్ రావాలి… ఇప్పుడే రావాలి.
అభినందనలు రావాలి… సోషల్ మీడియాలో ట్రెండ్ కావాలి.
ఓటమి ఒక పాఠం కాదు… ఒక అవమానం అన్నట్టు మారిపోయింది.
ప్రపంచం మారింది. పోటీ పెరిగింది. ప్రతిభతో పాటు ఒత్తిడి కూడా పెరిగింది.
కోకో గాఫ్ చేతిలో విరిగిన రాకెట్ ఆమె కెరీర్‌కు ముగింపు కాదు.. రేపు ఆమె సాధించబోయే అద్భుత విజయాలకు అది ఒక పునాది రాయి మాత్రమే. ఎందుకంటే, ఓటమిని తట్టుకోలేకపోయేంత కసి ఉన్నచోటే.. గెలుపు గుర్రం పుడుతుంది అని చెప్పారు డాక్టర్ విజయసారధి.
Read More
Next Story